కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 24

“ధైర్యంగా ఉండు!”

“ధైర్యంగా ఉండు!”

యూదులు పన్నిన కుట్ర నుండి పౌలు ప్రాణాలతో బయటపడ్డాడు, ఫేలిక్సు ముందు తన వాదన వినిపించాడు

అపొస్తలుల కార్యాలు 23:11–24:27 ఆధారంగా

1, 2. యెరూషలేములో హింసలు ఎదురైనప్పుడు పౌలు ఎందుకు ఆశ్చర్యపోలేదు?

 యెరూషలేములో అల్లరిమూక నుండి తప్పించుకున్న తర్వాత పౌలు మళ్లీ బందీ అయ్యాడు. యెరూషలేములో ఇలాంటి హింసను ఎదుర్కొంటున్నందుకు పౌలు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, అక్కడ పౌలుకు “సంకెళ్లు, శ్రమలు” ఎదురౌతాయని పవిత్రశక్తి ముందుగానే చెప్పింది. (అపొ. 20:22, 23) తనకు సరిగ్గా ఏం జరుగుతుందో తెలీకపోయినా, యేసు పేరు విషయంలో ఇంకా ఎన్నో బాధలు పడాలని మాత్రం పౌలుకు తెలుసు.—అపొ. 9:16.

2 పౌలును బంధించి “అన్యజనుల చేతికి అప్పగిస్తారని” క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రవక్తలు కూడా ముందుగానే హెచ్చరించారు. (అపొ. 21:4, 10, 11) ఇంతకుముందు మనం చూసినట్లుగా, యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మహాసభలో కూడా, గొడవ పెద్దదయ్యేసరికి పౌలును చంపేస్తారేమో అనిపించింది. కానీ ఇప్పుడు పౌలు రోమా సైనికుల దగ్గర ఖైదీగా ఉన్నాడు, ముందుముందు ఎన్నో విచారణలు, నిందలు ఎదుర్కోబోతున్నాడు. (అపొ. 21:31; 23:10) కాబట్టి అపొస్తలుడైన పౌలుకు నిజంగా ప్రోత్సాహం అవసరం!

3. ప్రకటనా పనిలో ముందుకు వెళ్లడానికి మనకు ప్రోత్సాహం ఎక్కడ దొరుకుతుంది?

3 ఈ చివరి రోజుల్లో “క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి” అని మనకు తెలుసు. (2 తిమో. 3:12) ప్రకటనా పనిలో ముందుకు వెళ్లాలంటే, మనకు కూడా ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అవసరం. “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” మనకు ప్రచురణల ద్వారా, మీటింగ్స్‌ ద్వారా తగిన సమయంలో ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! (మత్త. 24:45) ఏ శత్రువులూ మనమీద గెలవలేరని యెహోవా మాటిచ్చాడు. వాళ్లు దేవుని సేవకుల్ని ఒక గుంపుగా నాశనం చేయలేరు, ప్రకటనా పనిని కూడా ఆపలేరు. (యెష. 54:17; యిర్మీ. 1:19) ఇంతకీ అపొస్తలుడైన పౌలు సంగతేంటి? వ్యతిరేకత వచ్చినా పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇచ్చేలా ఆయనకు ప్రోత్సాహం దొరికిందా? దొరికితే, ఎలా దొరికింది? అప్పుడు ఆయన ఏం చేశాడు?

“కుట్ర” భగ్నమైపోయింది (అపొ. 23:11-34)

4, 5. పౌలుకు ఎలా ప్రోత్సాహం దొరికింది? అది సరిగ్గా అవసరమైన సమయంలోనే దొరికిందని ఎలా చెప్పవచ్చు?

4 మహాసభ నుండి బయటపడిన అదేరోజు రాత్రి, పౌలుకు కావాల్సిన ప్రోత్సాహం దొరికింది. బైబిలు ఇలా చెప్తుంది: “ప్రభువు పౌలు పక్కన నిలబడి, ‘ధైర్యంగా ఉండు! నువ్వు నా గురించి యెరూషలేములో పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చినట్టే రోములో కూడా సాక్ష్యమివ్వాలి’ అని చెప్పాడు.” (అపొ. 23:11) నిజంగా, యేసు మాటలు పౌలును ఎంతో ప్రోత్సహించి ఉంటాయి. ఎందుకంటే తాను ప్రాణాలతో బయటపడి రోముకు చేరుకుంటాడని, అక్కడ కూడా యేసు గురించి సాక్ష్యం ఇస్తాడని పౌలుకు అర్థమైంది.

“40 కన్నా ఎక్కువమంది పౌలు కోసం మాటువేసి ఉన్నారు.”—అపొస్తలుల కార్యాలు 23:21

5 పౌలుకు సరిగ్గా అవసరమైన సమయానికే ప్రోత్సాహం అందింది. ఆ తర్వాతి రోజే, 40 కన్నా ఎక్కువమంది “పౌలు మీద కుట్రపన్నారు. అతన్ని చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు.” పౌలును చంపాలని వాళ్లు ఎంత కసితో ఉన్నారో కదా! ఒకవేళ వాళ్లు అనుకున్నట్టు జరగకపోతే తమ మీదికి శాపం వస్తుందని, అంటే చెడు జరుగుతుందని అనుకున్నారు. (అపొ. 23:12-15) పౌలును పూర్తిస్థాయిలో విచారణ చేయడం కోసం అన్నట్టుగా మహాసభకు రప్పించి, దారిలోనే ఆయన్ని చంపేయాలి అన్నది వాళ్ల పథకం. దాన్ని అమలు చేయడానికి వాళ్లు ముఖ్య యాజకుల, పెద్దల మద్దతు కూడా తీసుకున్నారు.

6. కుట్ర గురించి పౌలుకు ఎలా తెలిసింది? పౌలు మేనల్లుడి నుండి యౌవనులు ఏం నేర్చుకోవచ్చు?

6 అయితే పౌలు మేనల్లుడికి ఆ కుట్ర గురించి తెలిసినప్పుడు, అతను వెళ్లి పౌలుకు చెప్పాడు. అప్పుడు, పౌలు ఆ విషయాన్ని రోమా సహస్రాధిపతి అయిన క్లౌదియ లూసియకు చెప్పమన్నాడు. (అపొ. 23:16-22) పౌలు మేనల్లుడి పేరు మనకు తెలీదు. కానీ ఆ అబ్బాయి తన ప్రాణాలకు తెగించి పౌలును కాపాడడానికి ధైర్యంగా ముందడుగు వేశాడు. అదేవిధంగా, నేడు మన యౌవనులు దేవుని ప్రజల్ని కాపాడడానికి తమ ప్రాణాల్ని అడ్డేస్తున్నారు, రాజ్యపనిలో నమ్మకంగా చేయగలిగినదంతా చేస్తున్నారు. నిజంగా, అలాంటి యౌవనులంటే యెహోవాకు ఎంతో ఇష్టం.

7, 8. పౌలును సురక్షితంగా పంపించడానికి క్లౌదియ లూసియ ఏ ఏర్పాట్లు చేశాడు?

7 పౌలు మీద కుట్ర పన్నుతున్నారని తెలియగానే, క్లౌదియ లూసియ రాత్రికిరాత్రే పౌలును యెరూషలేము నుండి కైసరయకు పంపించేశాడు. అతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు. కాబట్టి సైనికుల్ని, ఈటెలు పట్టుకున్న సైనికుల్ని, అలాగే గుర్రపు రౌతుల్ని మొత్తం కలిపి 470 మందిని పౌలుకు బందోబస్తుగా పంపించాడు. అక్కడికి చేరుకున్న తర్వాత పౌలును అధిపతైన ఫేలిక్సుకు అప్పగించమని చెప్పాడు. a కైసరయ, యూదయకు రోమా పరిపాలనా కేంద్రంగా ఉండేది. ఇక్కడ యూదులు చాలామందే ఉన్నా, వాళ్లకన్నా ఎక్కువగా అన్యజనులు ఉండేవాళ్లు. యెరూషలేములోనైతే చాలామంది మత విద్వేషాలతో రగిలిపోతూ అలజడులు సృష్టించేవాళ్లు, కానీ ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. అంతేకాదు కైసరయ, యూదయలోని రోమా సైన్యానికి ప్రధాన కార్యాలయంగా ఉండేది.

8 లూసియ రోమా చట్టాన్ని పాటిస్తూ, అసలు ఏం జరిగిందో వివరించడానికి ఫేలిక్సుకు ఒక ఉత్తరం రాశాడు. పౌలు రోమా పౌరుడని తెలిసిన వెంటనే యూదుల చేతిలో చనిపోకుండా ఆయన్ని కాపాడానని లూసియ ఆ ఉత్తరంలో చెప్పాడు. “మరణశిక్ష విధించడానికి గానీ, చెరసాలలో వేయడానికి గానీ” పౌలులో ఏ తప్పూ కనిపించలేదని, ఆయన్ని చంపడానికి కుట్ర జరుగుతుంది కాబట్టే ఆయన్ని పంపిస్తున్నానని, పౌలును నిందిస్తున్నవాళ్ల వాదన విని ఫేలిక్సు తీర్పు ఇవ్వాలని లూసియ అన్నాడు.—అపొ. 23:25-30.

9. (ఎ) రోమా పౌరుడిగా పౌలుకున్న హక్కుల్ని లూసియ ఎలా కాలరాశాడు? (బి) మనం కూడా పౌర హక్కుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు?

9 లూసియ ఉత్తరంలో రాసినవన్నీ నిజాలేనా? పూర్తిగా కాదు. అతను అధిపతి దగ్గర మంచిపేరు కొట్టేయడానికే అలా రాసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, లూసియ పౌలును కాపాడింది ఆయన రోమా పౌరుడని తెలిశాక కాదు. పైగా, పౌలును “రెండు సంకెళ్లతో బంధించమని” చెప్పినట్టు గానీ, ఆ తర్వాత “కొరడాలతో కొట్టి విచారణ చేయాలని” ఆజ్ఞాపించినట్టు గానీ లూసియ ఉత్తరంలో రాయలేదు. (అపొ. 21:30-34; 22:24-29) అలా రోమా పౌరుడిగా పౌలుకున్న హక్కుల్ని లూసియ కాలరాశాడు. ఇప్పుడు కూడా, సాతాను మతపిచ్చి ఉన్నవాళ్లను పావుగా వాడి మనల్ని హింసించవచ్చు. అలాగే చట్టం మనకు ఆరాధించే స్వేచ్ఛను ఇచ్చినా, శత్రువులు మన స్వేచ్ఛకు అడ్డుపడవచ్చు. అలాంటప్పుడు పౌలులాగే మనం కూడా, మన హక్కుల్ని ఉపయోగించుకుని చట్టాన్ని ఆశ్రయించవచ్చు.

“నేను సంతోషంగా నా వాదన నీకు వినిపిస్తాను” (అపొ. 23:35–24:21)

10. పౌలు మీద ఎలాంటి పెద్దపెద్ద ఆరోపణలు చేశారు?

10 పౌలు మీద ఆరోపణలు చేసేవాళ్లు యెరూషలేము నుండి రావాలి కాబట్టి, అప్పటివరకు పౌలును కైసరయలోని “హేరోదు రాజభవనంలో కాపలావాళ్ల సంరక్షణలో” ఉంచారు. (అపొ. 23:35) ఐదు రోజుల తర్వాత ప్రధానయాజకుడైన అననీయ, తెర్తుల్లు అనే న్యాయవాది, కొంతమంది పెద్దలు పౌలు మీద ఆరోపణలు చేయడానికి వచ్చారు. తెర్తుల్లు ముందుగా ఫేలిక్సు యూదుల కోసం చేసినవాటిని పొగిడాడు. బహుశా అలా పొగడ్తలతో ముంచెత్తి, అధిపతి దృష్టిలో పడాలన్నది అతని తాపత్రయం. b తర్వాత, అసలు విషయానికి వచ్చాడు. అతను పౌలు గురించి ఇలా అన్నాడు: “ఈ మనిషి ఒక చీడపురుగని, భూమ్మీదున్న యూదులందరి మధ్య తిరుగుబాట్లు లేవదీస్తున్నాడని మేము గమనించాం. ఇతను నజరేయులు అనే తెగకు నాయకుడు. అంతేకాదు ఇతను ఆలయాన్ని అపవిత్రం చేయడానికి కూడా ప్రయత్నించాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాం.” అప్పుడు మిగతా యూదులు కూడా, “ఆ మాటలు నిజమని పదేపదే చెప్తూ పౌలును నిందించడం మొదలుపెట్టారు.” (అపొ. 24:5, 6, 9) వాళ్ల ఆరోపణలు ఏంటంటే: పౌలు తిరుగుబాట్లు లేవదీశాడు, భయంకరమైన తెగకు నాయకుడు, ఆలయాన్ని అపవిత్రం చేశాడు. ఈ ఆరోపణలు ఎంత పెద్దవంటే, అవి నిజమని తేలితే గనుక మరణశిక్ష పడడం ఖాయం.

11, 12. తనమీద చేసిన ఆరోపణలు తప్పని పౌలు ఎలా నిరూపించాడు?

11 పౌలును మాట్లాడమన్నప్పుడు, “నేను సంతోషంగా నా వాదన నీకు వినిపిస్తాను” అని ఆయన మొదలుపెట్టాడు. ఆయన తనమీద చేసిన ఆరోపణల్లో దేన్నీ ఒప్పుకోలేదు. పౌలు ఆలయాన్ని అపవిత్రం చేయలేదు, తిరుగుబాట్లను లేవదీయలేదు. నిజానికి తాను ‘చాలా సంవత్సరాలుగా’ యెరూషలేములో లేనని, “దానధర్మాలు” అందజేయడానికి వచ్చానని చెప్పాడు. అవును కరువు వల్ల, హింస వల్ల పేదవాళ్లయిన కొంతమంది క్రైస్తవులకు విరాళాలు ఇవ్వడానికే ఆయన వచ్చాడు. అంతేకాదు, ఆలయంలో అడుగుపెట్టే ముందు ‘ఆచారబద్ధంగా శుద్ధి చేసుకున్నానని,’ “దేవుని ముందు, మనుషుల ముందు మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి” కృషి చేశానని చెప్పాడు.—అపొ. 24:10-13, 16-18.

12 పౌలు ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకున్నాడు. అదేంటంటే, “వీళ్లు తెగ అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ మార్గంలో నడుస్తూ” తన పూర్వీకుల దేవునికి పవిత్రసేవ చేస్తున్నానని చెప్పాడు. అయితే “ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటన్నిటినీ” నమ్ముతానని ఆయన అన్నాడు. అంతేకాదు, తనను నిందిస్తున్నవాళ్ల లాగే తనకు కూడా “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే” నమ్మకం ఉందని చెప్పాడు. తర్వాత, పౌలు తనను నిందిస్తున్నవాళ్లకు ఈ సవాలు విసిరాడు: “ఇక్కడున్న వాళ్లయినా సరే, నేను మహాసభ ముందు నిలబడి ఉన్నప్పుడు నాలో ఏ తప్పు కనిపించిందో చెప్పొచ్చు. నేను వాళ్ల మధ్య నిలబడి ఉన్నప్పుడు, ‘నేను చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారనే బోధను నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది’ అని బిగ్గరగా అన్నాను. అది కాకుండా నేను ఏ తప్పయినా చేసుంటే వాళ్లు చెప్పొచ్చు!”—అపొ. 24:14, 15, 20, 21.

13-15. అధికారుల ముందు ధైర్యంగా సాక్ష్యమిచ్చే విషయంలో పౌలు ఎలా మంచి ఆదర్శం ఉంచాడు?

13 పౌలులాగే మనల్ని కూడా అధికారుల ముందు నిలబెట్టవచ్చు. మనం గొడవలు రేపుతామని, దేశద్రోహులమని, మనది ఒక భయంకరమైన తెగ అని లేనిపోని ఆరోపణలు అంటగట్టవచ్చు. అలాంటప్పుడు మనం పౌలును ఆదర్శంగా తీసుకోవచ్చు. తెర్తుల్లు లాగా పౌలు అధిపతి దృష్టిలో పడాలని అతన్ని పొగడ్తలతో ముంచెత్తలేదు. పౌలు ప్రశాంతంగా, గౌరవంగా మెలిగాడు. విషయాల్ని నేర్పుగా, ఉన్నదున్నట్టు స్పష్టంగా చెప్పాడు. పౌలు ఆలయాన్ని అపవిత్రం చేశాడని ఆరోపించింది, ‘ఆసియా ప్రాంతపు యూదులు.’ వాళ్లు ఇక్కడ లేరు కాబట్టి, ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్లు అధిపతి ముందుకొచ్చి చెప్పాలని పౌలు అన్నాడు.—అపొ. 24:18, 19.

14 పౌలు నుండి నేర్చుకునే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన తన నమ్మకాల్ని చెప్పడానికి భయపడలేదు. ఆయన చాలా ధైర్యంగా పునరుత్థానం గురించి మళ్లీ చెప్పాడు. అసలు ఇంతకుముందు మహాసభలో గొడవ రేగిందే ఆ విషయం మీద. (అపొ. 23:6-10) అయినా, పౌలు తన వాదనలో పునరుత్థానం గురించి మళ్లీమళ్లీ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే, పౌలు యేసు గురించి, ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యమిస్తున్నాడు. వ్యతిరేకులు ఆ బోధను నమ్మరు. (అపొ. 26:6-8, 22, 23) అసలు ఈ గొడవంతా పౌలు పునరుత్థానాన్ని, అది కూడా యేసు పునరుత్థానాన్ని నమ్ముతున్నందుకే.

15 పౌలులాగే మనం కూడా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వవచ్చు, అలాగే యేసు తన అపొస్తలులతో అన్న ఈ మాటల నుండి బలం తెచ్చుకోవచ్చు: “మీరు నా శిష్యులుగా ఉన్నందుకు అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు.” ఆ సమయంలో ఏం మాట్లాడాలా అని మనం కంగారుపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే, యేసు ఈ భరోసా ఇచ్చాడు: “వాళ్లు మిమ్మల్ని అప్పగించడానికి తీసుకెళ్తున్నప్పుడు, ఏమి మాట్లాడాలా అని ముందే ఆందోళన పడకండి; ఆ సమయంలో మీకు ఏమి అనుగ్రహించబడితే అదే మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు పవిత్రశక్తి.”—మార్కు 13:9-13.

‘ఫేలిక్సు భయపడిపోయాడు’ (అపొ. 24:22-27)

16, 17. (ఎ) పౌలును విచారణ చేస్తున్నప్పుడు ఫేలిక్సు ఏం అన్నాడు? (బి) ఫేలిక్సు ఎందుకు భయపడి ఉంటాడు? అయినా పౌలును ఎందుకు మళ్లీమళ్లీ పిలిపించుకున్నాడు?

16 అధిపతైన ఫేలిక్సు క్రైస్తవుల నమ్మకాల గురించి వినడం ఇదేం మొదటిసారి కాదు. బైబిలు ఇలా చెప్తుంది: “ప్రభువు మార్గం [తొలి క్రైస్తవత్వాన్ని వర్ణించడానికి వాడిన పదం] గురించిన వాస్తవాలు బాగా తెలిసిన ఫేలిక్సు తీర్పు వాయిదా వేస్తూ, ‘సహస్రాధిపతి లూసియ రాగానే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అన్నాడు. తర్వాత, పౌలును కాపలాలో ఉంచమని, అయితే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వమని, అతనివాళ్లు ఎవరైనా అతని అవసరాలు చూసుకోవాలనుకుంటే అనుమతించమని సైనికాధికారికి ఆదేశాలు ఇచ్చాడు.”—అపొ. 24:22, 23.

17 కొన్ని రోజుల తర్వాత, ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో కలిసి వచ్చాడు. ఆమె యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించుకొని, “క్రీస్తుయేసు మీద విశ్వాసం గురించి పౌలు మాట్లాడుతుంటే విన్నాడు.” (అపొ. 24:24) ఎప్పుడైతే పౌలు “నీతి గురించి, ఆత్మనిగ్రహం గురించి, రాబోయే తీర్పు గురించి” మాట్లాడాడో, అప్పుడు ఫేలిక్సు భయపడిపోయాడు. బహుశా, చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి అతని మనస్సాక్షి గద్దించి ఉండవచ్చు. అందుకే, “ఇప్పటికైతే వెళ్లు, నాకు అవకాశం దొరికినప్పుడు నిన్ను మళ్లీ పిలిపిస్తాను” అని పౌలును పంపించేశాడు. ఆ తర్వాత కూడా ఫేలిక్సు పౌలును పిలిపించుకొని చాలాసార్లు మాట్లాడాడు. ఆయన చెప్పే విషయాలు వినడానికి కాదుగానీ, లంచం ఇస్తాడేమో అన్న ఆశతో అలా చేశాడు.—అపొ. 24:25, 26.

18. పౌలు “నీతి గురించి, ఆత్మనిగ్రహం గురించి, రాబోయే తీర్పు గురించి” ఫేలిక్సుతో, అతని భార్యతో ఎందుకు మాట్లాడాడు?

18 పౌలు ఫేలిక్సుతో, అతని భార్యతో “నీతి గురించి, ఆత్మనిగ్రహం గురించి, రాబోయే తీర్పు గురించి” ఎందుకు మాట్లాడాడు? “క్రీస్తుయేసు మీద విశ్వాసం గురించి” వాళ్లే పౌలును చెప్పమన్నారు. పౌలుకు వాళ్ల తప్పుడు జీవితం, దారుణాలు, అన్యాయాలు తెలుసు కాబట్టి యేసు శిష్యులు అవ్వాలనుకునే ప్రతీఒక్కరు ఏం చేయాలో స్పష్టంగా చెప్పాడు. ఫేలిక్సు, అతని భార్య దేవుని నీతి ప్రమాణాలకు తగ్గట్టు ఏమాత్రం నడుచుకోవట్లేదని పౌలు మాటల్లో తెలుస్తుంది. మనుషులందరూ తమ ఆలోచనలు, మాటలు, పనుల విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పాలని; ఫేలిక్సు పౌలుకు ఇవ్వబోయే తీర్పు కన్నా, దేవుడు వాళ్లకు ఇచ్చే తీర్పే ఎంతో ముఖ్యమని ఇప్పటికైనా వాళ్లకు అర్థమై ఉండాలి. ఫేలిక్సు ‘భయపడడంలో’ ఆశ్చర్యమేమీ లేదు!

19, 20. (ఎ) ప్రజలకు సత్యం మీద ఆసక్తి ఉన్నట్టు కనిపించినా, వాళ్ల ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడకపోతే మనం ఏం చేయాలి? (బి) ఫేలిక్సు, పౌలు మేలు కోరే వ్యక్తి కాదని ఎలా చెప్పవచ్చు?

19 పరిచర్యలో మనకు ఫేలిక్సు లాంటివాళ్లు తగలొచ్చు. ముందు వాళ్లకు సత్యం మీద ఆసక్తి ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ దేవునికి లోబడడం, జీవితంలో మార్పులు చేసుకోవడం వాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ, పౌలులాగే మనం కూడా దేవుని నీతి ప్రమాణాల గురించి నేర్పుగా వాళ్లకు చెప్పవచ్చు. ఎందుకంటే, సత్యం వాళ్ల హృదయాల్ని కదిలించే అవకాశం ఉంది. కానీ ఒకవేళ మార్పులు చేసుకునే ఉద్దేశం వాళ్లకు లేదని అనిపిస్తే, మనం వాళ్లను వదిలేసి, సత్యాన్ని తెలుసుకోవాలని నిజంగా పరితపించే వాళ్ల కోసం వెతుకుతాం.

20 ఫేలిక్సు విషయమే తీసుకోండి. అతని హృదయంలో నిజంగా ఏముందో ఈ మాటల్ని బట్టి తెలుస్తుంది: “రెండు సంవత్సరాలు గడిచాక ఫేలిక్సు స్థానంలోకి పోర్కియు ఫేస్తు వచ్చాడు. అయితే ఫేలిక్సు యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో పౌలును చెరసాలలోనే ఉంచి వెళ్లిపోయాడు.” (అపొ. 24:27) ఫేలిక్సు, పౌలు మేలు కోరే వ్యక్తి కాదు. ‘ప్రభువు మార్గంలో’ నడిచేవాళ్లు, దేశద్రోహులో తిరుగుబాటుదారులో కాదని ఫేలిక్సుకు తెలుసు. (అపొ. 19:23) అలాగే, పౌలు ఏ రోమా చట్టాన్నీ మీరలేదని కూడా అతనికి తెలుసు. అయినా ఫేలిక్సు, “యూదుల దగ్గర మంచిపేరు” సంపాదించుకోవడం కోసం పౌలును చెరసాలలో ఉంచేశాడు.

21. ఫేస్తు అధిపతిగా వచ్చిన తర్వాత పౌలుకు ఏం జరిగింది? ఏ మాటలు పౌలును బలపర్చి ఉంటాయి?

21 అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయం చివరి వచనం చెప్తున్నట్టుగా, ఫేలిక్సు స్థానంలో పోర్కియు ఫేస్తు వచ్చినప్పుడు కూడా పౌలు బందీగానే ఉన్నాడు. అప్పటినుండి, పౌలు ఒక అధికారి తర్వాత ఇంకో అధికారి ముందు తన వాదన వినిపిస్తూనే ఉన్నాడు. నిజంగా, ధైర్యవంతుడైన పౌలును “రాజుల ముందుకు, అధిపతుల ముందుకు” తీసుకెళ్లారు. (లూకా 21:12) తర్వాత్తర్వాత, ఆయన ఏకంగా చక్రవర్తికే సాక్ష్యమిస్తాడు. ఇంత జరిగినా, పౌలు విశ్వాసం రవ్వంత కూడా తగ్గలేదు. “ధైర్యంగా ఉండు!” అని యేసు చెప్పిన మాటలు, అడుగడుగునా పౌలును బలపర్చి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.

a యూదయకు అధిపతైన ఫేలిక్సు” అనే బాక్సు చూడండి.

b ఫేలిక్సు దేశానికి “ఎంతో శాంతిని” తెచ్చాడని తెర్తుల్లు పొగిడాడు. కానీ అది అబద్ధం. రోము మీద తిరుగుబాటు జరిగే సమయం వరకు చూసుకుంటే, వేరే ఏ అధిపతి కన్నా, ఫేలిక్సు పాలనలోనే యూదయలో ఎక్కువ హింస చెలరేగి శాంతి లేకుండా పోయింది. అంతేకాదు, ఎన్నో సంస్కరణలు తెచ్చినందుకు యూదులు ఫేలిక్సు మీద “ఎంతో కృతజ్ఞతా భావంతో” ఉన్నారని తెర్తుల్లు చెప్పాడు. నిజం ఏంటంటే, అతను యూదుల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తూ వాళ్ల తిరుగుబాట్లను క్రూరంగా అణగదొక్కేవాడు కాబట్టి, యూదులకు అతనంటే కంపరం.—అపొ. 24: 2, 3.