కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొత్త నిబంధనలో దేవుని పేరును తిరిగి చేర్చిన ఇద్దరు అనువాదకులు

కొత్త నిబంధనలో దేవుని పేరును తిరిగి చేర్చిన ఇద్దరు అనువాదకులు

 చాలామంది ప్రజలు మొట్టమొదట నేర్చుకునే ప్రార్థనల్లో ఒకటి, యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రభువు ప్రార్థన లేదా మాదిరి ప్రార్థన. ఆ ప్రార్థనను, ప్రజలు సాధారణంగా పిలిచే కొత్త నిబంధన అనే బైబిలు భాగంలో చూస్తాం. ఆ ప్రార్థన ఇలా మొదలౌతుంది: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి [లేదా పరిశుద్ధపరచబడు గాక]. (మత్తయి 6:9) దేవుని పేరు ఇంగ్లీష్‌లో “జెహోవా” అని లేదా కొన్నిసార్లు “యావే” అని అంటారు. కానీ, కొత్త నిబంధనకు సంబంధించిన ఇంగ్లీష్‌ అనువాదాల్లో ఆ పేరు అరుదుగా కనిపిస్తుంది. అయితే అవే అనువాదాల్లో అబద్ధ దేవుళ్లైన ద్యుపతి, హెర్మే, అర్తెమిల పేర్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు, ఈ అనువాదకులు నిజమైన దేవుడు అలాగే బైబిల్ని రాయించిన వ్యక్తి పేరును ఎందుకు తీసేశారు?అపొస్తలుల కార్యాలు 14:12; 19:35; 2 తిమోతి 3:16.

కొత్త నిబంధనలో చాలామంది అబద్ధ దేవుళ్ల పేర్లు ఉన్నాయి, మరి అలాంటప్పుడు నిజమైన దేవుని పేరు ఎందుకు ఉండకూడదు?

 ఇంగ్లీష్‌ బైబిలు అనువాదకులైన లాన్సెలాట్‌ షాడ్వెల్‌, ఫ్రెడ్రిక్‌ పార్కర్‌ దేవుని పేరును కొత్త నిబంధనలో తిరిగి చేర్చాలని నమ్మారు. “తిరిగి” చేర్చాలి అని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే, కొత్త నిబంధనలో దేవుని పేరు మొదట ఉండేదని, ఆ తర్వాత అది తీసేయబడిందని వాళ్లు ముగింపుకు వచ్చారు. వాళ్లు ఎందుకు ఆ ముగింపుకు వచ్చారు?

 మొదట హీబ్రూలో రాసిన పాత నిబంధనా రాతప్రతుల్లో దేవుని పేరు వేలసార్లు ఉందని షాడ్వెల్‌కు, పార్కర్‌కు తెలుసు. కానీ, అప్పట్లో వాళ్లకు అందుబాటులో ఉన్న కొత్త నిబంధనా రాతప్రతుల్లో మాత్రం దేవుని పూర్తి పేరు లేదు. a దాన్ని ఎందుకు తీసేశారా అని షాడ్వెల్‌, పార్కర్‌ ఆశ్చర్యపోయారు. అలాగే, కొత్త నిబంధనా రాతప్రతుల్లో పాత నిబంధనలో తరచూ కనిపించే “యెహోవా దూత” లాంటి పదబంధాలు ఎత్తి రాయబడ్డాయి. అలా ఎత్తి రాస్తున్నప్పుడు, గ్రీకు భాషలోకి నకలు రాసేవాళ్లు దేవుని పేరును తీసేసి, కెరియోస్‌ లాంటి పదాల్ని చేర్చారని షాడ్వెల్‌ గమనించాడు. కెరియోస్‌ అంటే “ప్రభువు” అని అర్థం.—2 రాజులు 1:3, 15; అపొస్తలుల కార్యాలు 12:23.

హీబ్రూలో దేవుని పేరు

 షాడ్వెల్‌ అలాగే పార్కర్‌ తమ ఇంగ్లీష్‌ అనువాదాల్ని ప్రచురించడానికి ముందే, ఇతర అనువాదకులు కొత్త నిబంధనకు సంబంధించిన తమ ఇంగ్లీష్‌ అనువాదాల్లో దేవుని పేరును తిరిగి చేర్చారు. b అయితే, వాళ్లు ఆ పేరును ఎక్కువ చోట్ల పెట్టలేదు. 1863​లో పార్కర్‌, ఎ లిటరల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ అనే అనువాదాన్ని ప్రచురించాడు. అయితే, దానికి ముందు ఏ ఇంగ్లీష్‌ అనువాదకుడు కూడా, తాను ప్రచురించిన కొత్త నిబంధనలో పార్కర్‌ చేర్చినన్ని సార్లు దేవుని పేరును చేర్చలేదు. ఇంతకీ ఈ లాన్సెలాట్‌ షాడ్వెల్‌, ఫ్రెడ్రిక్‌ పార్కర్‌ ఎవరు?

లాన్సెలాట్‌ షాడ్వెల్‌

 లాన్సెలాట్‌ షాడ్వెల్‌ (1808-1861) ఒక న్యాయవాది, అలాగే చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో సభ్యుడు. ఆయన ఇంగ్లండ్‌ వైస్‌-ఛాన్స్‌లర్‌ అయిన సర్‌ లాన్సెలాట్‌ షాడ్వెల్‌ కొడుకు. ఆయన త్రిత్వాన్ని నమ్మినా దేవుని పేరును గౌరవించాడు, “యెహోవా పేరు మహిమాన్వితమైనది” అని తన అనువాదంలో గొప్పగా వర్ణించాడు. ద గాస్పెల్స్‌ ఆఫ్‌ మాథ్యూ, అండ్‌ ఆఫ్‌ మార్క్‌ అనే తన అనువాదంలో, “యెహోవా” అని లేఖనాల్లో 28 సార్లు, అలాగే వాటి వివరణల్లో 465 సార్లు ఉపయోగించాడు.

 షాడ్వెల్‌ హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనను చూసి దేవుని పేరు తెలుసుకొని ఉండవచ్చు. పాత నిబంధనను గ్రీకు భాషలోకి అనువదిస్తున్నప్పుడు ఎవరైతే దేవుని పేరును తీసేసి కెరియోస్‌ అనే పదాన్ని వాడారో, వాళ్లను “నిజాయితీ లేని అనువాదకులు” అని ఆయన అన్నాడు.

The Gospel according to Matthew rendered into English with notes, by L. Shadwell (1859), provided by the Bodleian Libraries. Licensed under CC BY-NC-SA 2.0 UK. Modified: Text highlighted

షాడ్వెల్‌ అనువాదంలో మత్తయి 1:20

 షాడ్వెల్‌ తన అనువాదంలో మొదటిసారి మత్తయి 1:20​లో “యెహోవా” అని వాడాడు. ఆ వచనానికి సంబంధించిన వివరణలో ఇలా ఉంది: “ఇక్కడ, అలాగే కొత్త నిబంధనలో చాలా లేఖనాల్లో వాడిన [కెరియోస్‌] పదం యెహోవాను సూచిస్తుంది. అదే దేవుని అసలైన పేరు: దాన్ని ఇంగ్లీష్‌ అనువాదంలో తిరిగి చేర్చడం అన్నిటికన్నా ప్రాముఖ్యం.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “దేవునికి మహిమ రావాలంటే ఆయన పేరును తిరిగి చేర్చడం చాలా అవసరం. దేవుడే స్వయంగా తన పేరు యెహోవా అని వెల్లడి చేసుకున్నాడు: మనం ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరును ఉపయోగించడం కన్నా ఉత్తమమైనది ఇంకొకటి లేదు.” తర్వాత ఆయన ఇలా అన్నాడు: “మన దగ్గరున్న ఈ.వి. [ఎస్టాబ్లిష్డ్‌ వర్షన్‌, ఆథరైజ్డ్‌ వర్షన్‌, లేదా కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌] బైబిల్లో, యెహోవా పేరు అరుదుగా కనిపిస్తుంది … అక్కడ దేవుని పేరుకు బదులు, ప్రభువు అని చదువుతాం.” షాడ్వెల్‌ ఇంకా ఇలా అన్నాడు: ‘చివరికి నా బంగ్లాలో కూడా అందరూ నన్ను ప్రభువు అని పిలుస్తారు. అలాంటిది దేవుని పేరుకు బదులు ప్రభువు అని వాడితే, ఆయన పేరుకున్న గౌరవాన్ని తగ్గించినట్టే.‘

“[దేవుడు] స్వయంగా తన పేరు యెహోవా అని వెల్లడి చేసుకున్నాడు: మనం ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరును ఉపయోగించడం కన్నా ఉత్తమమైనది ఇంకొకటి లేదు.”—లాన్సెలాట్‌ షాడ్వెల్‌

 షాడ్వెల్‌ తాను అనువదించిన మత్తయి సువార్తను 1859​లో ప్రచురించాడు. తర్వాత 1861​లో మత్తయి, మార్కు సువార్తల్ని కలిపి ప్రచురించాడు. అయితే, ఆయన చేస్తున్న పని అర్ధాంతరంగా ఆగిపోయింది. 1861, జనవరి 11న, షాడ్వెల్‌ 52 ఏళ్ల వయసులో చనిపోయాడు. అయినాసరే, ఆయన కష్టం వృథా కాలేదు.

ఫ్రెడ్రిక్‌ పార్కర్‌

 షాడ్వెల్‌ అనువదించిన మత్తయి సువార్త, లండన్‌కు చెందిన ఫ్రెడ్రిక్‌ పార్కర్‌ (1804-1888) అనే డబ్బున్న వ్యాపారవేత్త దృష్టిలో పడింది. పార్కర్‌ తనకు దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పుడు కొత్త నిబంధనను అనువదించడం మొదలుపెట్టాడు. షాడ్వెల్‌కు భిన్నంగా, పార్కర్‌ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మలేదు. పార్కర్‌ ఇలా రాశాడు: “[దేవుని] ప్రియ కుమారునికి చెందిన చర్చీ సభ్యులందరూ … సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి … ఒకేఒక్క సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించును [గాక].” అలాగే, కొత్త నిబంధన రాతప్రతుల్లో దేవునికి, యేసుకు ఇద్దరికీ కెరియోస్‌ అనే పదాన్నే వాడడం వల్ల, వాళ్లిద్దరి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియట్లేదని పార్కర్‌కు అనిపించింది. కాబట్టి, షాడ్వెల్‌ తన అనువాదంలో కొన్ని చోట్ల కెరియోస్‌ని “యెహోవా” అని అనువదించడం చూసి పార్కర్‌కు ఆసక్తి కలిగింది.

 పార్కర్‌ ఈ విషయాలన్నీ ఎలా అర్థం చేసుకోగలిగాడు? ఆయన గ్రీకు భాష మీద అధ్యయనం చేశాడు, గ్రీకు వ్యాకరణం మీద చాలా పుస్తకాల్ని, కరపత్రాల్ని రాశాడు. ఆయన ఆంగ్లో-బిబ్లికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సభ్యునిగా కూడా చేరాడు. ఆ ఇన్‌స్టిట్యూట్‌, మరింత సమర్థవంతమైన ఇంగ్లీష్‌ బైబిళ్లను తయారుచేయడం కోసం బైబిలు రాతప్రతుల మీద పరిశోధన జరిపేది. 1842​లో, పార్కర్‌ కొత్త నిబంధనకు సంబంధించిన తన మొదటి అనువాదాన్ని చాలా భాగాలుగా, సంచికలుగా ప్రచురించడం మొదలుపెట్టాడు. c

పార్కర్‌ (హేయిన్‌ఫెట్టర్‌) అనువదించిన కొత్త నిబంధన

దేవుని పేరును తిరిగి చేర్చడానికి పార్కర్‌ చేసిన కృషి

 కొన్ని సంవత్సరాల వరకు, పార్కర్‌ ఇలాంటి ప్రశ్నలకు జవాబులు రాసి ప్రచురించేవాడు: “కెరియోస్‌ అనే పదం యేసును ఎప్పుడు సూచిస్తుంది అలాగే దేవుణ్ణి ఎప్పుడు సూచిస్తుంది?” “వ్యాకరణం బట్టి చూస్తే కెరియోస్‌ అనేది ఒక బిరుదు, మరి దాన్ని పేరులా ఎందుకు వాడారు?”

 1859​లో షాడ్వెల్‌ ప్రచురించిన మత్తయి సువార్తను అలాగే అందులో కెరియోస్‌కి సంబంధించిన వివరణల్ని చూసినప్పుడు, కొన్ని సందర్భాల్లో కెరియోస్‌ని ”యెహోవా అని అనువదించాలి” అని పార్కర్‌కు నమ్మకం కుదిరింది. అందుకే, సందర్భం బట్టి లేదా గ్రీకు భాషా వ్యాకరణం బట్టి ఎక్కడెక్కడ “యెహోవా” అని పెట్టాలో అక్కడ పెట్టి, కొత్త నిబంధనకు సంబంధించిన తన అనువాదం మొత్తాన్ని పార్కర్‌ రివైజ్‌ చేశాడు. అలా పార్కర్‌ 1863​లో ఒకే సంపుటిగా విడుదల చేసిన ఎ లిటరల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ సంచికలో, దేవుని పేరును లేఖనాల్లో 187 సార్లు ఉపయోగించాడు. మనకు తెలిసినంతవరకు, క్రైస్తవ గ్రీకు లేఖనాల మొత్తంలో దేవుని పేరును చేర్చి ప్రచురించిన మొట్టమొదటి ఇంగ్లీష్‌ అనువాదం ఇదే. d

1864​లో పార్కర్‌ ప్రచురించిన కొత్త నిబంధనలోని శీర్షిక పేజీ

 1864​లో, పార్కర్‌ ఎ కొల్లేషన్‌ ఆఫ్‌ యాన్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ … విత్‌ ది ఆథరైజ్డ్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ అనే సంపుటిని కూడా విడుదల చేశాడు. కొత్త నిబంధనకు సంబంధించిన తన అనువాదానికి, ఆథరైజ్డ్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌కి తేడా చూపించాలనే ఉద్దేశంతోనే పార్కర్‌ ఆ రెండు అనువాదాల్ని కలిపి ఒక సంపుటిగా విడుదల చేశాడు. e

 దేవుని పేరును తిరిగి చేర్చడం ఎంత ప్రాముఖ్యమో వివరించడానికి, ఆథరైజ్డ్‌ వర్షన్‌లో ఉన్న చాలా లేఖనాల్ని పార్కర్‌ ఎత్తి చూపించాడు. అందులో ఒకటి, రోమీయులు 10:13. అక్కడ ఇలా ఉంది: “ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును గాక.” పార్కర్‌ ఇలా ప్రశ్నించాడు: ‘ఆథరైజ్డ్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌లోని ఇలాంటి వచనాల్లో ప్రభువు అనే పదం, కుమారుడైన యేసుక్రీస్తును కాదుగానీ యెహోవాను సూచిస్తుందని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా?’

కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో (పైన), అలాగే 1864​లో పార్కర్‌ ప్రచురించిన అనువాదంలో రోమీయులు 10:13

 పార్కర్‌ తాను రాసిన కరపత్రాల్ని, పేపర్లని, ఇతర రచనల్ని ప్రచురించడానికి అలాగే అందరికీ తెలిసేలా చేయడానికి ఆ రోజుల్లోనే వేల పౌండ్లు ఖర్చుపెట్టాడు. నిజానికి, ఆయన ఒక్క సంవత్సరంలోనే 800 పౌండ్లు ఖర్చుపెట్టాడు, అవి ఈరోజుల్లో లక్ష కన్నా ఎక్కువ బ్రిటీష్‌ పౌండ్లకు (95 లక్షల కన్నా ఎక్కువ రూపాయిలకు) సమానం. అంతేకాదు, ఆయన తన ప్రచురణల ఉచిత కాపీలను, తెలిసినవాళ్లకు అలాగే చర్చి ప్రముఖులకు పంపించి వాళ్ల అభిప్రాయం చెప్పమని అడిగేవాడు.

 చాలా తక్కువ సంఖ్యలో ముద్రించబడిన పార్కర్‌ రచనల్ని, కొత్త నిబంధనకు సంబంధించిన ఆయన అనువాదాల్ని కొంతమంది పండితులు ఎగతాళి చేశారు. వాళ్లు ఇంగ్లీష్‌ కొత్త నిబంధనలో దేవుని పేరును తిరిగి చేర్చడానికి పార్కర్‌, షాడ్వెల్‌, ఇతరులు నిజాయితీగా చేసిన కృషికి విలువ ఇవ్వలేదు.

 ఎక్కువ తెలుసుకోవడానికి ఈ పది నిమిషాల వీడియో కూడా చూడవచ్చు: వార్విక్‌ మ్యూజియం టూర్‌లు: “బైబిలు, అందులోని దేవుని పేరు.”

a ప్రకటన 19:1, 3, 4, 6 వచనాల అధస్సూచిలో “హల్లెలూయా” అనే మాటను చూస్తాం. అందులో “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం. “హల్లెలూయా” అంటే “యెహోవాను స్తుతించండి!” అని అర్థం.

b షాడ్వెల్‌ కొత్త నిబంధనను పూర్తిగా అనువదించలేదు. ఇతర అనువాదకుల పేర్లు ఫిలిప్‌ డాడ్రిజ్‌, ఎడ్వార్డ్‌ హార్వుడ్‌, విలియమ్‌ న్యూకమ్‌, ఎడ్గార్‌ టేలర్‌, గిల్బర్ట్‌ వేక్‌ఫీల్డ్‌.

c తన వ్యాపారాన్ని, బైబిలు పరిశోధనను వేరుగా ఉంచడానికి పార్కర్‌ తన రచనల్ని, బైబిలు అనువాదాల్ని హెర్మన్‌ హేయిన్‌ఫెట్టర్‌ అనే కలం పేరుతో రాసేవాడు. ఈ పేరు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలోని అనుబంధంలో కూడా కనిపిస్తుంది.

d 1864​లో, పార్కర్‌ యాన్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ని విడుదల చేశాడు. అందులో దేవుని పేరు 186 సార్లు ఉంది.

e పార్కర్‌ అనువాదాలకు ముందు, కొత్త నిబంధనకు సంబంధించిన చాలా హీబ్రూ అనువాదాల్లో దేవుని పేరు వేర్వేరు లేఖనాల్లో ఉంది. అంతేకాదు, 1795​లో జొహన్‌ జేకబ్‌ స్టోల్స్‌ ప్రచురించిన జర్మన్‌ అనువాదంలో, దేవుని పేరు మత్తయి నుండి యూదా వరకు 90 కన్నా ఎక్కువసార్లు ఉంది.