కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నాకు బ్రతకాలని లేదు—నేనేం చేయాలి?

నాకు బ్రతకాలని లేదు—నేనేం చేయాలి?

 “కొన్ని సంవత్సరాల క్రితం నాకెంత ఆందోళనగా ఉండేదంటే, ప్రతీరోజు నాతో నేనే యుద్ధం చేస్తున్నట్లు అనిపించేది. చాలాసార్లు, ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను. నాకు నిజంగా చనిపోవాలని లేదు, ఆ ఒత్తిడి తట్టుకోలేక అలా అనిపించింది అంతే.”—జోనాతన్‌, 17.

 దాదాపు 14,000 మంది హైస్కూల్‌ విద్యార్థుల మీద సర్వే చేసినప్పుడు, వాళ్లలో దాదాపు ప్రతీ ఐదుగురిలో ఒకరు, గత 12 నెలల్లో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చెప్పారు. a మీకు కూడా అలానే అనిపిస్తుంటే, మీరేం చేయవచ్చు?

  •   కాస్త ఆలోచించండి. క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకండి. మీ సమస్యలు చాలా పెద్దవిగా అనిపించవచ్చు కానీ, చావు ఒక్కటే పరిష్కారం కాదు. వాటిని తట్టుకోవడానికి వేరే దారులు కూడా ఉన్నాయి.

 గందరగోళంగా ఉన్న సందుల్లో చిక్కుకుపోయినట్లు మీకు అనిపించవచ్చు. కానీ అనిపించినవన్నీ నిజాలు కాదు. దానినుండి బయటికి రావడానికి దారి ఉంది. మీరు సరైన సహాయం తీసుకుంటే, అనుకున్నదాని కన్నా తొందరగా బయటపడవచ్చు.

  •  బైబిలు సలహా: “మమ్మల్ని అన్నివైపులా కష్టాలు చుట్టుముడుతున్నాయి, కానీ పూర్తిగా కదల్లేని స్థితిలో లేము; అయోమయంలో ఉన్నాం, కానీ దిక్కుతోచని స్థితిలో లేము.”—2 కొరింథీయులు 4:8.

     సలహా: ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మిమ్మల్ని అదేపనిగా వేధిస్తుంటే, మీకెలాంటి సహాయం అందుబాటులో ఉందో తెలుసుకోండి. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో అయితే హెల్ప్‌లైన్‌ నంబర్లు ఉంటాయి, లేదా హాస్పిటల్లో ప్రత్యేకంగా దీనికోసమే ఒక విభాగం ఉంటుంది. అక్కడ, ఈ విషయాల్లో సహాయం చేయడానికి ట్రైనింగ్‌ తీసుకున్నవాళ్లు ఉంటారు. వాళ్లు నిజంగా మీకు సహాయం చేయాలని కోరుకుంటారు.

  •   ఎవరితోనైనా మాట్లాడండి. మిమ్మల్ని పట్టించుకునేవాళ్లతో లేదా మీకు సహాయం చేయాలని కోరుకునేవాళ్లతో మాట్లాడండి. వాళ్లు మీ ఫ్రెండ్స్‌ కావచ్చు, లేదా ఇంట్లోవాళ్లు కావచ్చు. మీరు చెప్తేనే మీ బాధేంటో వాళ్లకు తెలుస్తుంది.

 చూపు సరిగ్గా కనిపించని కొంతమందికి కళ్లజోడు అవసరం. అలాగే మీ సమస్యల్ని సరిగ్గా చూడడానికి, బ్రతకాలనే ఆశను మీలో తిరిగి కలిగించడానికి మీకొక ఫ్రెండ్‌ అవసరం.

  •  బైబిలు సలహా: ‘నిజమైన స్నేహితుడు కష్టకాలంలో సహోదరుడిలా ఉంటాడు.’—సామెతలు 17:17.

     సలహా: మీరు ఇలా మొదలుపెట్టవచ్చు: “నాకు ఈమధ్య కొంతకాలంగా చాలా నెగెటివ్‌ ఆలోచనలు వస్తున్నాయి. నీతో దానిగురించి మాట్లాడవచ్చా?” లేదా “నాకు నేనుగా పరిష్కరించుకోలేని కొన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు నాకు హెల్ప్‌ చేస్తావా?”

  •   డాక్టర్‌కి చూపించుకోండి. ఆందోళన లేదా డిప్రెషన్‌ వంటి సమస్యలు ఉన్నవాళ్లకు బ్రతకాలని అనిపించదు. కానీ మంచి విషయం ఏంటంటే, అవి నయం అయ్యే సమస్యలే.

 జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాకపోవచ్చు, అదేవిధంగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు బ్రతకాలని అనిపించకపోవచ్చు. కానీ, ఆ రెండూ నయం అయ్యే సమస్యలే.

  •  బైబిలు సలహా: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.”—మత్తయి 9:12.

     సలహా: కంటినిండా నిద్రపోండి, ఎక్సర్‌సైజ్‌ చేయండి, మంచి ఆహారం తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటే జీవితం మీద ఆశ పెరగవచ్చు.

  •   ప్రార్థించండి. మన సృష్టికర్త “మన హృదయాల కన్నా గొప్పవాడని, ఆయనకు అన్నీ తెలుసని” బైబిలు చెప్తుంది. (1 యోహాను 3:20) ఆయనకు ఈరోజే ఎందుకు ప్రార్థించకూడదు? మీరు ప్రార్థిస్తున్నప్పుడు యెహోవా అనే ఆయన పేరును ఉపయోగించండి. అలాగే, మీ మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పండి.

 కొన్ని బరువుల్ని మీరు ఒక్కరే మోయలేరు. వాటిని మోయడంలో సహాయం చేయడానికి, మీ సృష్టికర్త అయిన యెహోవా సిద్ధంగా ఉన్నాడు.

  •  బైబిలు సలహా: “మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి . . . అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి … మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”—ఫిలిప్పీయులు 4:6, 7.

     సలహా: యెహోవాకు మీ సమస్యల గురించి చెప్పడంతో పాటు, ఈరోజు ఆయన చేసిన కనీసం ఒక్క మేలుకు థాంక్స్‌ చెప్పడానికి ప్రయత్నించండి. (కొలొస్సయులు 3:15) కృతజ్ఞత ఉంటే, మీకు జీవితం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది.

 మీకు బ్రతకాలని అనిపించకపోతే, సహాయం తీసుకోండి. ఈ ఆర్టికల్‌ మొదట్లో చూసిన జోనాతన్‌ అదే చేశాడు. అతనిలా అంటున్నాడు: “నేను చాలాసార్లు మా మమ్మీడాడీతో మాట్లాడాల్సి వచ్చింది, అలాగే డాక్టర్‌కి కూడా చూపించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను బాగున్నాను. నా జీవితంలో ఇప్పటికీ ఆటుపోట్లు ఉన్నాయి కానీ, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలైతే ఇప్పుడు లేవు.”

a 2019 లో యూ.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వాళ్లు ఈ సర్వే చేశారు.