కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఏంచేస్తున్నాడు?

దేవుడు ఏంచేస్తున్నాడు?

దేవుడు ఏంచేస్తున్నాడు?

‘యెహోవా, ఎందుకు దూరంగా నిలిచివున్నావు? ఆపత్కాలాల్లో ఎందుకు దాగివున్నావు?’ aకీర్తన 10:1.

ఒక్కసారి వార్తాపత్రిక చూస్తే చాలు మనం ‘ఆపత్కాలాల్లో’ జీవిస్తున్నామని తెలిసిపోతుంది. మనింట్లోనే ఏదైనా ఘోరం జరిగితే అంటే, ఏదైనా నేరం జరిగి మనమే నష్టపోతే లేదా ఏదైనా ఘోర ప్రమాదం జరిగితే లేదా మనకు ఇష్టమైన వాళ్లు చనిపోతే మనం చాలా బాధపడతాం. అప్పుడు మనకు, ‘దేవుడు చూస్తున్నాడా? ఆయన మనల్ని పట్టించుకుంటాడా? అసలు ఆయన ఉన్నాడా?’ అనిపించవచ్చు.

దేవుని గురించి నిజానిజాలు తెలీనందువల్ల మనమలా అనుకుంటున్నామేమో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న బాబు వాళ్ల నాన్న పనికి వెళ్లినందుకు బాధపడుతున్నాడు. వాళ్ల నాన్న తనతో ఉండాలని ఎంతో కోరుకుంటూ, ఆయన ఇంటికి వచ్చేస్తే బావుంటుందని అనుకుంటున్నాడు. వాళ్ల నాన్న తనను విడిచిపెట్టేసినట్లు ఆ బాబుకు అనిపిస్తుంది. ఆ బాబు రోజంతా, “నాన్న ఎక్కడా? నాన్న ఎక్కడా?” అని అడుగుతున్నాడు.

ఆ బాబు ఆలోచనలో పొరపాటు ఏమిటో మనకు ఇట్టే అర్థమౌతుంది. అప్పుడు ఆ బాబు వాళ్ల నాన్న మొత్తం కుటుంబానికి అవసరమైనది ఇవ్వడానికే పనిచేస్తున్నాడు. మనం కూడా ఆ బాబులా పొరపాటుగా ఆలోచించడం వల్లే బాధతో, “దేవుడు ఎక్కడున్నాడు” అని అడుగుతున్నామా?

ఉదాహరణకు, దేవుడు ఒక న్యాయాధికారిలా తప్పు చేసిన వాళ్లను వెంటనే శిక్షించాలని కొంతమంది కోరుకుంటారు. మరి కొంతమందైతే ఉద్యోగం దొరికేలా, పెళ్లి కుదిరేలా, లాటరీ టికెట్టు గెలిచేలా చేసి, ఆకాశంలో ఉంటూ బహుమతులు తీసుకొస్తాడని ప్రజలు నమ్మే క్రిస్మస్‌ తాతలా దేవుడు ఉండాలనుకుంటారు.

ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్లు, తప్పు జరిగిన వెంటనే దేవుడు న్యాయం చేయకపోతే లేదా మనం అడిగింది ఆయన ఇవ్వకపోతే, మనం బాధలు పడుతున్నా ఆయన పట్టించుకోడని, మన అవసరాలు ఆయనకు తెలీదని అనుకుంటారు. అంతకన్నా తప్పు అభిప్రాయం ఇంకేదీ ఉండదు! ఎందుకంటే, యెహోవా దేవుడు ఇప్పుడు మొత్తం మానవ కుటుంబానికి అవసరమైనది ఇవ్వడానికి పనిచేస్తున్నాడు. కాకపోతే చాలామంది కోరుకునే విధంగా మాత్రం కాదు.

మరి, దేవుడు ఏమి చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, దేవుడు మనుష్యులను చేసిన కొత్తలో జరిగినదాన్ని తెలుసుకోవాలి. అప్పుడు వాళ్లకూ దేవునికీ ఉన్న సంబంధం ఘోరంగా దెబ్బతింది. అయితే అది బాగుచేయడానికి వీల్లేనంతగా దెబ్బతినలేదు.

పాపం వల్ల వచ్చిన నష్టాలు

చాలా సంవత్సరాలుగా పాడుబడిన ఒక ఇల్లు ఉందనుకోండి. దాని పైకప్పు కూలిపోయింది, తలుపులు ఊడిపోయాయి, ఇంటి గోడలు బాగా పాడైపోయాయి. ఒకప్పుడు ఈ ఇల్లు మంచి స్థితిలో ఉండేది, కాని ఇప్పుడలా లేదు. జరిగిన నష్టాన్ని బట్టి చూస్తే ఆ ఇంటిని మళ్లీ మంచి స్థితికి తీసుకురావడం అంత సులువైన పని కాదు. అది ఒక్క రోజులో జరిగే పని కూడా కాదు.

అయితే దాదాపు 6,000 సంవత్సరాల క్రితం మన కంటికి కనిపించని సాతాను అనే ఆత్మప్రాణి ప్రోద్బలంతో ఆదాము, హవ్వ దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో చూద్దాం. అలా తిరుగుబాటు చేయడానికి ముందు, మొట్టమొదటి భార్యాభర్తలు ఎప్పటికీ చనిపోకుండా, పరిపూర్ణ ఆరోగ్యంతో తమ తర్వాతి తరాల వాళ్లందరితో కలిసి సంతోషంగా జీవించగలిగేవాళ్లు. (ఆదికాండము 1:28) ఆదాము, హవ్వ పాపం చేసినప్పుడు, వాళ్లు చేసిన దానివల్ల, వాళ్లకు పుట్టబోయే పిల్లలందరి భవిష్యత్తు పాడైపోయింది.

ఆ తిరుగుబాటు వల్ల చాలా దుష్పరిణామాలు వచ్చాయి. ‘ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించాయి’ అని బైబిలు చెప్తోంది. (రోమీయులు 5:12) పాపం వల్ల మరణం రావడమే కాకుండా, మన సృష్టికర్తతో మనకున్న సంబంధం కూడా దెబ్బతింది, మన శరీరానికి, ఆలోచనలకు, మనసుకు నష్టం వాటిల్లింది. దానివల్ల మన పరిస్థితి పాడుబడ్డ ఇంటి పరిస్థితిలా తయారైంది. నీతిమంతుడైన యోబు, “నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని చెప్పి మన పరిస్థితి నిజంగా ఎలా ఉందో చూపించాడు.—యోబు 14:1.

ఆదాము, హవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు మనుష్యుల గురించి పట్టించుకోవడం మానేశాడా? కాదు! ఇంకా చెప్పాలంటే, మన పరలోక తండ్రి అప్పటి నుండి ఇప్పటి వరకు మానవ కుటుంబ ప్రయోజనం కోసమే పని చేస్తున్నాడు. ఆయన మనకోసం చేస్తున్నదానికి ఇంకా బాగా కృతజ్ఞత చూపించడానికి, పాడుబడిన ఇంటిని బాగు చేయడానికి చేయవలసిన మూడు పనుల గురించి తెలుసుకుందాం. అలాగే, మానవజాతిని బాగుచేయడానికి దేవుడు అవే పనులు చేయడం ఎందుకు అవసరమో చూద్దాం.

1 పాడైపోయిన ఇంటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆ ఇంటి యజమాని దాన్ని బాగుచేయాలో, కూల్చేయాలో నిర్ణయించుకోవాలి.

ఏదెను తోటలో తిరుగుబాటు జరిగిన వెంటనే, తాను మానవజాతిని బాగుచేయాలని కోరుకుంటున్నట్లు యెహోవా దేవుడు ప్రకటించాడు. తనపై తిరుగుబాటు చేయించిన, అదృశ్య ఆత్మప్రాణితో దేవుడు, “నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు” అని అన్నాడు.—ఆదికాండము 3:15.

ఆ మాటల ద్వారా, ఏదెనులో తిరుగుబాటును నడిపించిన వ్యక్తిని నాశనం చేస్తానని మాటిస్తున్నట్లు యెహోవా చూపించాడు. (రోమీయులు 16:20; ప్రకటన 12:9) అంతేకాదు, భవిష్యత్తులో వచ్చే “సంతానము” మానవజాతిని పాపం నుండి విడిపిస్తుందని కూడా యెహోవా ముందే చెప్పాడు. b (1 యోహాను 3:8) యెహోవా అలా చెప్పి, ఆయన తన సృష్టిని కూల్చేస్తానని లేదా నాశనం చేస్తానని కాదుగానీ దాన్ని బాగుచేస్తానని మాటిచ్చాడు. కానీ మానవజాతిని బాగుచేయడానికి సమయం అవసరం.

2 పాడుబడ్డ ఇంటిని బాగుచేసే వ్యక్తి ముందుగా దాన్ని ఎలా చేయాలో బ్లూప్రింట్లు తయారు చేసుకుంటాడు.

యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు నియమావళిని ఇచ్చాడు, వాళ్లు తనను ఆరాధించడానికి ఉపయోగించే ఆలయం ఎలా ఉండాలో వివరించాడు. అవి “రాబోవువాటి ఛాయ” అని బైబిలు చెప్తోంది. (కొలొస్సయులు 2:17) బ్లూప్రింట్లలా, అవి ఇంకా గొప్పవాటికి నమూనాగా ఉన్నాయి.

ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు పాప క్షమాపణ పొందడానికి జంతు బలులు అర్పించేవాళ్లు. (లేవీయకాండము 17:11) ఆ ఆచారం, అప్పటికి శతాబ్దాల తర్వాత మానవజాతిని నిజంగా విడిపించడం కోసం గొప్ప బలి ఇవ్వబడుతుందని చూపించింది. c ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించిన గుడార, ఆలయ నిర్మాణ తీరు, భవిష్యత్తులో రాబోయే మెస్సీయ తన ప్రాణాన్ని బలిగా అర్పించిన దగ్గర నుండి పరలోకానికి తిరిగి వెళ్లే వరకు ఏమేమి చేస్తాడో చూపించింది.— 7వ పేజీలో ఉన్న చార్టును చూడండి.

3 ఆ ఇంటిని బాగుచేసే వ్యక్తి, తను చేసిన బ్లూప్రింట్ల ప్రకారం పని పూర్తి చేయాల్సిన వాళ్లను ఎంచుకుంటాడు.

బలులు అర్పించే విషయంలో ఇశ్రాయేలీయులు చేసినట్లు చేసి, మానవజాతిని విడిపించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించే, వాగ్దానం చేయబడిన మెస్సీయ మరెవరో కాదు యేసే. ఈ యేసునే, “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని బాప్తిస్మమిచ్చే యోహాను అన్నాడు. (యోహాను 1:29) యేసు ఆ బాధ్యతను ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని” అని ఆయన అన్నాడు.—యోహాను 6:38.

యేసు, “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుట” మాత్రమే కాదు, ఆయన తన అనుచరులతో ఒక రాజ్యాన్ని గురించి నిబంధన చేయాలన్నది కూడా దేవుని ఉద్దేశం. (మత్తయి 20:28; లూకా 22:29, 30) మనుష్యుల కోసం తాను చేయాలనుకున్నది దేవుడు ఆ రాజ్యం ద్వారా చేస్తాడు. దేవుని రాజ్యం గురించిన సందేశాన్ని “సువార్త” అంటాం. ఎందుకంటే, భూమ్మీది పరిస్థితులను అదుపు చేయడానికి దేవుడు పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని అది చూపిస్తుంది!—మత్తయి 24:14; దానియేలు 2:44. d

బాగుచేసే పని కొనసాగుతోంది

పరలోకానికి వెళ్లడానికి ముందు యేసు తన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడు, ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.’—మత్తయి 28:19, 20.

కాబట్టి, మానవజాతిని బాగుచేసే పని యేసు చనిపోవడంతో అయిపోయినట్లు కాదు. అది “యుగసమాప్తి” వరకు అంటే దేవుని రాజ్యం భూమిని పరిపాలించడం మొదలుపెట్టేవరకు కొనసాగుతుంది. అది జరిగే సమయం వచ్చేసింది. అలా అని మనం ఎందుకు చెప్పగలమంటే, “యుగసమాప్తి” కాలంలో జరుగుతాయని యేసు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి. eమత్తయి 24:3-14; లూకా 21:7-11; 2 తిమోతి 3:1-5.

ఈ రోజు, దేవుని రాజ్య సువార్త ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను 236 దేశాల్లోవున్న యెహోవాసాక్షులు పాటిస్తున్నారు. అంతెందుకు, మీ చేతుల్లో ఉన్న ఈ పత్రిక కూడా ఆ రాజ్యం గురించి, అది ఏమి సాధిస్తుందనే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేలా సహాయం చేయడానికే తయారుచేయబడింది. కావలికోట ప్రతీ సంచికలోని 2వ పేజీలో ఇలా ఉంటుంది, ‘ఈ పత్రిక పరలోకంలో నిజమైన ప్రభుత్వంగావున్న దేవుని రాజ్యం త్వరలోనే దుష్టత్వాన్ని పూర్తిగా నిర్మూలించి, ఈ భూమిని పరదైసుగా మారుస్తుందనే సువార్తతో ప్రజలను ఓదారుస్తుంది. మనం నిత్యజీవం పొందేలా మన కోసం మరణించి, ఇప్పుడు దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్న యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది.’

ఇప్పుడు కూడా మీరు తీవ్రవాదుల దాడుల గురించిన, ప్రకృతి విపత్తుల గురించిన వార్తలు వింటుండవచ్చు లేదా మీ వాళ్లకే ఏదైనా ఘోరం జరగవచ్చు. కానీ బైబిలు చదివి, అర్థం చేసుకుంటే దేవుడు మనుష్యుల గురించి పట్టించుకోవడం మానేయలేదని మీకు నమ్మకం కుదురుతుంది. నిజమేమిటంటే, “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:26, 27) మన మొదటి తల్లిదండ్రులు పోగొట్టుకున్నది తిరిగి ఇస్తానని ఆయన చెప్పింది జరిగి తీరుతుంది.యెషయా 55:11. (w10-E 05/01)

[అధస్సూచీలు]

a యెహోవా అనేది దేవుని పేరని బైబిలు చెప్తోంది.

b ఆదికాండము 3:15 వివరణ గురించి తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని 19వ అధ్యాయం చూడండి.

c దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 5వ అధ్యాయం చూడండి.

d దేవుని రాజ్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 8వ అధ్యాయాన్ని చూడండి.

e దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 9వ అధ్యాయం చూడండి.

[7వ పేజీలోని చార్టు/ చిత్రాలు]

 (పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

‘నిజమైన దాన్ని పోలినది’ గుడారం దేన్ని సూచించింది?

బలిపీఠం

యేసు అర్పించిన బలి అంగీకరించడానికి దేవునికున్న ఇష్టం.—హెబ్రీయులు 13:10-12.

ప్రధాన యాజకుడు

యేసు.—హెబ్రీయులు 9:11.

1 ప్రాయశ్చిత్త దినాన, ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కోసం బలి అర్పించేవాడు.—లేవీయకాండము 16:15, 29-31.

1 సా.శ. 33, నీసాను 14న యేసు మన తరఫున తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు.—హెబ్రీయులు 10:5-10; 1 యోహాను 2:1, 2.

పరిశుద్ధ స్థలం

యేసు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన స్థితి.—మత్తయి 3:16, 17; రోమీయులు 8:14-17; హెబ్రీయులు 5:4-6.

తెర

యేసు శరీరం. అది ఆయన భూ జీవితానికి పరలోక జీవితానికి మధ్య అడ్డుగోడలా పనిచేసింది.—1 కొరింథీయులు 15:44, 50; హెబ్రీయులు 6:19, 20; 10:19, 20.

2 ప్రధాన యాజకుడు, పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెరను దాటి లోపలికి వెళ్లేవాడు.

2 యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత, “మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు” పరలోకానికి ఆరోహణమవడం ద్వారా ‘తెరను దాటి లోపలికి వెళ్లాడు.’—హెబ్రీయులు 9:24-28.

అతిపరిశుద్ధ స్థలం

పరలోకం.—హెబ్రీయులు 9:24.

3 అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్లిన తర్వాత, ప్రధాన యాజకుడు బలి రక్తంలో కొంచెం నిబంధన మందసం ముందు ప్రోక్షించేవాడు.—లేవీయకాండము 16:12-14.

3 యేసు, తను చిందించిన రక్తం విలువను అందించడం ద్వారా, మన పాపాలకు నిజంగా ప్రాయశ్చిత్తం చేశాడు.—హెబ్రీయులు 9:12, 24; 1 పేతురు 3:21, 22.