కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

పాడౌతున్న భూమి—బైబిలు ఏం చెప్తుంది?

పాడౌతున్న భూమి—బైబిలు ఏం చెప్తుంది?

 “మనం వాతావరణానికి సంబంధించిన వినాశనం వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాం. త్వరలో చాలా నగరాలు నీట మునుగుతాయి. ముందెన్నడూ లేనంతగా వడగాలులు వీస్తాయి. భీభత్సమైన తుఫానులు వస్తాయి. చాలా చోట్ల నీటి కొరత ఏర్పడుతుంది. మొక్కల్లో, జంతువుల్లో లక్షల జాతులు అంతరించిపోతాయి. దీన్ని తక్కువచేసి చెప్పట్లేదు, ఎక్కువచేసి చెప్పట్లేదు. ప్రస్తుతం మనం ఇంధనాన్ని లేదా శక్తిని వాడే తీరును బట్టి, రేపు జరగబోయేది ఇదే అని సైన్స్‌ చెప్తోంది.“ —2022, ఏప్రిల్‌ 4న వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఇచ్చిన నివేదికను ఉద్దేశించి, ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ-జనరల్‌ ఆంటోన్యో గ్యూటేరెష్‌ ప్రసంగం.

 “రాబోయే సంవత్సరాల్లో, వాతావరణ మార్పుల కారణంగా జరిగే వినాశనం దాదాపు [అమెరికాలో ఉన్న] 423 జాతీయ పార్కులన్నిటినీ తాకబోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎక్కువగా పాడయ్యేది ఈ పార్కులే. జరగబోయే విపత్తులు, ఇంచుమించు బైబిల్లో చదివిన వినాశనాల్లాగే ఉన్నాయి: అగ్ని కురవడం, జలప్రళయం, కరిగే మంచు పొరలు, పొంగే సముద్రాలు అలాగే వడగాలులు.”—“ఎల్లోస్టోన్‌లో వరద భీభత్సం, రాబోయే సంక్షోభాలకు సంకేతం,” ద న్యూయార్క్‌ టైమ్స్‌, జూన్‌ 15, 2022.

 పర్యావరణ సమస్యలు ఎప్పటికైనా పరిష్కారం అవుతాయా? అలాగైతే, ఎవరు వాటిని పరిష్కరిస్తారు? అసలు బైబిలు ఏం చెప్తుందో చూడండి.

పర్యావరణ హాని గురించి బైబిలు ముందే చెప్పింది

 దేవుడు ‘భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేస్తాడని’ బైబిలు చెప్తుంది. (ప్రకటన 11:18) ఈ వచనం నుండి మనం మూడు విషయాలు నేర్చుకోవచ్చు:

  1.  1. మనుషుల పనులు భూమికి ఎంతో హాని చేస్తాయి.

  2.  2. ఆ హానికి లేదా వినాశనానికి ఓ ముగింపు ఉంది.

  3.  3. పర్యావరణ సమస్యల్ని పరిష్కరించేది మనుషులు కాదు, దేవుడే.

మన గ్రహానికి ఏమీ కాదు, అది భద్రంగా ఉంటుంది

 “భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది” అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 1:4) దానిమీద మనుషులు ఎప్పుడూ నివాసం ఉంటారు.

  •   “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:29.

 దేవుడు మన భూగ్రహాన్ని పూర్తిగా బాగుచేస్తాడు.

  •   “ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి, ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.”—యెషయా 35:1.