కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

133వ అధ్యాయం

యేసు శరీరాన్ని సమాధి చేశారు

యేసు శరీరాన్ని సమాధి చేశారు

మత్తయి 27:57–28:2 మార్కు 15:42–16:4 లూకా 23:50–24:3 యోహాను 19:31–20:1

  • యేసు శరీరాన్ని కొయ్యమీద నుండి దించారు

  • ఆయన శరీరాన్ని సమాధి కోసం సిద్ధం చేశారు

  • సమాధి ఖాళీగా ఉండడం స్త్రీలు చూశారు

అది నీసాను 14 శుక్రవారం, సాయంత్రం కావస్తోంది. సూర్యాస్తమయంతో నీసాను 15, విశ్రాంతి రోజు మొదలౌతుంది. యేసు అప్పటికే చనిపోయాడు. అయితే ఆయన పక్కన వేలాడదీయబడిన ఇద్దరు దొంగలు ఇంకా చనిపోలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మృతదేహాల్ని ‘రాత్రంతా కొయ్య మీద ఉంచకూడదు,’ వాటిని అదే రోజు పాతిపెట్టాలి.—ద్వితీయోపదేశకాండం 21:22, 23.

పైగా, శుక్రవారం సిద్ధపడే రోజు. అంటే ప్రజలు ఆ రోజున భోజనం సిద్ధం చేసుకునేవాళ్లు, అలాగే విశ్రాంతి రోజున పని చేయకూడదు కాబట్టి పనుల్ని ఆ రోజే పూర్తి చేసుకునేవాళ్లు. సూర్యాస్తమయంతో, గొప్ప విశ్రాంతి రోజు మొదలౌతుంది. (యోహాను 19:31) పులవని రొట్టెల పండుగలోని మొదటి రోజు, అంటే నీసాను 15 ఏ రోజున వచ్చినా దాన్ని విశ్రాంతి రోజుగానే పరిగణిస్తారు. (లేవీయకాండం 23:5-7) ఈసారి అది, వారంవారం వచ్చే విశ్రాంతి రోజున వచ్చింది. రెండు విశ్రాంతి రోజులు ఒకేసారి వచ్చాయి కాబట్టి, అది గొప్ప విశ్రాంతి రోజు అయింది.

అందుకే యేసును, ఆయన పక్కన వేలాడదీసిన ఇద్దరు దొంగల్ని త్వరగా చంపించమని యూదులు పిలాతును అడిగారు. కొయ్యమీద ఉన్నవాళ్లను త్వరగా చంపడానికి వాళ్ల కాళ్లు విరగ్గొట్టేవాళ్లు. అలా విరగ్గొట్టినప్పుడు వాళ్లు తమ శరీరాన్ని కదపలేక, ఊపిరి తీసుకోలేక త్వరగా చనిపోయేవాళ్లు. సైనికులు వచ్చి ఆ ఇద్దరు దొంగల కాళ్లు విరగ్గొట్టారు. కానీ యేసు అప్పటికే చనిపోయినట్లు అనిపించడంతో వాళ్లు ఆయన కాళ్లు విరగ్గొట్టలేదు. అలా కీర్తన 34:20 లో ఉన్న ఈ ప్రవచనం నెరవేరింది: “ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు; వాటిలో ఒక్కటి కూడా విరగలేదు.”

యేసు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి, ఒక సైనికుడు ఈటెతో ఆయన పక్కటెముకల్లో, గుండెకు దగ్గరగా పొడిచాడు. “వెంటనే రక్తం, నీళ్లు బయటికి వచ్చాయి.” (యోహాను 19:34) అలా, “వాళ్లు తాము పొడిచిన వ్యక్తి వైపు చూస్తారు” అనే మరో లేఖనం నెరవేరింది.—జెకర్యా 12:10.

యేసుకు మరణశిక్ష వేసిన చోట, అరిమతయియ అనే నగరానికి చెందిన యోసేపు కూడా ఉన్నాడు. అతను “ధనవంతుడు,” మహాసభలో మంచి పేరున్న సభ్యుడు. (మత్తయి 27:57) అతను “మంచివాడు, నీతిమంతుడు,” “దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నవాడు” అని బైబిలు వర్ణిస్తుంది. అతను “యూదులకు భయపడి” తాను యేసు శిష్యుడని ఎవరికీ చెప్పకపోయినప్పటికీ, యేసు విషయంలో మహాసభ ఇచ్చిన తీర్పుకు మాత్రం మద్దతివ్వలేదు. (లూకా 23:50; మార్కు 15:43; యోహాను 19:38) అతను ధైర్యం చేసి, యేసు శరీరం తనకు ఇవ్వమని పిలాతును అడిగాడు. పిలాతు సైనికాధికారిని పిలిపించి, యేసు చనిపోయాడని నిర్ధారించుకున్నాక, ఆయన శరీరాన్ని తీసుకెళ్లడానికి యోసేపుకు అనుమతి ఇచ్చాడు.

యోసేపు శుభ్రమైన, నాణ్యమైన నారబట్టలు కొన్నాడు. అతను యేసు శరీరాన్ని కొయ్యమీద నుండి దించి, సమాధికి సిద్ధం చేయడానికి నారబట్టలతో చుట్టాడు. “అంతకుముందు రాత్రిపూట యేసు దగ్గరికి వచ్చిన నీకొదేము” కూడా ఆయన శరీరాన్ని సమాధికి సిద్ధం చేయడంలో సహాయం చేశాడు. (యోహాను 19:39) అతను ఖరీదైన బోళం-అగరు మిశ్రమాన్ని సుమారు 30 కిలోలు తీసుకొచ్చాడు. ఆ విధంగా యూదుల వాడుక ప్రకారం, సుగంధ ద్రవ్యాలు ఉంచిన నారబట్టలతో యేసు శరీరాన్ని చుట్టారు.

అక్కడికి దగ్గర్లోనే, యోసేపు తొలిపించుకున్న కొత్త రాతి సమాధి ఉంది. దాంట్లో యేసు శరీరాన్ని ఉంచి, ద్వారానికి అడ్డుగా ఒక పెద్ద రాయి దొర్లించారు. కాసేపట్లో విశ్రాంతి రోజు మొదలౌతుంది కాబట్టి ఇదంతా త్వరత్వరగా చేసేశారు. మగ్దలేనే మరియ, చిన్న యాకోబు వాళ్ల అమ్మ మరియ యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడంలో సహాయం చేసివుంటారు. విశ్రాంతి రోజు అయిపోయాక వచ్చి మళ్లీ ఆయన శరీరానికి “సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు” పూయడం కోసం, వాటిని తయారుచేయడానికి హడావిడిగా ఇంటికి వెళ్లారు.—లూకా 23:56.

తర్వాతి రోజు అంటే విశ్రాంతి రోజున ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు: “అయ్యా, ఆ మోసగాడు బ్రతికున్నప్పుడు, ‘నేను మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతికించబడతాను’ అని అన్నట్టు గుర్తు. కాబట్టి మూడో రోజు వరకు సమాధికి కాపలా ఉంచమని ఆజ్ఞాపించు. లేదంటే అతని శిష్యులు వచ్చి దొంగతనంగా అతన్ని తీసుకెళ్లిపోయి, ‘ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు!’ అని ప్రజలకు చెప్తారు. అప్పుడు మొదటి మోసం కన్నా చివరి మోసం ఘోరంగా ఉంటుంది.” అందుకు పిలాతు ఇలా అన్నాడు: “మీరు భటుల్ని తీసుకెళ్లి, మీకు వీలైనంత కట్టుదిట్టంగా ఆ సమాధికి కాపలా పెట్టుకోండి.”—మత్తయి 27:63-65.

ఆదివారం పొద్దుపొద్దున్నే మగ్దలేనే మరియ, యాకోబు వాళ్ల అమ్మ మరియ, ఇతర స్త్రీలు యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి దగ్గరికి వెళ్లారు. “మనకోసం సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని వాళ్లలోవాళ్లు అనుకుంటూ ఉన్నారు. (మార్కు 16:3) కానీ అప్పటికే ఒక భూకంపం వచ్చింది, ఒక దేవదూత ఆ రాయిని దొర్లించాడు, భటులు పారిపోయారు, సమాధి ఖాళీగా ఉంది!