కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 52

యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు

యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు

సిరియా రాజైన బెన్హదదు ఇశ్రాయేలు దేశంపై దాడి చేస్తూ ఉన్నాడు. కానీ ప్రతీసారి ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు దాడి గురించి ముందే చెప్పడం వల్ల అతను తప్పించుకుంటూ ఉన్నాడు. అందుకని బెన్హదదు ఎలీషాను పట్టుకుని బంధించాలనుకున్నాడు. ఎలీషా దోతాను నగరంలో ఉన్నాడని తెలుసుకుని, అతన్ని పట్టుకోవడానికి సిరియా సైన్యాన్ని అక్కడికి పంపిస్తాడు.

సిరియన్లు దోతానుకు రాత్రిపూట వచ్చారు. తర్వాత రోజు ఉదయం, ఎలీషా సేవకుడు బయటికి వెళ్లినప్పుడు నగరం చుట్టూ పెద్ద సైన్యాన్ని చూశాడు. భయపడిపోయి ఇలా అరిచాడు: ‘ఎలీషా, మనం ఇప్పుడు ఏం చేయాలి?’ ఎలీషా ఇలా అన్నాడు: ‘వాళ్ల దగ్గర కన్నా మన దగ్గరే ఎక్కువమంది ఉన్నారు.’ అప్పుడు ఎలీషా సేవకుడు నగరం చుట్టూ కొండలపై ఉన్న గుర్రాలు, అగ్ని యుద్ధ రథాలు చూసేలా యెహోవా చేశాడు.

ఎలీషాను పట్టుకోవడానికి సిరియా సైనికులు వచ్చినప్పుడు అతను ఇలా ప్రార్థించాడు: ‘యెహోవా ప్లీజ్‌, వీళ్లందరూ గుడ్డివాళ్లు అయిపోయేలా చెయ్యి.’ అప్పుడు, ఆ సైనికులకు అన్నీ కనిపించినా వాళ్లు ఎక్కడున్నారో చెప్పలేకపోయారు. ఎలీషా ఆ సైనికులతో ఇలా అన్నాడు: ‘మీరు వేరే నగరానికి వచ్చారు. నా వెంట రండి, మీరు వెతుకుతున్న అతని దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను.’ వాళ్లు ఇశ్రాయేలు రాజు ఉన్న షోమ్రోను వరకు ఎలీషా వెంట వెళ్లారు.

చివరికి, వాళ్లు ఎక్కడున్నారో సిరియన్లు గుర్తుపట్టారు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇశ్రాయేలు రాజు ఎలీషాను ఇలా అడిగాడు: ‘నేను వీళ్లను చంపేయనా?’ ఈ అవకాశం ఉపయోగించుకుని ఎలీషా తనను బాధపెట్టాలనుకున్న వాళ్ల మీద పగ తీర్చుకున్నాడా? లేదు. ఎలీషా ఇలా అన్నాడు: ‘వాళ్లను చంపవద్దు. భోజనం పెట్టి, వాళ్ల దారిన వాళ్లను పంపించు.’ అప్పుడు రాజు పెద్ద విందు ఏర్పాటు చేసి, వాళ్లను ఇంటికి పంపిస్తాడు.

“మనకున్న నమ్మకం ఏమిటంటే, దేవుని ఇష్టానికి తగ్గట్టు ప్రార్థనలో మనం ఏమి అడిగినా ఆయన వింటాడు.”—1 యోహాను 5:14