యోహానుకు ఇచ్చిన ప్రకటన 4:1-11

  • పరలోకంలో యెహోవా సన్నిధికి సంబంధించిన దర్శనం (1-11)

    • యెహోవా తన సింహాసనం మీద కూర్చొని ఉండడం (2)

    • సింహాసనాల మీద 24 మంది పెద్దలు (4)

    • నాలుగు జీవులు (6)

4  ఆ తర్వాత నేను చూసినప్పుడు పరలోకంలో తెరిచివున్న ఒక తలుపు కనిపించింది. నేను మొదట విన్న స్వరం బాకా శబ్దంలా ఉంది. అది నాతో, “ఇక్కడికి ఎక్కి రా, జరగాల్సిన సంగతుల్ని నీకు చూపిస్తాను” అంది.  వెంటనే దేవుని పవిత్రశక్తి నా మీదికి వచ్చింది. ఇదిగో, పరలోకంలో ఒక సింహాసనాన్ని చూశాను, దానిమీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.+  ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి రూపం సూర్యకాంతపు రాయిలా,+ కెంపులా* ఉంది. సింహాసనం చుట్టూ మరకతం లాంటి ఇంద్రధనుస్సు ఉంది.+  ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. వాటిమీద 24 మంది పెద్దలు+ కూర్చొని ఉండడం చూశాను. వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు. వాళ్ల తలల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి.  సింహాసనం నుండి మెరుపులు,+ స్వరాలు, ఉరుములు+ వస్తున్నాయి. సింహాసనం ముందు మండుతున్న ఏడు పెద్ద దీపాలు ఉన్నాయి. అవి దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి.+  సింహాసనం ముందు గాజు లాంటి, స్ఫటికం లాంటి సముద్రం+ ఉంది. మధ్యలో, సింహాసనం ఉన్న చోట,* సింహాసనం చుట్టూ నాలుగు జీవులు+ ఉన్నాయి. వాటి ముందుభాగం, వెనుకభాగం కళ్లతో నిండిపోయాయి.  మొదటి జీవి సింహంలా+ ఉంది, రెండో జీవి ఎద్దులా+ ఉంది, మూడో జీవి+ ముఖం మనిషి ముఖంలా ఉంది, నాలుగో జీవి+ ఎగిరే గద్దలా+ ఉంది.  ఆ నాలుగు జీవుల్లో ప్రతీ దానికి ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల నిండా కళ్లు ఉన్నాయి.+ ఆ జీవులు రాత్రింబగళ్లు ఇలా అంటూనే ఉన్నాయి: “సర్వశక్తిమంతుడు, ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడు, రాబోతున్నవాడు+ అయిన యెహోవా* దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.”+  సింహాసనం మీద కూర్చున్న, యుగయుగాలు జీవించే దేవునికి+ ఆ జీవులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు చెల్లించే ప్రతీసారి 10  ఆ 24 మంది పెద్దలు+ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ముందు మోకరించి యుగయుగాలు జీవించే దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్లు తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు వేసి ఇలా అంటారు: 11  “యెహోవా* మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు;+ నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ,+ ఘనత,+ శక్తి+ పొందడానికి నువ్వు అర్హుడవు.”

అధస్సూచీలు

లేదా “అమూల్యమైన ఎర్రని రాయిలా.”
లేదా “సింహాసనంతో పాటు.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.