కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ భాగం

ఒకరికొకరు నమ్మకంగా ఉండండి

ఒకరికొకరు నమ్మకంగా ఉండండి

“దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” —మార్కు 10:9

‘విశ్వసనీయతకు’ విలువివ్వాలని యెహోవా కోరుతున్నాడు. (మీకా 6:8, NW) ఆలుమగల మధ్య ఆ లక్షణం చాలాచాలా అవసరం. ఎందుకంటే విశ్వసనీయత లేని చోట నమ్మకం ఉండదు. ప్రేమ పెరగాలంటే నమ్మకం కీలకం.

నేడు, భార్యాభర్తల బంధంలో విశ్వసనీయత కనుమరుగౌతోంది. మీ బంధం బీటలువారకుండా ఉండాలంటే మీరు రెండు పనులు చేయాలని తీర్మానించుకోవాలి.

1 మీ వైవాహిక బంధానికి ముఖ్య స్థానం ఇవ్వండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘మీరు శ్రేష్ఠమైన కార్యములను [“మరింత ప్రాముఖ్యమైనవాటిని, NW”] వివేచించండి.’ (ఫిలిప్పీయులు 1:9, 10) మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి మీ వైవాహిక బంధం. దానికి ముఖ్య స్థానం ఇవ్వాలి.

మీ జీవిత భాగస్వామి మీద శ్రద్ధ చూపిస్తూ మీరిద్దరూ సంతోషంగా జీవించాలని యెహోవా కోరుతున్నాడు. (ప్రసంగి 9:9) మీ భాగస్వామిని అస్సలు అశ్రద్ధ చేయకూడదని, ఒకరినొకరు సంతోషపెట్టుకోవడానికి అవకాశాల కోసం ఇద్దరూ చూడాలని ఆయన స్పష్టం చేస్తున్నాడు. (1 కొరింథీయులు 10:24) మీ భాగస్వామి ఎంతో కావాల్సిన వ్యక్తి అని, తనను మీరు ప్రశంసిస్తున్నారని తనకు అర్థమయ్యేలా ప్రవర్తించండి.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీరిద్దరు కలిసి తరచూ సమయం గడిపేలా చూసుకోండి. ఆ సమయాన్ని పూర్తిగా మీ భాగస్వామికే ఇవ్వండి

  • “నేను,” “నా” అని కాకుండా “మేము,” “మా” అన్నట్టు ఆలోచించండి

2 మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు.” (మత్తయి 5:28, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఓ వ్యక్తి చెడు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆయన తన భార్యకు నమ్మకంగా లేనట్టే లెక్క.

మీరు ‘మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి’ అని యెహోవా చెబుతున్నాడు. (సామెతలు 4:23; యిర్మీయా 17:9) అలా చేయాలంటే మీరు మీ కంటిని కాచుకోవాలి. (మత్తయి 5:29, 30) ఈ విషయంలో ప్రాచీనకాల యోబును ఆదర్శంగా తీసుకోండి. చెడు కోరికతో పరాయి స్త్రీని చూడకూడదని ఆయన తన కళ్లతో ఒప్పందం చేసుకున్నాడు. (యోబు 31:1) అశ్లీల చిత్రాలను చూడకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. పరాయి వ్యక్తితో ప్రేమకలాపాలు అస్సలు సాగించకూడదని తీర్మానించుకోండి.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీరు మీ జీవిత భాగస్వామికే కట్టుబడి ఉన్నారని ఇతరులకు స్పష్టంగా తెలియనివ్వండి

  • మీ భాగస్వామి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోండి. తనను ఇబ్బందిపెట్టే ఎలాంటి సంబంధాన్నైనా వెంటనే తెగతెంపులు చేసుకోండి