కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 24

పౌలు సంఘాలకు పత్రికలు రాశాడు

పౌలు సంఘాలకు పత్రికలు రాశాడు

పౌలు పత్రికలు మొదటి శతాబ్దపు క్రైస్తవులను బలపరిచాయి

దేవుని సంకల్పాలు నెరవేరడంలో కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘం ఓ ప్రత్యేక పాత్ర పోషించింది. కానీ, సంఘం ఏర్పడిన కొంతకాలానికే మొదటి శతాబ్దపు క్రైస్తవుల విశ్వాసానికి పరీక్షలు ఎదురయ్యాయి. తమను బయటవాళ్లు హింసించినా, తమకు సంఘంలోని కొంతమంది నుండి ఆధ్యాత్మిక హాని కలిగే ప్రమాదం ఉన్నా వాళ్లు దేవునికి నమ్మకంగా ఉన్నారా? క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్న 21 పత్రికలు అప్పట్లో వాళ్లకు అవసరమైన సలహాలను, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.

వాటిలో 14 పత్రికలను అంటే రోమీయుల పత్రిక నుండి హెబ్రీయుల పత్రిక వరకు అపొస్తలుడైన పౌలు రాశాడు. ఆయన రాసిన పత్రికలు, ఆయన ఎవరికైతే రాయాలనుకున్నాడో వాళ్ల పేర్లతోనే అంటే సంఘం పేర్లు లేక వ్యక్తి పేర్లతో ఉన్నాయి. ఆయన తన పత్రికల్లో రాసిన కొన్ని విషయాలను చూద్దాం.

నైతిక విలువలకు, ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరికలు. జారత్వం, వ్యభిచారం, ఇతర ఘోరమైన పాపాలు చేసినవాళ్లు “దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.” (గలతీయులు 5:19-21; 1 కొరింథీయులు 6:9-11) దేవుని ఆరాధకులు జాతి విభేదాలు లేకుండా ఐకమత్యంగా ఉండాలి. (రోమీయులు 2:11; ఎఫెసీయులు 4:1-6) అవసరంలోవున్న తోటివిశ్వాసుల కోసం తమకున్నది సంతోషంగా ఇవ్వాలి. (2 కొరింథీయులు 9:7) “యెడతెగక ప్రార్థనచేయుడి” అని పౌలు చెప్పాడు. యెహోవా ఆరాధకులు ప్రార్థనలో తమ హృదయాలను కుమ్మరించాలని పౌలు ప్రోత్సహించాడు. (1 థెస్సలొనీకయులు 5:17; 2 థెస్సలొనీకయులు 3:1, 2; ఫిలిప్పీయులు 4:6, 7) దేవుడు మన ప్రార్థనలు వినాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి.—హెబ్రీయులు 11:6.

కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి? భర్త భార్యను తన సొంత శరీరంలా ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను ఎంతో గౌరవించాలి. పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, ఎందుకంటే, అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుని వాక్యంలోని సూత్రాల సహాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమతో నడిపింపును, శిక్షణను ఇవ్వాలి.—ఎఫెసీయులు 5:22–6:4; కొలొస్సయులు 3:18-21.

దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం. మోషే ధర్మశాస్త్రంలోని అనేక నియమాలు, ఇశ్రాయేలీయులను క్రీస్తు వచ్చేంతవరకు కాపాడి, వారికి నడిపింపును ఇచ్చాయి. (గలతీయులు 3:24) అయితే, క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. పౌలు, హెబ్రీయులకు అంటే క్రైస్తవులుగా మారిన యూదులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం అంటే ఏమిటో, దేవుని సంకల్పం క్రీస్తు ద్వారా ఎలా నెరవేరిందో, భవిష్యత్తులో ఎలా నెరవేరుతుందో వివరించాడు. ధర్మశాస్త్రంలోని అనేక విషయాలు భవిష్యత్‌ విషయాలకు గుర్తులుగా ఉన్నాయని పౌలు వివరించాడు. ఉదాహరణకు, జంతు బలులు, పాపాలకు అసలు పరిహారాన్నిచ్చే యేసు బలి అర్పణకు గుర్తుగా ఉన్నాయి. (హెబ్రీయులు 10:1-4) యేసు మరణంతో ధర్మశాస్త్రం అవసరం తీరిపోయింది కాబట్టి దేవుడు దాన్ని రద్దు చేశాడు.—కొలొస్సయులు 2:13-17; హెబ్రీయులు 8:13.

సంఘాన్ని వ్యవస్థీకరించడానికి కావాల్సిన నిర్దేశం. క్రైస్తవ సంఘంలో బాధ్యతలు చేపట్టాలనుకునేవారి నైతిక ప్రవర్తన ఎంతో బాగుండాలి, వాళ్లకు బైబిల్లో పేర్కొనబడిన అర్హతలుండాలి. (1 తిమోతి 3:1-10, 12, 13; తీతు 1:5-9) యెహోవా ఆరాధకులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి తోటి విశ్వాసులతో కలిసి క్రమంగా సమావేశమవ్వాలి. (హెబ్రీయులు 10:24, 25) క్రైస్తవ కూటాలు ప్రోత్సాహకరంగా, ఉపదేశాత్మకంగా ఉండాలి.—1 కొరింథీయులు 14:26, 31.

పౌలు తిమోతికి రెండు పత్రికలు రాశాడు. రెండోది రాసే సమయానికి, పౌలు రోముకు తిరిగివచ్చాడు. అక్కడ ఆయన బంధీగా కొంతకాలం తీర్పు కోసం ఎదురుచూశాడు. ధైర్యవంతులైన కొందరు మాత్రమే ప్రాణాలకు తెగించి పౌలును చూడ్డానికి వెళ్లారు. తాను త్వరలోనే చనిపోతానని పౌలుకు తెలుసు. అందుకే ఆయన “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని” అని తిమోతికి రాశాడు. (2 తిమోతి 4:7) ఆ తర్వాత కొంతకాలానికి, పౌలు బహుశా క్రైస్తవ విశ్వాసాన్నిబట్టి చంపబడ్డాడు. కానీ, ఆయన రాసిన పత్రికలు నేటికీ దేవుని నిజ ఆరాధకులను నడిపిస్తూనే ఉన్నాయి.

రోమీయులు; 1వ, 2వ కొరింథీయులు;గలతీయులు;ఫిలిప్పీయులు; కొలొస్సయులు; 1వ, 2వ థెస్సలొనీకయులు;1వ, 2వ తిమోతి; తీతు; ఫిలేమోను; హెబ్రీయులు.