కంటెంట్‌కు వెళ్లు

మీ సమాజం కోసం రాజ్యమందిరం ఏమి చేస్తుంది?

మీ సమాజం కోసం రాజ్యమందిరం ఏమి చేస్తుంది?

ఒక శతాబ్దం కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి యెహోవాసాక్షులు తమ ఆరాధనా స్థలాల్ని తామే డిజైన్‌ చేసి నిర్మిస్తున్నారు. రాజ్యమందిరం అని పిలువబడే ఈ ఆరాధనా స్థలాల్లో ఒకదాన్ని మీ ప్రాంతంలో కడుతున్నారా? రాజ్యమందిరం వల్ల మీ సమాజానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

ఫ్లవరీ బ్రాంచ్‌, అమెరికాలోని జార్జియా

“సమాజానికి అందమైన కానుక”

రాజ్యమందిరాల్ని ఎలా డిజైన్‌ చేస్తారంటే, వాటివల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు అందం వస్తుంది. అమెరికాలో రాజ్యమందిరాల నిర్మాణ పనిని కో-ఆర్డినేట్‌ చేసే జేసన్‌ ఇలా అంటున్నాడు: “ప్రతీ రాజ్యమందిరాన్ని, ఆ ప్రాంతంలోని అత్యంత అందమైన భవనాల్లో, హుందాగా ఉండే భవనాల్లో ఒకటిగా చేయాలన్నదే మా లక్ష్యం.” డిజైన్‌ టీంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే ఒక యెహోవాసాక్షి ఇలా అంటున్నాడు: “నిర్మాణం పూర్తైన రాజ్యమందిరం, సమాజానికి అందమైన కానుకగా ఉండాలి, అది చుట్టుపక్కల ఉన్నవాటి మీద సానుకూల ప్రభావం చూపించాలి అన్నదే మా ఉద్దేశం.”

రాజ్యమందిర నిర్మాణంలో పనిచేసేవాళ్లు యెహోవాసాక్షులు. వాళ్లు తమ సమయాన్ని, నైపుణ్యాల్ని స్వచ్ఛందంగా ఉపయోగిస్తారు; మంచి నాణ్యమైన భవనాలు కట్టాలనేదే వాళ్ల బలమైన కోరిక. తరచూ వాళ్ల పనితనాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఉదాహరణకు, అమెరికాలోని టెక్సస్‌కు చెందిన రిచ్‌మండ్‌ నగరంలో ఈమధ్యే ఒక రాజ్యమందిరాన్ని నిర్మించారు; ఆ సమయంలో స్థానిక బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, తాను అప్పటివరకు ఆ రాజ్యమందిరం పైకప్పు అంత చక్కని పైకప్పును చూడలేదని చెప్పాడు. జమైకా ద్వీపంలో ఒక బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్యమందిర నిర్మాణ పనిని చూపించడానికి కొంతమంది కొత్త ఇన్‌స్పెక్టర్‌లను తీసుకెళ్లి వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ ప్రజల గురించి మీరు ఎప్పటికీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. యెహోవాసాక్షులు ప్లాన్‌లను జాగ్రత్తగా పాటిస్తారు, చివరికి స్థానిక నిర్మాణ కోడ్‌ల కన్నా ఎక్కువే పాటిస్తారు.” అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒక నగరంలోని బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇలా అన్నాడు: “నేను హాస్పిటల్స్‌ని, పెద్దపెద్ద ప్రభుత్వ ప్రాజెక్టుల్ని ఇన్స్‌పెక్ట్‌ చేశాను కానీ ఇంత పద్ధతిగా ఉన్నదాన్ని చూడలేదు. మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు.”

జింబాబ్వేలోని కన్సెషన్‌

చుట్టుపక్కల ఉన్నవాటి మీద సానుకూల ప్రభావం

రాజ్యమందిరంలో జరిగే కూటాలు, వాటికి వచ్చేవాళ్ల జీవితాల మీద సానుకూల ప్రభావం చూపిస్తాయి. వాళ్లకు మంచి తండ్రులుగా, మంచి తల్లులుగా, మంచి పిల్లలుగా ఎలా ఉండాలో నేర్పిస్తారు. రాజ్యమందిర డిజైన్‌ టీంలో పనిచేసే రాడ్‌ ఇలా వివరిస్తున్నాడు: “ప్రతీ రాజ్యమందిరం ఒక విద్యా కేంద్రం లాంటిది, అక్కడ ఉన్నతమైన నైతిక ప్రమాణాలు పాటించాలని ప్రోత్సహిస్తారు. వాటివల్ల అన్ని సమాజాల వాళ్లకు ప్రయోజనమే.” అతను ఇంకా ఇలా అంటున్నాడు: “జీవితంలో పరీక్షలు ఎదురైనప్పుడు, కావల్సిన సహాయం ఇక్కడ దొరుకుతుంది. లోపల చక్కని ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఓదార్పు అవసరమైనవాళ్లు, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకునేవాళ్లు అక్కడ ఎంతో ప్రయోజనం పొందుతారు.”

రాజ్యమందిరాలకు వెళ్లేవాళ్లు తమ పొరుగువాళ్ల గురించి పట్టించుకుంటారు, విపత్తు వచ్చినప్పుడు వెంటనే సహాయం చేస్తారు. ఉదాహరణకు, 2016లో మాథ్యూ అనే హరికేన్‌ బహమాస్‌ మీద విరుచుకుపడినప్పుడు, యెహోవాసాక్షులు 254 ఇళ్లను బాగుచేశారు. ఒక ప్రాంతంలో, వైలట్‌ అనే 80 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లోకి నీళ్లు చేరాయి. ఆమె, సహాయక చర్యల్లో పాల్గొంటున్న యెహోవాసాక్షుల టీం దగ్గరికి వచ్చి ఏదోలా సహాయం చేయమని కోరింది, అందుకు డబ్బులు ఇస్తానని చెప్పింది. వాళ్లు డబ్బులు తీసుకోలేదు కానీ ఆమె ఇంటి పైకప్పులో ఊడిపోయిన పెంకుల్ని అమర్చి, అది కారకుండా ఆపారు. ఆ తర్వాత ఒక కొత్త గోడను నిలబెట్టి, దాన్ని పూర్తిచేసి, ఆ ఇంటి హాలు పైకప్పును బాగుచేశారు. పని అయిపోయాక వైలట్‌ ఆ టీంలో ఉన్న ప్రతీ ఒక్కర్ని కౌగలించుకొని పదేపదే కృతజ్ఞతలు చెప్తూ, “నిజంగా మీరు దేవుని ప్రజలు!” అని అంది.

బాడ్‌ ఓయ్న్‌హౌసెన్‌, జర్మనీలోని నార్త్‌ రైన్‌-వెస్ట్‌ఫాలియా

‘రాజ్యమందిరం మా ప్రాంతంలో ఉన్నందుకు మేం సంతోషిస్తున్నాం’

రాజ్యమందిరాల్ని చక్కని స్థితిలో ఉంచడానికి యెహోవాసాక్షులు ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో వాళ్లు, తమ రాజ్యమందిరాల్ని మంచి స్థితిలో ఎలా ఉంచుకోవాలో స్థానిక సంఘంలోని వాళ్లకు శిక్షణ ఇస్తారు. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఉదాహరణకు, రాజ్యమందిరంలో జరిగే కూటానికి రమ్మని అమెరికాలోని ఒకామెను ఆహ్వానించినప్పుడు ఆమె వెళ్లింది. ఆమె, ఆ హాలును ఎంత మంచి స్థితిలో ఉంచారనే దాని గురించి మాట్లాడింది. అంతేకాదు, అప్పటికే మంచి స్థితిలో ఉన్న హాలును ఇంకా మెరుగుపర్చడానికి ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్‌ కార్యక్రమం గురించి విని ముగ్ధురాలైంది. ఆమె ఆ పట్టణ న్యూస్‌లెటర్‌కి సంబంధించిన ఒక రచయిత. తర్వాత ఆ న్యూస్‌లెటర్‌లో, మంచి స్థితిలో ఉన్న రాజ్యమందిరం గురించి ఒక నివేదిక వచ్చింది. ఆ ఆర్టికల్‌ చివర్లో ఇలా ఉంది, “రాజ్యమందిరం మన ప్రాంతంలో ఉన్నందుకు . . . మనం సంతోషిస్తున్నాం.”

ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో రాజ్యమందిరాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని సందర్శించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీకు తప్పకుండా సాదరంగా స్వాగతం చెప్తారు.