కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ఇతర మతాల ఆచారాల్ని కూడా పాటిస్తారా?

యెహోవాసాక్షులు ఇతర మతాల ఆచారాల్ని కూడా పాటిస్తారా?

 యెహోవాసాక్షులముగా, విశ్వాసానికి సంబంధించిన విషయాలను అన్ని మతాలవాళ్లతో మేం సంతోషంగా మాట్లాడుతుంటాం. కానీ ఆరాధన విషయానికొస్తే, ఇతర నమ్మకాలున్న వాళ్లతో కలిసి వాళ్ల ఆరాధనలో పాలుపంచుకోం. నిజ క్రైస్తవులు ‘చక్కగా అమర్చబడి’ ఉన్నారని బైబిలు చెప్తోంది. అలా ఉండడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఒకేలాంటి నమ్మకాలు ఉండడం. (ఎఫెసీయులు 4:16; 1 కొరింథీయులు 1:10; ఫిలిప్పీయులు 2:2) అంటే ప్రేమ, కనికరం, క్షమాగుణం వంటి లక్షణాల విలువను మేం అందరం ఒకేలా గుర్తించామని మాత్రమే కాదు. మా మత నమ్మకాలన్నీ బైబిల్లో ఉన్న ఖచ్చితమైన జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. ఆ జ్ఞానం లేకపోతే మాకు విశ్వాసం లేనట్లే.—రోమీయులు 10:2, 3.

 వేరే నమ్మకాలున్న ప్రజలతో కలిసి వాళ్ల ఆరాధనలో పాలుపంచుకోవడాన్ని, ఒకే లాంటి ఎత్తులో లేని కాడి కింద ఉండడంతో బైబిలు పోలుస్తోంది. అలా చేయడం వల్ల క్రైస్తవుల విశ్వాసానికి హాని కలుగుతుంది. (2 కొరింథీయులు 6:14-17) అందుకే తన శిష్యుల్ని వేరే మతాల నమ్మకాల్ని పాటించడానికి యేసు అనుమతించలేదు. (మత్తయి 12:30; యోహాను 14:6) అదేవిధంగా మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో, పొరుగువాళ్లతో కలిసి వాళ్ల ఆరాధనలో భాగం వహించడానికి దేవుడు ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలీయులకు అనుమతివ్వలేదు. (నిర్గమకాండము 34:11-14) వేరే మతంవాళ్లు తమకు సహాయం చేస్తామని వచ్చినప్పుడు నమ్మకమైన ఇశ్రాయేలీయులు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ల సహాయం తీసుకుంటే వాళ్ల మతాచారాలతో సంబంధం పెట్టుకునే అవకాశం ఉండేది.—ఎజ్రా 4:1-3.

ఇతర మతాలవాళ్లతో యెహోవాసాక్షులు మాట్లాడతారా?

 మాట్లాడతారు. అపొస్తలుడైన పౌలులాగే, మేం కూడా పరిచర్యలో “ఎంతమందిని వీలైతే అంతమందిని” కలిసి వాళ్ల ఆలోచనల్ని, అవగాహనల్ని అర్థంచేసుకోవడానికి కృషిచేస్తాం. (1 కొరింథీయులు 9:19-22) అలా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, అవతలి వ్యక్తి పట్ల “ప్రగాఢ గౌరవం” చూపించాలనే బైబిలు సలహాను పాటించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాం.—1 పేతురు 3:15.