సామెతలు 26:1-28

  • సోమరి వర్ణన (13-16)

  • వేరేవాళ్ల గొడవల్లో తలదూర్చకు (17)

  • ఆటపట్టించకూడదు (18, 19)

  • కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది (20, 21)

  • లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దలు (22)

26  ఎండాకాలంలో మంచులా, కోతకాలంలో వర్షంలామూర్ఖుడికి ఘనత తగదు.+   పక్షి పారిపోవడానికి, వానకోకిల ఎగరడానికి కారణం ఉన్నట్టే,ప్రతీ శాపానికి ఏదోక కారణం ఉంటుంది.*   గుర్రం కోసం కొరడా, గాడిద కోసం కళ్లెం,+మూర్ఖుల వీపు కోసం బెత్తం ఉన్నాయి.+   మూర్ఖుడికి అతని తెలివితక్కువతనాన్ని బట్టి జవాబు ఇవ్వకు,లేకపోతే నువ్వు కూడా అతనితో సమానం అవుతావు.*   మూర్ఖుడికి అతని తెలివితక్కువతనాన్ని బట్టి జవాబు ఇవ్వు,లేదంటే అతను తాను తెలివిగలవాణ్ణని అనుకుంటాడు.+   మూర్ఖుడికి పనులు అప్పగించేవాడుతన కాళ్లు తానే విరగ్గొట్టుకొని తనకు తానే హాని చేసుకునేవాడితో* సమానం.   మూర్ఖుల నోట సామెత,కుంటివాడి కుంటి* కాళ్ల లాంటిది.+   మూర్ఖుడికి ఘనత ఇవ్వడంవడిసెలకు రాయి కట్టడం లాంటిది.+   తాగుబోతు చేతిలో ముళ్లచెట్టు ఎలా ఉంటుందోమూర్ఖుల నోట సామెత అలా ఉంటుంది. 10  మూర్ఖుల్ని, దారినపోయే వాళ్లను పనిలో పెట్టుకునేవాడుఎటుపడితే అటు బాణాలు వేసి* గాయపర్చే విలుకాడి లాంటివాడు. 11  కుక్క తన వాంతి దగ్గరికి తిరిగెళ్లినట్టుమూర్ఖుడు మళ్లీమళ్లీ తన తెలివితక్కువతనాన్ని చూపిస్తాడు.+ 12  తాను తెలివిగలవాణ్ణి అనుకునే మనిషిని చూశావా?+ అతని కన్నా మూర్ఖుణ్ణి బాగుచేయడం తేలిక. 13  సోమరి, “దారిలో కొదమ సింహం ఉంది,సంతవీధిలో సింహం ఉంది!” అని అంటాడు.+ 14  బందుల మీద తలుపు తిరుగుతూ ఉంటుంది,అలాగే సోమరి తన పరుపు మీద దొర్లుతూ ఉంటాడు.+ 15  సోమరి విందుపాత్రలో చెయ్యి ఉంచుతాడుకానీ దాన్ని నోటి దాకా తెచ్చుకోవడం అతనికి కష్టమనిపిస్తుంది.+ 16  వివేచనతో జవాబిచ్చే ఏడుగురి కన్నాసోమరి తానే తెలివిగలవాణ్ణి అనుకుంటాడు. 17  దారిన వెళ్తూ తనకు సంబంధంలేని గొడవను బట్టి కోపం తెచ్చుకునేవాడు*కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానం.+ 18  అగ్ని బాణాల్ని, బాణాల్ని, ప్రాణాంతకమైన బాణాల్ని* విసిరే పిచ్చోడు 19  తన పొరుగువాణ్ణి ఆటపట్టించి, “ఊరికే, సరదాకి చేశాను!” అనేవాడితో సమానం.+ 20  కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది,లేనిపోనివి కల్పించి చెప్పేవాడు లేకపోతే గొడవ ఆగిపోతుంది.+ 21  ఆరిపోయే కట్టెల్ని బొగ్గులు, అగ్నిని కట్టెలు మండించినట్టేకలహప్రియుడు గొడవను రగిలిస్తాడు.+ 22  లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దల* లాంటివి;అవి నేరుగా కడుపు లోపలికి వెళ్లిపోతాయి.+ 23  దుష్ట హృదయం నుండి వచ్చే ఆప్యాయమైన మాటలుమట్టి పెంకు మీది వెండి పూత లాంటివి.+ 24  ఇతరుల్ని ద్వేషించేవాడు తన పెదాల చాటున దాన్ని దాచేస్తాడు,అయితే అతని హృదయంలో మోసం ఉంటుంది. 25  అతను దయగా మాట్లాడినా అతన్ని నమ్మొద్దు,అతని హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.* 26  అతను తన ద్వేషాన్ని మోసంతో దాచిపెట్టినాసమాజంలో అతని చెడుతనం బట్టబయలౌతుంది. 27  గుంట తవ్వేవాడు అందులో పడిపోతాడు,ఎవరైనా రాయిని దొర్లిస్తే, అది వాళ్ల మీదికే వచ్చి పడుతుంది.+ 28  అబద్ధాలాడే నాలుక, అది నలగ్గొట్టిన వాళ్లను ద్వేషిస్తుంది,పొగిడే నోరు నాశనం చేస్తుంది.+

అధస్సూచీలు

లేదా “కారణంలేని శాపం తగలదు” అయ్యుంటుంది.
లేదా “అతని స్థాయికి వస్తావు.”
అక్ష., “దౌర్జన్యాన్ని తాగేవాడితో.”
లేదా “ఊగిసలాడే.”
లేదా “అందర్నీ.”
లేదా “గొడవలో తలదూర్చేవాడు” అయ్యుంటుంది.
అక్ష., “మరణాన్ని.”
లేదా “ఆత్రంగా మింగేసే ఆహారపదార్థాల.”
లేదా “అతని హృదయం పూర్తిగా అసహ్యంగా ఉంటుంది.”