కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

యెహోవా దయ చూపించే, క్షమించే దేవుడని తెలుసుకున్నాను

యెహోవా దయ చూపించే, క్షమించే దేవుడని తెలుసుకున్నాను
  • పుట్టిన సంవత్సరం: 1954

  • దేశం : కెనడా

  • ఒకప్పుడు : మోసాలు చేసేవాడిని, జూదం ఆడేవాడిని

నా గతం:

మాంట్రియల్‌ నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు అంతగా లేని ఒక ప్రాంతంలో నేను జీవించాను. నేను ఆరు నెలల బాబుగా ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. దానితో ఇంటి బాధ్యతంతా అమ్మమీదే పడింది. ఎనిమిది మంది పిల్లల్లో నేనే చిన్నవాన్ని.

మత్తుమందులు, జూదం, హింస వంటివాటి మధ్య నా బాల్యం గడిచింది. నేరాలు చేసే వాళ్ల మధ్య పెరిగాను. పదేళ్లు వచ్చేసరికి వేశ్యలకు, వడ్డీ వ్యాపారులకు చిన్నచిన్న పనులు చేయడం మొదలుపెట్టాను. అబద్ధాలు చెప్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఆనందించేవాన్ని. ఆ ఆనందం ఒక మత్తుమందులా ఉండేది.

14 ఏళ్లు వచ్చేసరికే కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరాను. ఉదాహరణకు, బంగారు పూత పూసిన వాచీలు, బ్రేస్‌లెట్‌లు, ఉంగరాలు ఎక్కువ సంఖ్యలో కొని వాటికి ఏదో ఒక సంస్థ పేరుతో 14 క్యారెట్ల బంగారం అని ముద్ర వేసి వాటిని వీధుల్లో, షాపింగ్‌ సెంటర్ల పార్కింగ్‌ స్థలాల్లో అమ్మేవాన్ని. సులభంగా డబ్బులు సంపాదించడం నచ్చి, దాని గురించే ఆలోచించేవాన్ని. ఒకసారైతే, ఒకేరోజు ఐదు లక్షల రూపాయలు సంపాదించాను.

15 ఏళ్లప్పుడు బాల నేరస్తులను సరిదిద్దే స్కూల్‌ నుండి నన్ను బయటకు పంపించేశారు. దానితో ఇక ఉండడానికి చోటు లేకుండా పోయింది. వీధుల్లో, పార్కుల్లో లేదా ఎవరైనా తెలిసిన వాళ్ల ఇంట్లో పడుకున్నాను.

నేను చేసే మోసాల వల్ల పోలీసులు నన్ను చాలాసార్లు ప్రశ్నించారు. అయితే దొంగతనం చేసిన వస్తువుల్ని అమ్మట్లేదు కాబట్టి జైలుకు పంపలేదు. కానీ, వేరేవాళ్ల పేరుతో మోసం చేసినందుకు, పర్మిట్‌ లేకుండా అమ్ముతున్నందుకు పెద్దపెద్ద జరిమానాలు కట్టాను. ఎవరికీ భయపడకుండా, వడ్డీ వ్యాపారుల తరఫున డబ్బులు వసూలు చేశాను. ఆ పని చాలా ప్రమాదకరమైనది. కాబట్టి, కొన్నిసార్లు గన్ను పెట్టుకుని తిరిగాను. కొన్నిసార్లు నేరాలు చేసే ముఠాలతో కూడా పనిచేశాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

17 ఏళ్లప్పుడు నేను మొదటిసారిగా బైబిలు గురించి తెలుసుకున్నాను. నేను నా స్నేహితురాలితో కలిసి ఉంటున్నప్పుడు ఆమె యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టింది. చెడు పనుల విషయంలో బైబిలు కట్టుబాట్లు నచ్చక ఆమెను విడిచిపెట్టి, నేను డేటింగ్‌ చేస్తున్న మరో అమ్మాయితో ఉండడానికి వెళ్లిపోయాను.

అయితే ఈ అమ్మాయి కూడా యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకోవడం మొదలు పెట్టడంతో నా జీవితం మలుపు తిరిగింది. ఆమె చాలా మార్పులు చేసుకుంది. ఆమె ఇంకా శాంతంగా, సహనంగా మారడం నన్ను ఆకట్టుకుంది. యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి ఆహ్వానించినప్పుడు నేను వెళ్లాను. చాలా పద్ధతి గల, దయ గల ప్రజలు అక్కడ నాతో మాట్లాడారు. నేను చూసిన లోకానికి, వాళ్లకు అసలు పోలికే లేదు! నా కుటుంబం నన్ను పట్టించుకోలేదు; చిన్నప్పుడు ప్రేమ, ఆప్యాయత అంటే ఏంటో నాకు తెలియదు. యెహోవాసాక్షులు నాపై చూపించిన ప్రేమ మరవలేనిది. నిజంగా, అలాంటి ప్రేమ కోసమే నేను తపించాను. నాకు బైబిలు గురించి నేర్పిస్తామని వాళ్లు అన్నప్పుడు, వెంటనే ఒప్పుకున్నాను.

బైబిలు నుండి నేర్చుకున్న విషయాలే నా ప్రాణాలు కాపాడాయి. జూదం ఆడి దాదాపు 25 లక్షల అప్పు చేశాను. దాన్ని తీర్చడానికి, ఇద్దరితో కలిసి బ్యాంకు దోపిడీకి ప్లాన్‌ చేశాను. అయితే నేను అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అది చాలా మంచిదైంది! మిగతా ఇద్దరు మాత్రం ఆ దొంగతనానికి వెళ్లారు. వాళ్లలో ఒకరిని అరెస్ట్‌ చేశారు, ఇంకొకరిని చంపేశారు.

బైబిలు గురించి నేర్చుకుంటున్నప్పుడు, నేను చాలా మార్పులు చేసుకోవాలని నాకు అర్థమైంది. ఉదాహరణకు, 1 కొరింథీయులు 6:10లో “దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని చదివాను. నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమై కన్నీళ్లు పెట్టుకున్నాను. నన్ను నేను చాలా మార్చుకోవాలని అర్థమైంది. (రోమీయులు 12:2) నేను చాలా క్రూరున్ని, కోపిష్ఠిని. నా జీవితమంతా అబద్ధాలే.

అయితే, యెహోవా దయగలవాడని, క్షమించే మనసున్నవాడని నేను బైబిలు నుండి తెలుసుకున్నాను. (యెషయా 1:18) నా పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయమని ప్రార్థనలో దేవున్ని బతిమాలాను. ఆయన సహాయంతో మెల్లమెల్లగా మారాను. నేను కలిసివుంటున్న అమ్మాయితో నా పెళ్లిని రిజిస్టరు చేసుకోవడం ఒక ముఖ్యమైన మార్పు.

బైబిలు సూత్రాలు పాటించడం వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను

అప్పుడు నాకు 24 ఏళ్లు. మాకు ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు నిజాయితీగా పనిచేయడానికి నాకు ఒక ఉద్యోగం కావాలి. నాకు పెద్దగా చదువులేదు, నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేవాళ్లు ఎవరూ లేరు. యెహోవాకు మళ్లీ బలంగా ప్రార్థించి ఉద్యోగం వెతకడం కోసం వెళ్లాను. నా జీవితాన్ని మార్చుకుని, నిజాయితీగా పనిచేయాలి అనుకుంటున్నానని ఉద్యోగం ఇచ్చేవాళ్లతో చెప్పాను. బైబిలు గురించి నేర్చుకుంటున్నానని, మంచి పౌరున్ని కావాలనుకుంటున్నానని కూడా కొన్నిసార్లు చెప్పాను. ఎవరూ నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదు. చివరిగా, ఒక ఇంటర్వ్యూలో నా గతం మొత్తం వివరించాక, ఇంటర్వ్యూ చేస్తున్నతను ఇలా అన్నాడు: “ఎందుకో తెలీదు కానీ, నీకు ఉద్యోగం ఇవ్వాలి అనిపిస్తుంది.” అది నా ప్రార్థనలకు వచ్చిన జవాబని నమ్మాను. కొంతకాలానికి నేను, నా భార్య బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులం అయ్యాం.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .

బైబిలు సూత్రాలను పాటిస్తూ, క్రీస్తును అనుసరిస్తూ జీవిస్తున్నందు వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను. నాకు ఒక చక్కని కుటుంబం ఉంది. యెహోవా నన్ను క్షమించాడని నమ్ముతున్నాను, దానివల్ల మంచి మనస్సాక్షిని పొందాను.

గత 14 సంవత్సరాలుగా నేను ప్రతీనెల 70 గంటలు ప్రకటనా పని చేస్తూ బైబిలు చెప్తున్నదేంటో తెలుసుకునేలా తోటివాళ్లకు సాయం చేస్తున్నాను. ఈ మధ్యే నా భార్య కూడా నాతో కలిసి 70 గంటలు చేయడం మొదలుపెట్టింది. గడిచిన 30 ఏళ్లలో నా తోటి ఉద్యోగులు 22 మందికి యెహోవా ఆరాధకులయ్యేలా సాయం చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పటికీ నేను షాపింగ్‌ సెంటర్‌లకు వెళ్తున్నాను, కానీ ఒకప్పటిలా ప్రజల్ని మోసం చేయడానికి కాదు. అక్కడికి వెళ్లినప్పుడు నా నమ్మకాల్ని ఇతరులతో చెప్తుంటాను. మోసాలు చేసేవాళ్లు ఉండని కొత్తలోకం రాబోతుంది అనే మంచి వార్తను వాళ్లకు చెప్పాలని కోరుకుంటున్నాను.—కీర్తన 37:10, 11. ▪ (w15-E 05/01)