కంటెంట్‌కు వెళ్లు

666 అంటే ఏంటి?

666 అంటే ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్లోని చివరి పుస్తకం ప్రకారం 666 అనేది ఒక క్రూరమృగానికున్న సంఖ్య లేదా పేరు. ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న ఆ మృగం సముద్రంలో నుండి బయటకు వస్తుంది. (ప్రకటన 13:1, 17, 18) ఈ క్రూరమృగం, “ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడువారిమీదను ప్రతిజనము మీదను” అధికారం చెలాయించే ప్రపంచవ్యాప్త రాజకీయ వ్యవస్థకు గుర్తుగా ఉంది. (ప్రకటన 13:7) ఈ రాజకీయ వ్యవస్థ దేవుని దృష్టిలో ఘోరంగా విఫలమైందని 666 అనే పేరు సూచిస్తుంది. అదెలాగో చూద్దాం?

  అది కేవలం పేరు మాత్రమే కాదు. దేవుడు పెట్టే పేర్లకు అర్థం ఉంటుంది. ఉదాహరణకు, అబ్రాహామును “అనేక జనాంగాలకు తండ్రిగా చేస్తానని” వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అతని పేరును మార్చాడు. “తండ్రి ఉన్నతుడు” అనే అర్థమున్న అబ్రాము అనే పేరును మార్చి “అనేక జనములకు తండ్రి” అనే అర్థమున్న అబ్రాహాము అనే పేరును దేవుడు అతనికి పెట్టాడు. (ఆదికాండము 17:5) అలాగే, ఆ మృగానికున్న ప్రత్యేక లక్షణాలకు గుర్తుగా దేవుడు దానికి 666 అనే పేరు పెట్టాడు.

  ఆరు అనే సంఖ్య అపరిపూర్ణతను సూచిస్తుంది. బైబిల్లో చాలాచోట్ల సంఖ్యలను గుర్తులుగా వాడారు. ఏడు అనే సంఖ్య సాధారణంగా సంపూర్ణతను లేదా పరిపూర్ణతను సూచిస్తుంది. ఏడుకు ఒకటి తక్కువైన ఆరు, దేవుని దృష్టిలో అపరిపూర్ణమైన దాన్ని లేదా లోపమున్న దాన్ని సూచిస్తుంది. అది దేవుని శత్రువులకు సంబంధించినది.—1 దినవృత్తాంతములు 20:6; దానియేలు 3:1.

  నొక్కి చెప్పడానికి మూడుసార్లు చెప్తారు. బైబిలు కొన్నిసార్లు ఓ విషయాన్ని బాగా నొక్కి చెప్పడానికి దాన్ని మూడుసార్లు చెప్తుంది. (ప్రకటన 4:8; 8:13) కాబట్టి 666 అనే పేరు, మానవ రాజకీయ వ్యవస్థలు దేవుని దృష్టిలో ఘోరంగా విఫలమయ్యాయని బలంగా నొక్కి చెప్తుంది. అవి నిత్య శాంతిని, భద్రతను సాధించడంలో విఫలమౌతూనే ఉన్నాయి. దేవుని రాజ్యం మాత్రమే నిత్య శాంతిని, భద్రతను తెస్తుంది.

క్రూరమృగం ముద్ర

 ప్రజలు ఆ క్రూరమృగాన్ని చూసి ఎంతగా ‘ఆశ్చర్యపడుతూ’ దాని వెంట వెళ్తారంటే, వాళ్లు దాని ఆరాధకులైపోతారు. దాంతో వాళ్లు “ఆ క్రూరమృగము యొక్క ముద్ర” పొందుతారని బైబిలు చెప్తుంది. (ప్రకటన 13:3, 4; 16:2) తమ దేశాలకు, వాటి గుర్తులకు, వాటి సైనికశక్తులకు ఆరాధనతో కూడిన గౌరవాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలు ఆ క్రూరమృగాన్ని ఆరాధిస్తారు. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజియన్‌ చెప్తున్నట్లు, “జాతీయతా భావం ఆధునిక ప్రపంచంలో ఓ బలమైన మతంగా తయారైంది.”

 ఒక వ్యక్తి కుడి చేతిమీద గానీ, నుదుటిమీద గానీ ఆ క్రూరమృగం గుర్తు ఎలా వేయబడుతుంది? (ప్రకటన 13:16) దేవుడు ఇశ్రాయేలీయులతో తన ఆజ్ఞల గురించి మాట్లాడుతూ, “వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను” అన్నాడు. (ద్వితీయోపదేశకాండము 11:18) అంటే దానర్థం, ఇశ్రాయేలీయులు దేవుని మాటలను తమ చేతుల మీద, నుదుటిమీద రాసుకోవాలని కాదు. కానీ వాళ్ల పనులు, వాళ్ల ఆలోచనలు దేవుని వాక్య నిర్దేశానికి అనుగుణంగా ఉండాలని అర్థం. అలాగే, క్రూరమృగం ముద్ర కూడా 666 అని పచ్చబొట్టు పొడిపించుకోవడం లాంటిది కాదు. తమ జీవితాలను రాజకీయ వ్యవస్థల చేతుల్లో పెట్టిన ప్రజలు ఒక రకంగా ఆ ముద్ర వేయించుకున్నట్టే. అలా ఆ క్రూరమృగం ముద్ర వేయించుకున్నవాళ్లు దేవునికి వ్యతిరేకులౌతారు.—ప్రకటన 14:9, 10; 19:19-21.