కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?—2వ భాగం: మీ యథార్థతను కాపాడుకోండి

బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?—2వ భాగం: మీ యథార్థతను కాపాడుకోండి

 బైబిలు ఇలా చెప్తుంది: “యథార్థంగా నడుచుకునేవాళ్లకు యెహోవా ఏ మేలూ చేయకుండా ఉండడు.” (కీర్తన 84:11) ‘యథార్థంగా నడుచుకోవడం’ అంటే, యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మీరు ఆయనకు ఏమని మాటిచ్చారో దానికి తగినట్టు జీవించడమని అర్థం. (ప్రసంగి 5:4, 5) బాప్తిస్మం తర్వాత మీరు ఎలా యథార్థంగా నడుచుకోవచ్చు?

ఈ ఆర్టికల్‌లో …

 సమస్యల్ని సహిస్తూ ఉండండి

 ముఖ్య లేఖనం: “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి.”—అపొస్తలుల కార్యాలు 14:22.

 దానర్థం: క్రైస్తవులందరికీ సమస్యలు వస్తాయి. కొన్ని సమస్యలు, అంటే ఎగతాళి లేదా వ్యతిరేకత లాంటివి కేవలం మీరు క్రైస్తవులు కాబట్టే వస్తాయి. వాటితో పాటు డబ్బు సమస్యలు లేదా అనారోగ్యం లాంటివి అందరికి వచ్చినట్టే మీకూ వస్తాయి.

 ఏం జరగవచ్చు? ఒక్కోసారి మీ జీవితంలో పరిస్థితులు మారిపోవచ్చు, వాటిలో కొన్ని మీకు కష్టంగా ఉండవచ్చు. క్రైస్తవులైనా కాకపోయినా చెడ్డ సంఘటనలు అందరికీ జరగవచ్చని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 9:11.

 ఇలా చేయండి: సమస్యలు వస్తాయని మీకు తెలుసు కాబట్టి, వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడవచ్చు. మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి, యెహోవా మీద ఇంకా ఎక్కువ ఆధారపడడానికి సమస్యల్ని ఒక అవకాశంగా చూడండి. (యాకోబు 1:2, 3) అలా కొంతకాలానికి మీరు అపొస్తలుడైన పౌలులాగే ఇలా చెప్పగలుగుతారు: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.

 నిజంగా జరిగిన కథ.  “నేను బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే మా అన్నలు సత్యాన్ని విడిచిపెట్టారు, అమ్మానాన్నల అనారోగ్యం పాడైంది, తర్వాత నాకూ జబ్బు చేసింది. ఆ సమయంలో నేను దేవునికి సమర్పించుకున్న విషయం, నా జీవితంలో ఆయన ఆరాధనకు మొదటి స్థానం ఇస్తానని మాటిచ్చిన విషయం మర్చిపోయి బ్రతకడం తేలికే. కానీ నిజం ఏంటంటే, ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి నా సమర్పణే నాకు సహాయం చేసింది.”—క్యారేన్‌.

 టిప్‌: యోసేపు గురించి తెలుసుకోండి. ఆయన జీవితం గురించి ఆదికాండం 37, 39-41 అధ్యాయాల్లో ఉంది. ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ఆయనకు ఎలాంటి అనుకోని సమస్యలు ఎదురయ్యాయి? అప్పుడు ఆయన ఏంచేశాడు? యెహోవా ఆయనకు ఎలా సహాయం చేశాడు?

 ఇంకా సహాయం కావాలా?

 చెడు కోరికల్ని ఎదిరిస్తూ ఉండండి

 ముఖ్య లేఖనం: “ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది.”—యాకోబు 1:14.

 దానర్థం: ఒక్కోసారి మనందరిలో తప్పుడు కోరికలు మొదలవ్వవచ్చు, వాటిని తీసేసుకోకపోతే మనం చెడ్డ పనులు చేసే ప్రమాదముంది.

 ఏం జరగవచ్చు? బాప్తిస్మం తర్వాత కూడా మీలో “శరీర కోరికలు” కలగవచ్చు. (2 పేతురు 2:18) పెళ్లి కాకముందే సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక కూడా మీలో కలగవచ్చు.

 ఇలా చేయండి: ఇప్పుడే, అంటే తప్పు చేయాలనే కోరిక రాకముందే, కోరికల ఆధారంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తీర్మానించుకోండి. “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు” అని యేసు చెప్పాడని గుర్తుంచుకోండి. (మత్తయి 6:24) మీకు ఎవరు యజమానిగా ఉండాలో మీరే ఎంచుకోవచ్చు. యెహోవాను మీ యజమానిగా చేసుకోండి. తప్పుడు కోరిక ఎంత బలంగా ఉన్నా, దాని వెంట వెళ్లకూడదని మీరు నిర్ణయించుకోవచ్చు.—గలతీయులు 5:16.

 టిప్‌: మీ బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకోండి. మీరు మంచి లక్షణాల్ని చూపించేలా చేసే స్నేహితుల్ని ఎంచుకోండి. సరైనది చేయడం కష్టమయ్యేలా చేసే మనుషులకు, స్థలాలకు, పరిస్థితులకు దూరంగా ఉండండి.—కీర్తన 26:4, 5.

 ఇంకా సహాయం కావాలా?

 మీ ఉత్సాహాన్ని కాపాడుకుంటూ ఉండండి

 ముఖ్య లేఖనం: ‘అంతం వరకు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉండండి. అప్పుడు మీరు బద్దకస్తుల్లా తయారవ్వకుండా ఉంటారు.’—హెబ్రీయులు 6:11, 12.

 దానర్థం: పని మీద దృష్టి పెట్టకపోతే మెల్లమెల్లగా ఆసక్తి తగ్గిపోయి సోమరులం అవుతాం.

 ఏం జరగవచ్చు? బాప్తిస్మం తీసుకున్న కొత్తలో మీరు చాలా ఆసక్తితో, ఉత్సాహంతో సేవచేసి ఉంటారు. హృదయం నిండా యెహోవా మీద ప్రేమ ఉంటుంది. కానీ కొంతకాలానికి, ప్రతీ విషయంలో యెహోవాకు లోబడుతూ ఉండడం కష్టమని మీకు అనిపించవచ్చు. నిరుత్సాహం కారణంగా మీలో ఆసక్తి తగ్గిపోవచ్చు.—గలతీయులు 5:7.

 ఇలా చేయండి: ఎప్పుడూ సరైనదే చేస్తూ ఉండండి. అలా చేయాలని కొంతకాలం అనిపించకపోయినా, సరైనది చేస్తూనే ఉండండి. (1 కొరింథీయులు 9:27) ఈలోగా మీ పరలోక తండ్రి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ, ఇంకా తరచుగా ప్రార్థిస్తూ ఆయనకు మరింత దగ్గరవ్వండి. అలాగే, యెహోవా సేవను బాగా ఇష్టపడేవాళ్లతో స్నేహం బలపర్చుకోండి.

 టిప్‌: యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని, మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. కొంతకాలం మీ ఉత్సాహం తగ్గింది కాబట్టి ఆయన మీ విషయంలో నిరాశ చెందాడని అనుకోకండి. బైబిలు ఇలా చెప్తుంది: “అలసిపోయిన వాళ్లకు ఆయన ​శక్తినిస్తాడు, బలం లేనివాళ్లకు పూర్తి బలాన్ని ఇస్తాడు.” (యెషయా 40:29) మళ్లీ ఉత్సాహంతో సేవచేయడానికి మీరు చేసే ప్రయత్నాల్ని ఆయన దీవిస్తాడు.

 ఇంకా సహాయం కావాలా?

 ఒక్క మాటలో: మీరు యథార్థంగా నడుచుకుంటే, యెహోవా హృదయాన్ని సంతోషపెడతారు! (సామెతలు 27:11) మీరు తనవైపు ఉండాలని నిర్ణయించుకున్నందుకు ఆయన సంతోషిస్తాడు, సాతాను దాడుల్ని ఎదిరించడానికి కావల్సిన ప్రతీది ఆయన మీకు ఇస్తాడు.