కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవాలంటే మనమేమి చేయాలి?

దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవాలంటే మనమేమి చేయాలి?

దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవాలంటే మనమేమి చేయాలి?

మీ పేరుకు ఏదైనా అర్థముందా? ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పిల్లలకు ఎంతో అర్థమున్న పేర్లు పెట్టడం ఒక ఆనవాయితీ. తల్లిదండ్రులు తమ నమ్మకాలకు, తాము విలువైనవిగా ఎంచేవాటికి అనుగుణంగా లేదా తమ పిల్లల భవిష్యత్తు గురించి తాము కంటున్న కలలకు లేదా తాము పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా పేర్లు పెడతారు.

ఎంతో అర్థమున్న పేర్లు పెట్టే అలవాటు ఈనాటిది కాదు. బైబిలు కాలాల్లో, పేర్లకున్న అర్థాలనుబట్టి వాటిని పెట్టేవాళ్లు. ఒక వ్యక్తికి పెట్టే పేరు జీవితంలో అతను సాధించాలని ఇతరులు ఆశిస్తున్నదాన్ని సూచించవచ్చు. ఉదాహరణకు, యెహోవా దావీదు కుమారుడైన సొలొమోను భవిష్యత్తులో పోషించే పాత్ర గురించి దావీదుకు చెప్తున్నప్పుడు ఇలా అన్నాడు, ‘అతనికి సొలొమోను [“సమాధానం” అనే మూల పదం నుండి వచ్చింది] అను పేరు పెట్టబడుతుంది; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానం, విశ్రాంతి దయచేస్తాను.’—1 దినవృత్తాంతములు 22:9.

కొన్నిసార్లు కొత్త పాత్రను పోషించాల్సిన వాళ్లకు యెహోవా కొత్తగా పేర్లు పెట్టాడు. ఒకప్పుడు గొడ్రాలుగావున్న, అబ్రాహాము భార్యకు “రాజ కుమార్తె” అని అర్థమొచ్చే శారా అనే పేరు పెట్టబడింది. ఎందుకు? దానికి యెహోవా ఇలా వివరించాడు, ‘నేనామెను ఆశీర్వదించి ఆమెవల్ల నీకు కుమారుని కలుగజేస్తాను; నేనామెను ఆశీర్వదిస్తాను; ఆమె జనములకు తల్లిగా ఉంటుంది; జనముల రాజులు ఆమెవల్ల కలుగుతారు.’ (ఆదికాండము 17:16) యెహోవా శారాకు కొత్త పేరు ఎందుకు పెట్టాడో అర్థంచేసుకోవాలంటే, ఆమె పోషించబోయే కొత్త పాత్రను అర్థంచేసుకోవాలి.

అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన, యెహోవా అనే పేరు విషయమేమిటి? ఆ పేరుకు అర్థమేమిటి? మోషే యెహోవా దేవుణ్ణి ఆయన పేరు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పాడు, ‘నేను ఎలా కావాలంటే అలా అవుతాను.’ (నిర్గమకాండము 3:14, NW) యెహోవా దేవుడు ఎన్నో పాత్రలు పోషిస్తాడని ఆయన పేరు తెలియజేస్తోంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక తల్లి తన పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఒక్క రోజులోనే ఎన్నో పాత్రలను పోషించాల్సి ఉండవచ్చు. అవసరాన్ని బట్టి ఆమె ఒక నర్సులా, వంటమనిషిలా, ఒక టీచరులా మారుతుంది. యెహోవా కూడా అలాగే చేస్తాడు, అయితే పెద్ద స్థాయిలో చేస్తాడు. మానవుల విషయంలో ఆయన ప్రేమపూర్వకంగా చేయాలనుకున్నది చేయడానికి అవసరమైన పాత్ర పోషిస్తూ, తనకు ఇష్టమైన విధంగా మారగలడు. యెహోవాను పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవాలంటే, ఆయన పోషించిన అనేక పాత్రలను అర్థంచేసుకుని, వాటి విలువను గ్రహించాలి.

దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోనివాళ్లు ఆయన చక్కని వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోలేరు. అయితే, బైబిలును అధ్యయనం చేస్తే, జ్ఞానవంతుడైన సలహాదారునిగా, శక్తిమంతుడైన రక్షకునిగా, ఉదార పోషకునిగా యెహోవా పోషించే పాత్రలను గ్రహించగలుగుతాం. ఆయన పోషించే పాత్రల్లో ఇవి కొన్ని మాత్రమే. యెహోవా పేరుకున్న గొప్ప అర్థం మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

అయితే, దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడం అన్నిసార్లూ అంత సులువు కాదు. ఎందుకో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది. (w10-E 07/01)