యోహానుకు ఇచ్చిన ప్రకటన 19:1-21

  • యెహోవా తీర్పుల్ని బట్టి ఆయన్ని స్తుతించండి (1-10)

    • గొర్రెపిల్ల పెళ్లి (7-9)

  • తెల్లని గుర్రం మీదున్న వ్యక్తి (11-16)

  • దేవుని గొప్ప విందు (17, 18)

  • క్రూరమృగం ఓడించబడింది (19-21)

19  ఆ తర్వాత, చాలామంది దేవదూతల స్వరం లాంటి పెద్ద స్వరం పరలోకం నుండి రావడం నేను విన్నాను. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి!* రక్షణ, మహిమ, శక్తి మన దేవునికి చెందుతాయి.  ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.+ ఎందుకంటే, గొప్ప వేశ్య మీద ఆయన తీర్పు అమలుచేశాడు. ఆమె తన లైంగిక పాపంతో* భూమిని పాడుచేసింది. దేవుడు తన సేవకుల రక్తం విషయంలో ఆమె మీద పగ తీర్చుకున్నాడు.”+  వెంటనే రెండోసారి వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి!* ఆమె కాలిపోవడం వల్ల వచ్చే పొగ యుగయుగాలు పైకి లేస్తుంది.”+  అప్పుడు 24 మంది పెద్దలు, నాలుగు జీవులు మోకరించి, సింహాసనం మీద కూర్చునే దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు: “ఆమేన్‌! యెహోవాను స్తుతించండి!”*  అంతేకాదు, సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం ఇలా అంది: “సామాన్యులే గానీ గొప్పవాళ్లే గానీ దేవునికి భయపడే+ ఆయన దాసులారా, మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి.”  అప్పుడు ఒక శబ్దం విన్నాను. అది పెద్ద గుంపు స్వరంలా, అనేక జలాల శబ్దంలా, పెద్ద ఉరుముల శబ్దంలా ఉంది. వాళ్లు ఇలా అన్నారు: “యెహోవాను స్తుతించండి,* సర్వశక్తిమంతుడూ+ మన దేవుడూ అయిన యెహోవా* రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు!+  మనం సంతోషిస్తూ సంబరపడుతూ ఆయన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే గొర్రెపిల్ల పెళ్లి దగ్గరపడింది, ఆయనకు కాబోయే భార్య పెళ్లికోసం సిద్ధంగా ఉంది.  శుభ్రమైన, మెరిసే, సన్నని నారవస్త్రం వేసుకోవడానికి ఆమెకు అనుమతి ఇవ్వబడింది. ఎందుకంటే, సన్నని నారవస్త్రం పవిత్రుల నీతికార్యాల్ని సూచిస్తుంది.”+  ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఈ మాటలు రాయి: గొర్రెపిల్ల గొప్ప పెళ్లివిందుకు ఆహ్వానించబడిన వాళ్లు ధన్యులు.”*+ అంతేకాదు అతను నాతో, “ఇవి దేవుని నమ్మదగిన మాటలు” అని కూడా అన్నాడు. 10  అప్పుడు నేను అతన్ని ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను. కానీ అతను, “వద్దు! అలా చేయొద్దు!+ నేను కూడా నీలాగే, యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడిన నీ సహోదరుల్లాగే ఒక దాసుణ్ణి మాత్రమే.+ దేవుణ్ణే ఆరాధించు!+ ఎందుకంటే యేసు గురించి సాక్ష్యమివ్వడమే ప్రవచనాల ఉద్దేశం”+ అని నాతో అన్నాడు. 11  ఆ తర్వాత, పరలోకం తెరవబడి ఉండడం నేను చూశాను. అప్పుడు ఇదిగో! ఒక తెల్లని గుర్రం+ కనిపించింది. దానిమీద కూర్చొని ఉన్న వ్యక్తికి నమ్మకమైనవాడు-సత్యవంతుడు+ అనే పేరు ఉంది. దేవుని నీతి ప్రమాణాల ప్రకారం ఆయన తీర్పుతీరుస్తాడు, యుద్ధం చేస్తాడు.+ 12  ఆయన కళ్లు అగ్నిజ్వాలలా ఉన్నాయి.+ ఆయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు రాయబడివుంది, అది ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలీదు. 13  రక్తం మరకలు ఉన్న* పైవస్త్రాన్ని ఆయన వేసుకొని ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యం అనే పేరుంది.+ 14  అంతేకాదు, పరలోక సైన్యాలు తెల్లని గుర్రాల మీద ఆయన్ని అనుసరిస్తున్నాయి. వాళ్లు శుభ్రమైన, తెల్లని, సన్నని నారవస్త్రాలు వేసుకొని ఉన్నారు. 15  దేశాల్ని నాశనం చేయడానికి ఆయన నోటి నుండి పదునైన, పొడవాటి ఖడ్గం+ వస్తోంది. ఆయన ఇనుప దండంతో వాళ్లను పరిపాలిస్తాడు.+ అంతేకాదు, సర్వశక్తిమంతుడైన దేవుని మహా కోపమనే ద్రాక్షతొట్టిని ఆయన తొక్కుతాడు.+ 16  రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు+ ఆయన పైవస్త్రం తొడ భాగం మీద రాయబడివుంది. 17  అంతేకాదు, సూర్యుని మధ్యలో నిలబడివున్న ఒక దేవదూతను నేను చూశాను. అతను పెద్ద స్వరంతో అరిచి, ఆకాశం మధ్యలో* ఎగిరే పక్షులన్నిటితో ఇలా అన్నాడు: “ఇక్కడికి రండి, దేవుని గొప్ప విందు కోసం సమకూడండి.+ 18  రాజుల మాంసాన్ని, సహస్రాధిపతుల* మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని,+ గుర్రాల మాంసాన్ని, వాటిమీద కూర్చున్న వాళ్ల మాంసాన్ని,+ అందరి మాంసాన్ని అంటే స్వతంత్రుల-దాసుల, సామాన్యుల-గొప్పవాళ్ల మాంసాన్ని తినడానికి రండి.” 19  ఆ తర్వాత, గుర్రం మీద కూర్చున్న వ్యక్తితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి క్రూరమృగం, భూమ్మీది రాజులు, వాళ్ల  సైన్యాలు సమకూడడం+ నేను చూశాను. 20  గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ క్రూరమృగాన్ని, అబద్ధ ప్రవక్తను+ పట్టుకున్నాడు. క్రూరమృగం ముందు ఆశ్చర్యకార్యాలు చేసి, క్రూరమృగం గుర్తును వేయించుకున్నవాళ్లనూ+ దాని ప్రతిమను పూజించేవాళ్లనూ+ మోసం చేసింది ఈ అబద్ధ ప్రవక్తే. ఆ క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఇంకా బ్రతికుండగానే అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో  పడేయబడ్డారు.+ 21  అయితే మిగతావాళ్లు మాత్రం, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వచ్చిన పొడవాటి ఖడ్గంతో చంపబడ్డారు.+ వాళ్ల మాంసాన్ని పక్షులన్నీ కడుపునిండా తిన్నాయి.+

అధస్సూచీలు

లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
అనుబంధం A5 చూడండి.
లేదా “హల్లెలూయా!” “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “సంతోషంగా ఉంటారు.”
లేదా “రక్తం చిమ్మబడిన” అయ్యుంటుంది.
లేదా “తల పైన.”
వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.