కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

మా పాఠకుల ప్రశ్న

అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

వరల్డ్‌ క్రిస్టియన్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తున్న దాని ప్రకారం, “ప్రపంచవ్యాప్తంగా 10,000 మతాల” వరకు ఉన్నాయి. వాటి మధ్య గొడవల వల్ల చెప్పలేనంత హాని జరిగింది కాబట్టి, అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం మేలు చేస్తుందని చాలామంది ఆరాధకులు ఆశిస్తున్నారు. ముక్కలు చెక్కలుగా విడిపోయిన ప్రపంచంలో అది శాంతి సామరస్యాలు తీసుకురాగలదని వాళ్లు నమ్ముతారు.

ఐక్యంగా ఉండమని బైబిలు ప్రోత్సహిస్తోంది. అపొస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘాన్ని, ప్రతి అవయవము ‘చక్కగా అమర్చబడి, అతుకబడివున్న’ మానవ శరీరంతో పోల్చాడు. (ఎఫెసీయులు 4:16) అదేవిధంగా, అపొస్తలుడైన పేతురు, ‘మీరందరు ఏకమనస్కులై ఉండండి’ అని తనలా దేవుణ్ణి నమ్మేవాళ్లను కోరాడు.—1 పేతురు 3:8.

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు, ఎన్నో సంస్కృతులు, మతాలు ఉన్న లోకంలో జీవించారు. అయినా కూడా ఒక మతస్థులు ఇతర మతాచారాలు పాటించడం గురించి రాస్తూ పౌలు, ‘విశ్వాసం ఉన్నవాళ్లకు, విశ్వాసం లేనివాళ్లకు మధ్య స్నేహం ఎలా కుదురుతుంది?’ అని అడిగాడు. తర్వాత, ‘వాళ్ల నుండి వేరుగా ఉండండి’ అని క్రైస్తవులను హెచ్చరించాడు. (2 కొరింథీయులు 6:15, 17, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి, అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం తప్పని పౌలు చెప్తున్నట్లు అర్థమౌతుంది. ఆయన ఎందుకలా చెప్పాడు?

నిజమైన క్రైస్తవులు, క్రైస్తవులు కాని వాళ్లు కలిసి ఆరాధించడం సరికాదని అపొస్తలుడు వివరించాడు. (2 కొరింథీయులు 6:14) అలా ఆరాధించడం వల్ల నిజమైన క్రైస్తవుల విశ్వాసానికే హాని కలగవచ్చు. పౌలు ఆ మాటల్లో, తమ పొరుగునవున్న కొంతమంది పిల్లలు చెడుగా ప్రవర్తిస్తారని తెలిసినప్పుడు ఒక తండ్రి ఎలా బాధపడతాడో తను అలా బాధపడుతున్నానని చూపిస్తున్నాడు. ఆ తండ్రికి తన పిల్లల మీద శ్రద్ధ ఉంది కాబట్టి, వాళ్లు ఎవరితో మాత్రమే ఆడుకోవాలో ఆలోచించి నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయాన్ని పిల్లలు అంతగా ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ వాళ్లున్న పరిస్థితులను బట్టి, అలా వేరుగా ఉంటే ఆ పిల్లలు చెడు ప్రభావాలకు దూరంగా ఉండగలుగుతారు. అదే విధంగా, క్రైస్తవులు ఇతర మతాచారాలను పాటించకుండా ఉంటే వాటిని పాటించడం వల్ల జరిగే హానిని వాళ్లు తప్పించుకోగలుగుతారని పౌలుకు తెలుసు.

పౌలు అలా చెప్పినప్పుడు ఆయన యేసు చేసినట్లే చేస్తున్నాడు. ప్రజలు శాంతిగా జీవించడానికి కృషి చేయడంలో యేసు అందరికన్నా ఆదర్శవంతంగా ఉన్నప్పటికీ అన్ని మతాలు ఒక్కటే అన్నట్లు ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు. యేసు భూమ్మీద పరిచర్య చేసిన కాలంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు వంటి ఎన్నో మత గుంపుల వాళ్లు ఉండేవాళ్లు. ఈ మత గుంపులన్నీ కలిసి యేసును తప్పుపడుతూ చివరికి ఆయనను చంపడానికి పన్నాగం పన్నాయి. వాళ్లు అలా చేస్తున్నా యేసు మాత్రం, ‘పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవాళ్ల బోధ గురించి జాగ్రత్తపడాలి’ అని తన అనుచరులకు చెప్పాడు.—మత్తయి 16:12.

ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకానికి దూరంగా ఉండాలన్న బైబిలు హెచ్చరికను ఇప్పటికీ పాటించాలా? అవును, పాటించాలి. నీళ్లు, నూనె ఒకే కుండలో వేసినా అవి అస్సలు కలవవు. వేర్వేరు మత విశ్వాసాలను, అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకంతో కలపాలని చూసినా వాటి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకు, వేర్వేరు మతాల వాళ్లు కలిసి శాంతి కోసం ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. వాళ్లు ఏ దేవుణ్ణి వేడుకుంటున్నారు? క్రైస్తవ మతస్థులు ఆరాధించే త్రిత్వ దేవుడినా? హిందువులు ఆరాధించే బ్రహ్మనా? బుద్ధుడినా? లేదా మరొకరినా?

‘అంత్యదినాల్లో’ అన్ని దేశాల్లోని ప్రజలు, ‘యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం రండి. ఆయన తన మార్గాల గురించి మనకు బోధిస్తాడు. మనం ఆయన త్రోవలలో నడుచుకుందాం’ అంటారని మీకా ప్రవక్త ముందుగా రాశాడు. (మీకా 4:1-4) దానివల్ల ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు ఏర్పడతాయి. అయితే, ఏదో ఒకటి చేసి అన్ని మతాల నమ్మకాలను కలపడం వల్ల శాంతి సామరస్యాలు ఏర్పడవుగానీ అందరూ ఒకే సత్య మతంలోకి రావడం వల్ల ఏర్పడతాయి. (w10-E 06/01)

[13వ పేజీలోని చిత్రం]

2008లో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొన్న, ప్రపంచంలోని ప్రధాన మతాల సభ్యులు

[క్రెడిట్‌ లైను]

REUTERS/Andreas Manolis