కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

105వ కథ

యెరూషలేములో కనిపెట్టుకొని ఉండడం

యెరూషలేములో కనిపెట్టుకొని ఉండడం

ఇక్కడున్న ప్రజలు యేసు అనుచరులు. వాళ్ళు యేసుకు విధేయత చూపించి యెరూషలేములోనే ఉండిపోయారు. వాళ్ళంతా కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఒక పెద్ద శబ్దం ఇల్లంతా నిండిపోయింది. ఆ శబ్దం బలంగా వీచే గాలి శబ్దంలా వినిపించింది. ఆ తర్వాత ప్రతి శిష్యుని తలపై నాలుకలవలే అగ్ని ప్రత్యక్షమవ్వడం ప్రారంభించింది. ప్రతి ఒక్కరి తలపై అగ్ని మీకు కనిపిస్తుందా? దానంతటి భావమేమిటి?

అది ఒక అద్భుతం! యేసు తిరిగి తన తండ్రి దగ్గరకు పరలోకానికి వెళ్ళిన తర్వాత తన అనుచరులపై దేవుని పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ వాళ్ళకు ఏమి చేయడానికి సహాయం చేసిందో మీకు తెలుసా? వాళ్ళందరూ వేర్వేరు భాషలలో మాట్లాడడం ప్రారంభించారు.

యెరూషలేములోని చాలామంది ప్రజలకు బలమైన గాలి వీచినప్పుడు వచ్చే శబ్దం వినిపించింది, కాబట్టి వాళ్ళు ఏమి జరుగుతుందో చూడడానికి వచ్చారు. వాళ్ళలో కొంతమంది, ఇశ్రాయేలీయుల పెంతెకొస్తు పండుగ కోసం ఇతర దేశాలనుండి వచ్చారు. అలా దర్శించడానికి వచ్చిన వాళ్ళకు ఎంతటి ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురయ్యిందో కదా! దేవుడు చేసిన అద్భుతమైన విషయాల గురించి ఆ శిష్యులు తమ స్వంత భాషలలో మాట్లాడడాన్ని వాళ్ళు విన్నారు.

‘ఈ ప్రజలు గలిలయులు కారా, మన దేశాల్లో ఉపయోగించే వేర్వేరు భాషల్లో వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు?’ అని ఆ సందర్శకులు ఆశ్చర్యపోయారు.

దానికిగల కారణాన్ని వాళ్ళకు వివరించడానికి పేతురు లేచి నిలబడ్డాడు. ఆయన పెద్ద స్వరంతో, యేసు ఎలా చంపబడ్డాడో, యెహోవా మృతులలోనుండి ఆయనను ఎలా లేపాడో ప్రజలకు తెలియజేశాడు. ‘ఇప్పుడు, యేసు పరలోకంలో దేవుని కుడి ప్రక్కన ఉన్నాడు. ఆయన తాను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అందుకే మీరు ఈ అద్భుతాలను చూశారు, విన్నారు’ అని పేతురు చెప్పాడు.

పేతురు ఆ విషయాలను తెలియజేసినప్పుడు, చాలామంది ప్రజలు యేసుకు జరిగిన దానిని గురించి బాధపడ్డారు. ‘మేము ఏమి చెయ్యాలి?’ అని వాళ్ళు అడిగారు. పేతురు వాళ్ళకు, ‘మీరు మీ జీవితాలను మార్చుకొని బాప్తిస్మం పొందాలి’ అని చెప్పాడు. కాబట్టి ఆ రోజే, 3,000 మంది బాప్తిస్మం పొంది యేసు అనుచరులు అయ్యారు.