కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

పెళ్లయిన మొదటి సంవత్సరం ఎలా సర్దుకుపోవాలి?

పెళ్లయిన మొదటి సంవత్సరం ఎలా సర్దుకుపోవాలి?

ఆయన: “నా భార్య అలవాట్లు నా అలవాట్లు పూర్తిగా వేరని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను! ఒక ఉదాహరణ చెప్తాను, నాకు పొద్దున్నే లేవడం ఇష్టం, కానీ తనేమో రాత్రిళ్లు చాలాసేపు మెలకువగా ఉంటుంది. ఉన్నట్టుండి ఆమె మూడ్‌ మారిపోతుంటుంది! ఎందుకో నాకు అస్సలు అర్థంకాదు. నేను వంట చేస్తే తనకు అస్సలు నచ్చదు. ముఖ్యంగా గిన్నెలు తుడిచే గుడ్డతో నేను నా చేతులు తుడుచుకుంటే ఆమెకు చాలా చిరాకు కలుగుతుంది.”

ఆమె: “నా భర్త ఎక్కువగా మాట్లాడే మనిషి కాదు. కానీ మా ఇంట్లో అలా కాదు. మేము చాలా మాట్లాడుకుంటాం, ముఖ్యంగా కలిసి తినేటప్పుడు చాలా మాట్లాడుకుంటాం. నా భర్త వంట చేస్తున్నప్పుడు, గిన్నెలు తుడిచే గుడ్డతో తన చేతుల్ని కూడా తుడుచుకుంటాడు! అలా చేస్తే నాకు చాలా చిరాకు! మగవాళ్లను అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టం? భార్యాభర్తలు ఏమి చేస్తే సంతోషంగా ఉండవచ్చు?”

మీరు కొత్తగా పెళ్లయిన వాళ్లయితే, మీకూ అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? మీరు ప్రేమించుకుంటున్నప్పుడు మీ భాగస్వామిలో కనిపించని లోపాలు, గుణాలు ఇప్పుడు పెళ్లయ్యాక ఒక్కసారిగా కనిపించడం మొదలుపెట్టాయా? ‘వివాహితులైన వాళ్లకు వచ్చే దైనందిన కష్టాలు’ తగ్గించుకోవాలంటే ఏమిచేయాలి?—1 కొరింథీయులు 7:28, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము.

పెళ్లయినంత మాత్రాన మీరిద్దరూ వైవాహిక జీవితంలో నిష్ణాతులైపోతారని అనుకోకండి. పెళ్లికాక ముందు మీరు వేరేవాళ్లతో చక్కగా కలిసి మెలిసి ఉండడం నేర్చుకుని ఉండవచ్చు. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు దానికి ఇంకా పదునుపెట్టివుంటారు. వివాహమైన తర్వాత, మీకు ఉన్న ఆ సామర్థ్యాన్ని వివిధ రకాలుగా చూపించాల్సివస్తుంది. మీరు కొత్త పద్ధతుల్ని కూడా నేర్చుకోవాల్సిరావచ్చు. మీరు పొరపాట్లు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. వాటిని సరిదిద్దుకోవడానికి కావాల్సిన లక్షణాలను మీరు అలవర్చుకోగలరా? తప్పకుండా అలవర్చుకోగలరు!

ఏ సామర్థ్యాన్నైనా మెరుగుపర్చుకోవాలంటే దానిలో నిపుణత కలిగిన వ్యక్తిని సంప్రదించి, ఆయనిచ్చిన సలహా పాటించాలి. వివాహ జీవితానికి సంబంధించిన విషయాల్లో యెహోవా దేవుడిచ్చే సలహాలే అత్యుత్తమమైనవి. వివాహం చేసుకోవాలనే కోరిక మనలోపెట్టి మనల్ని సృష్టించింది ఆయనే కదా. (ఆదికాండము 2:22-24) మీ వివాహ జీవితం మొదటి సంవత్సరంతో ఆగిపోకుండా ముందుకు సాగడానికి అవసరమైన సామర్థ్యాలను సంపాదించుకునేందుకు, ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఆయన వాక్యమైన బైబిలు ఎలా సహాయం చేస్తుందో గమనించండి.

మొదటి అడుగు: ఒకరినొకరు సంప్రదించుకోవడం నేర్చుకోండి

ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?

జపాన్‌లో ఉంటున్న కేజీ a అనే వ్యక్తి తన నిర్ణయాలు తన భార్యకు ఎలా ఇబ్బంది కలిగిస్తాయనే విషయం కొన్నిసార్లు గ్రహించలేకపోయేవాడు. ఆయనిలా చెప్తున్నాడు, “ఎవరైనా మమ్మల్ని వాళ్లింటికి ఆహ్వానిస్తే నా భార్యను సంప్రదించకుండానే, వస్తామని వాళ్లతో చెప్పేవాణ్ణి. తనకు రావడం వీలవదని ఆ తర్వాత నాకు తెలిసేది.” ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆలెన్‌ ఇలా చెప్తున్నాడు, “ఏదైనా విషయం గురించి భార్యతో సంప్రదించడం పురుష లక్షణం కాదనే అభిప్రాయం నాకుండేది.” ఆయన వచ్చిన నేపథ్యంవల్ల ఆయనకు ఆ సమస్య ఎదురైంది. బ్రిటన్‌లో ఉంటున్న డయాన్‌ సమస్య కూడా అదే. ఆమె ఇలా చెప్తోంది, “మా ఇంటివాళ్లను సలహాలు అడగడం నాకు అలవాటు. అందుకే, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా భర్తను సంప్రదించకుండా ముందు వాళ్లను సంప్రదించేదాన్ని.”

పరిష్కారమేమిటి?

భార్యాభర్తల్ని యెహోవా దేవుడు ‘ఒకే శరీరంగా’ పరిగణిస్తాడని గుర్తుంచుకోండి. (మత్తయి 19:3-6) భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని యెహోవా దేవుడు మనుష్యుల మధ్య ఉండే ఏ సంబంధంకన్నా కూడా విలువైనదిగా ఎంచుతాడు. ఆ సంబంధం పటిష్ఠంగా ఉండాలంటే, వాళ్లిద్దరూ ఒకరితోఒకరు చక్కగా మాట్లాడుకోవాలి.

యెహోవా దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన పద్ధతిని పరిశీలించి భార్యాభర్తలు ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ఆదికాండము 18:17-33లో ఉన్న సంభాషణను ఒక్కసారి చదవండి. దేవుడు అబ్రాహాముకు మూడు విధాలుగా ఘనతనిచ్చాడని గమనించండి. (1) యెహోవా తాను చేయాలనుకుంటున్నది ఆయనకు వివరించాడు. (2) అబ్రాహాము తాను అనుకుంటున్నది చెప్పినప్పుడు ఆయన విన్నాడు. (3) యెహోవా అబ్రాహాము చెప్పినట్టు చేయడానికి వీలైనంత వరకు తన పద్ధతిని మార్చుకున్నాడు. మీరు మీ భాగస్వామిని సంప్రదించేటప్పుడు యెహోవాను ఆదర్శంగా ఎలా తీసుకోవచ్చు?

ఇలా చేసి చూడండి: ఇద్దరికీ సంబంధించిన విషయాల గురించి చర్చించేటప్పుడు (1) ఫలానా పరిస్థితితో ఎలా వ్యవహరిస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి, మీరు అనుకుంటున్న వాటిని సలహాల్లా చెప్పండి, కానీ అవే తుది నిర్ణయాలన్నట్లు లేదా వాటిని పాటించి తీరాలన్నట్లు మాట్లాడకండి; (2) మీ భాగస్వామిని తన అభిప్రాయాన్ని చెప్పమనండి, తనకు వేరే అభిప్రాయం కలిగివుండే హక్కు ఉందని అంగీకరించండి; (3) వీలైనప్పుడల్లా మీ భాగస్వామి అభిప్రాయాలను మన్నించి, ‘మీ సహనాన్ని తెలియనివ్వండి.’—ఫిలిప్పీయులు 4:5.

రెండవ అడుగు: వివేచనతో ఉండడం నేర్చుకోండి

ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?

మీ కుటుంబ లేదా మీ సంస్కృతి నేపథ్యంవల్ల, మీరు మీ అభిప్రాయాన్ని స్థిరంగానే కాదు, కటువుగా కూడా వ్యక్తం చేసే అలవాటు మీకు ఉండవచ్చు. ఉదాహరణకు, యూరప్‌లో ఉంటున్న లియామ్‌ ఇలా చెప్తున్నాడు, “మా ప్రాంతంలో ప్రజలు చాలా దురుసుగా మాట్లాడతారు. కటువుగా మాట్లాడే నా అలవాటు తరచూ నా భార్యను బాధపెడుతుంది. నేను ఎంతో సౌమ్యంగా ఉండడం నేర్చుకోవాల్సి వచ్చింది.”

పరిష్కారమేమిటి?

మీరు మాట్లాడే తీరు మార్చుకోకపోయినా ఫర్వాలేదని మీ భాగస్వామి సరిపెట్టుకుంటారని అనుకోకండి. (ఫిలిప్పీయులు 2:3, 4) అపొస్తలుడైన పౌలు ఒక మిషనరీకి ఇచ్చిన సలహా కొత్తగా పెళ్లయిన వాళ్లకు కూడా ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఆయనిలా రాశాడు, ‘ప్రభువు సేవకుడు జగడమాడకూడదు గానీ దయ చూపించాలి.’ ఇక్కడ “దయ” అని అనువదించబడిన గ్రీకు పదాన్ని “వివేచన” అని కూడా అనువదించవచ్చు. (2 తిమోతి 2:24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) వివేచన అంటే పరిస్థితి యొక్క సున్నితత్త్వాన్ని గ్రహించి, అభ్యంతరం కలిగించకుండా, దయగా వ్యవహరించే సామర్థ్యం.

ఇలా చేసి చూడండి: మీ భాగస్వామి మీద మీకు కోపం వచ్చినప్పుడు, మీరు మీ భాగస్వామితో కాకుండా మీ స్నేహితులతోనో, మీ పై అధికారితోనో మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. వాళ్లతో కూడా మీరు అదే స్వరంతో మాట్లాడతారా, ఆ పదాల్నే ఉపయోగిస్తారా? మీరు మీ స్నేహితులతో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చూపించే గౌరవం, వివేచన కంటే ఎక్కువ గౌరవం, వివేచన మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు చూపించడం ఎందుకు తగినదో ఆలోచించండి.—కొలొస్సయులు 4:6.

మూడవ అడుగు: మీ కొత్త పాత్రకు తగ్గట్టు మారడం నేర్చుకోండి

ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?

పెళ్లయిన కొత్తలో భర్త తన బాధ్యతను అంత చక్కగా నిర్వర్తించలేకపోవచ్చు, అలాగే భార్యకు వివేచనతో కూడిన సలహాలిచ్చే అలవాటు ఉండకపోవచ్చు. ఉదాహరణకు, ఇటలీలో ఉంటున్న ఆన్‌టోన్యో ఇలా చెప్తున్నాడు, “కుటుంబ నిర్ణయాల గురించి మా నాన్న ఎప్పుడూ మా అమ్మను సంప్రదించలేదు. కాబట్టి, మొదట్లో నేను ఏకఛత్రాధిపత్యం చేసేవాణ్ణి.” కెనడాలో ఉంటున్న డెబీ ఇలా చెప్తోంది, “నా భర్త ఇంకాస్త శుభ్రంగా ఉండాలని నేను కోరేదాన్ని. కానీ నేను ఆ విషయాన్ని అధికారం చెలాయించినట్టు చెప్పడంతో ఆయన మరింత మొండిగా తయారయ్యారు.”

భర్త ఏమి చేయాలి?

బైబిలు ఒక భార్య తన భర్తకు చూపించాలని చెప్తున్న విధేయతకు, పిల్లలు తల్లిదండ్రులకు చూపించాలని చెప్తున్న విధేయతకు మధ్య తేడా ఉందని కొంతమంది భర్తలు గ్రహించరు. (కొలొస్సయులు 3:20; 1 పేతురు 3:1) భర్త, “తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు” అని బైబిలు చెప్తోంది గానీ తల్లిదండ్రులకు, పిల్లలకు సంబంధించి అది అలా చెప్పడం లేదు. (మత్తయి 19:5) భార్య భర్తకు సాటియైన సహాయకారిణని యెహోవా వర్ణిస్తున్నాడు. (ఆదికాండము 2:18) అయితే, పిల్లలు తమ తల్లిదండ్రులకు సాటియైన సహాయకారులని ఆయనెప్పుడూ చెప్పలేదు. ఒక భర్త తన భార్యను చిన్నపిల్లలా చూస్తే, ఆయన వివాహ ఏర్పాటును ఘనపర్చినట్లు అవుతుందా? దీని గురించి మీరు ఏమనుకుంటారు?

నిజానికి, యేసు క్రైస్తవ సంఘంతో ఎలా వ్యవహరిస్తాడో మీరు మీ భార్యతో అలా వ్యవహరించాలని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది. ఇలా చేస్తే మీ భార్య మీ అధికారానికి లోబడడం సులువవుతుంది: (1) మీ భార్య వెంటనే, ఏమాత్రం పొరపాటు చేయకుండా మీకు లోబడివుండాలని ఆశించకూడదు, (2) కష్టాలు ఎదురైనప్పుడు కూడా మీరు ఆమెను మీ సొంత శరీరంలా ప్రేమించాలి.—ఎఫెసీయులు 5:25-29.

భార్య ఏమి చేయాలి?

భార్యగా ఇప్పుడు మీరు మీ భర్తకు లోబడివుండాలని దేవుడు కోరుతున్నట్టు తెలుసుకోండి. (1 కొరింథీయులు 11:3, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీరు మీ భర్తను గౌరవిస్తే, దేవుణ్ణి గౌరవించినట్టే. మీరు మీ భర్త అధికారాన్ని తిరస్కరిస్తే, మీ భర్త గురించే కాదు, దేవుని గురించి, ఆయన కోరేవాటి గురించి మీకున్న అభిప్రాయం వెల్లడవుతుంది.—కొలొస్సయులు 3:18.

కష్టమైన సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు, సమస్య పైన దాడి చేయండి గానీ మీ భర్త లక్షణాలపై దాడిచేయకండి. ఉదాహరణకు, ఎస్తేరు రాణి తన భర్త అయిన అహష్వేరోషు రాజు ఒక అన్యాయాన్ని సరిచేయాలని కోరుకుంది. వ్యక్తిగతంగా ఆయన మీద దాడిచేసే బదులు ఆమె తన అభిప్రాయాన్ని యుక్తిగా తెలియజేసింది. ఆమె భర్త, ఆమె సలహాను అంగీకరించి చివరికి పరిస్థితిని సరిచేశాడు. (ఎస్తేరు 7:1-4; 8:3-8) ఇలా చేస్తే మీ భర్త మిమ్మల్ని గాఢంగా ప్రేమించడం నేర్చుకునే అవకాశం ఉంది: (1) కుటుంబ పెద్దగా ఆయన తన పాత్రను సరిగ్గా నిర్వర్తించడం నేర్చుకోవడానికి ఆయనకు సమయం ఇవ్వండి. (2) ఆయన పొరపాట్లు చేసినా ఆయనను గౌరవించండి.—ఎఫెసీయులు 5:33.

ఇలా చేసి చూడండి: మీ భాగస్వామి ఏయే విషయాల్లో మార్పు చేసుకోవాలో ఆలోచిస్తూ ఉండే బదులు మీరు ఏయే విషయాల్లో మార్పు చేసుకోవాలో తెలుసుకోండి. భర్తలారా: భర్తగా మీరు మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతే లేదా అసలే నిర్వర్తించకపోతే ఆమెకు చికాకు కలిగే అవకాశం ఉంది, అప్పుడు మీరు ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే బావుంటుందో చెప్పమని ఆమెనే అడగండి. తర్వాత వాటిని రాసిపెట్టుకోండి. భార్యలారా: మీ భర్త మీరు తనను గౌరవించడం లేదని భావిస్తే, ఈ విషయంలో మీరు ఏమిచేస్తే బావుంటుందో ఆయనను చెప్పమనండి. తర్వాత వాటిని రాసిపెట్టుకోండి.

మరీ ఎక్కువగా ఆశించకండి

వైవాహిక బంధం సంతోషంగా, సమతూకంగా ఉండేలా కాపాడుకోవడాన్ని నేర్చుకోవడం సైకిలు నేర్చుకోవడం లాంటిదే. సైకిలు తొక్కడం పూర్తిగా నేర్చుకునే లోపల కొన్నిసార్లయినా కింద పడక తప్పదని మనకు తెలుసు. అలాగే, వైవాహిక జీవితంలో అనుభవం సంపాదించుకునే లోపల కొన్ని అవమానకరమైన పొరపాట్లు జరిగి తీరతాయని గ్రహించాలి.

కాస్త హాస్య చతురతను కాపాడుకోండి. మీ భాగస్వామి చింతలను గంభీరంగా తీసుకోండి, కానీ మీ పొరపాట్లకు నవ్వేయడం నేర్చుకోండి. పెళ్లయిన మొదటి సంవత్సరం మీ భాగస్వామికి సంతోషం కలిగించడానికి అవకాశాలను చేజిక్కించుకోండి. (ద్వితీయోపదేశకాండము 24:5) మరీ ముఖ్యంగా, మీ వైవాహిక జీవితంలో దేవుని వాక్యమిచ్చే నిర్దేశాలను పాటించండి. మీరలా చేస్తే, సంవత్సరాలు గడిచేకొద్దీ మీ వివాహ బంధం పటిష్ఠమవుతుంది. (w10-E 08/01)

a కొన్ని అసలు పేర్లు కావు.

ఇలా ప్రశ్నించుకోండి . . .

  • నేను ప్రతీ విషయాన్ని నా జీవిత భాగస్వామికే చెప్పుకోవడానికి ఇష్టపడతానా, లేక వేరేవాళ్లను సంప్రదించాలనుకుంటానా?

  • గడిచిన 24 గంటల్లో, నేను నా జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్నానని, గౌరవిస్తున్నానని చూపించడానికి నిర్దిష్టంగా ఏమి చేశాను?