కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా?

ప్రార్థన—మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి?

ప్రార్థన—మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి?

మీరు ఏదైనా చేసే ముందు “ఇది చేస్తే నాకు ఏం లాభం?” అని అనుకోవడం సహజమే. అయితే, ప్రార్థన విషయంలో ఈ ప్రశ్న వేసుకుంటే మనకు స్వార్థం ఉన్నట్లా? కాదు. ప్రార్థన చేయడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా జరగదా అని సహజంగానే మనకు తెలుసుకోవాలని ఉంటుంది. పూర్వ కాలంలో జీవించిన ఒక మంచి మనిషి యోబుకు కూడా దేవుడు మన మాట ఆలకిస్తాడా అనే ప్రశ్న వచ్చింది.—యోబు 9:16.

ప్రార్థన ఒక మతపరమైన ఆచారం లేదా ఒక విధమైన వైద్యం కాదు అని మనం ముందు పేజీల్లో చూశాం. నిజమైన దేవుడు నిజంగా ప్రార్థనలు వింటాడు. మనం సరైన విధంగా, సరైనవాటి కోసం ప్రార్థిస్తే ఆయన వింటాడు. మనం ఆయనకు దగ్గరవ్వాలి అని ఎంతో కోరుతున్నాడు. (యాకోబు 4:8) మనం రోజూ ప్రార్థన చేయడం మొదలుపెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

మనశ్శాంతి.

మీ జీవితంలో సమస్యలు, సవాళ్లు వచ్చినప్పుడు చింతలో మునిగిపోయినట్లు మీకనిపిస్తుందా? అలాంటి సమయాల్లో “యెడతెగక ప్రార్థనచేయుడి,” “మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:15; ఫిలిప్పీయులు 4:6) మనం ప్రార్థన ద్వారా దేవుని వైపు చూసినప్పుడు “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ... మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అనే హామీ కూడా బైబిల్లో ఉంది. (ఫిలిప్పీయులు 4:7) మన పరలోక తండ్రికి మనసులో ఉన్నవన్నీ చెప్పినప్పుడు మనం ప్రశాంతతను అనుభవిస్తాం. అలా చెప్పమని ఆయనే మనల్ని అడుగుతున్నాడు. “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును” అని కీర్తన 55:22⁠లో ఉంది.

“నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.”—కీర్తన 55:22.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇలాంటి ప్రశాంతతను అనుభవించారు. దక్షిణ కొరియాకు చెందిన హీ రాన్‌ అనే ఆమె ఇలా అంటుంది: “నాకు చాలా పెద్ద సమస్యలున్నా, ఒక్కసారి వాటి గురించి ప్రార్థించినప్పుడు భారం తగ్గిపోయినట్లు, సహించడానికి శక్తి దొరికినట్లు అనిపిస్తుంది.” ఫిలిప్పీన్స్‌ దేశానికి చెందిన సెసీల్యా ఇలా చెప్తుంది: “తల్లిగా నా ఇద్దరు కూతుళ్ల గురించి, మా అమ్మ గురించి చాలా చింతిస్తాను. మా అమ్మ అనారోగ్యంవల్ల నన్ను ఇప్పుడు గుర్తుపట్టలేదు. కానీ ప్రార్థన వల్లే నేను ఎక్కువ బాధ పడకుండా రోజూ నా పనులు చేసుకోగలుగుతున్నాను. వాళ్లను చూసుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని నాకు తెలుసు.”

సమస్యల్లో ఓదార్పు, శక్తి.

మీరు చాలా ఒత్తిడిలో బహుశా ప్రాణాపాయ స్థితిలో లేదా విషాదకరమైన పరిస్థితిలో ఉన్నారా? “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు” దేవునికి ప్రార్థించడం మనకు ఎంతో ఊరటనిస్తుంది. దేవుడు “ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను” ఆదరిస్తాడు అని బైబిల్లో ఉంది. (2 కొరింథీయులు 1:3, 4) ఒక సమయంలో యేసు చాలా బాధతో ఉన్నప్పుడు మోకాళ్లూని ప్రార్థించాడు. అప్పుడు ఏం జరిగింది? “పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.” (లూకా 22:41-43) దేవునికి నమ్మకంగా ఉన్న నెహెమ్యాను దుర్మార్గులు బెదిరించి దేవుని పని చేయనివ్వకుండా ఆపేయాలనుకున్నారు. ఆయన ఇలా ప్రార్థించాడు: “నా చేతులను బలపరచుము.” ఆ తర్వాత జరిగినదాన్ని మనం చూస్తే ఆయన భయాలను అధిగమించి, ఆ పనిలో విజయవంతం అవ్వడానికి దేవుడు నిజంగా సహాయం చేశాడని తెలుస్తుంది. (నెహెమ్యా 6:9-16) ప్రార్థించినప్పుడు ఎలా అనిపిస్తుందో ఘానా దేశానికి చెందిన రెజనల్డ్‌ ఇలా వివరిస్తున్నాడు: “ముఖ్యంగా కష్టాలు తట్టుకోలేని పరిస్థితుల్లో నేను ప్రార్థించినప్పుడు, నాకు సహాయం చేసేవాళ్లకి, నాకేం కాదని ధైర్యం చెప్పేవాళ్లకి నా సమస్యను చెప్పుకున్నట్లు అనిపిస్తుంది.” నిజమే, దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఓదారుస్తాడు.

దేవుడు ఇచ్చే జ్ఞానం.

మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనపై, మనం ప్రేమించే వాళ్లపై శాశ్వత ప్రభావం చూపిస్తాయి. మరి, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? బైబిలు ఇలా చెప్తుంది: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల [ముఖ్యంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు] అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకోబు 1:5) మనం జ్ఞానం కోసం ప్రార్థన చేస్తే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నడిపిస్తాడు. మనం పరిశుద్ధాత్మ కోసం ప్రత్యేకంగా అడగవచ్చు ఎందుకంటే “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” అని యేసు మనకు హామీనిస్తున్నాడు.—లూకా 11:13.

“సరైన నిర్ణయం తీసుకోవడానికి నడిపించమని నేను యెహోవాకు క్రమంగా ప్రార్థించాను.”—క్వాబెనా, ఘానా

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు యేసుకు కూడా తండ్రిని అడగడం అవసరం అనిపించింది. తనకు అపొస్తలులుగా 12 మందిని ఎంపిక చేసుకునేటప్పుడు యేసు దేవునికి “ప్రార్థించుటయందు రాత్రి గడిపెను” అని బైబిల్లో ఉంది.—లూకా 6:12.

యేసులానే నేడు కూడా చాలామంది మంచి నిర్ణయాలు తీసుకునేందుకు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన చేసిన సహాయం చూసి బలం పొందారు. ఫిలిప్పీన్స్‌ దేశంలో ఉంటున్న రేజీనాకు చాలా సమస్యలు వచ్చాయి. ఆమె భర్త చనిపోయాక కుటుంబాన్ని ఒంటరిగా చూసుకోవాల్సి వచ్చింది, ఆమె ఉద్యోగం పోయింది, పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా అనిపించింది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆమెకు ఏం సహాయం చేసింది? ఆమె ఇలా అంటుంది: “ప్రార్థన ద్వారా నేను యెహోవా ఇచ్చే సహాయంపై ఆధారపడుతున్నాను.” ఘానా దేశానికి చెందిన క్వాబెనా మంచి జీతం వచ్చే కన్‌స్ట్రక్షన్‌ ఉద్యోగం పోయినప్పుడు దేవుని సహాయం అడిగాడు. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమి చేశాడో ఇలా చెప్పాడు, “సరైన నిర్ణయం తీసుకోవడానికి నడిపించమని నేను యెహోవాకు క్రమంగా ప్రార్థించాను.” ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, “నా ఆధ్యాత్మిక, శారీరక అవసరాలు తీర్చగలిగే పనిని ఎంపిక చేసుకోవడానికి యెహోవా నాకు సహాయం చేశాడు అని బలంగా నమ్ముతున్నాను.” దేవునితో మీకున్న సంబంధంపై ప్రభావం చూపించే విషయాల గురించి ప్రార్థిస్తే మీరు కూడా జీవితంలో ఆయన నడిపింపును చవిచూస్తారు.

ప్రార్థన వల్ల మీకు వచ్చే ప్రయోజనాలను కొన్నే చూశాం. (ఇంకొన్ని ఉదాహరణల కోసం “ ప్రార్థన వల్ల ప్రయోజనాలు” అనే బాక్సు చూడండి.) కానీ మీరు ఈ ప్రయోజనాలు అనుభవించాలంటే, ముందుగా దేవుని గురించి, ఆయన చిత్తం గురించి తెలుసుకోవాలి. అందుకు యెహోవాసాక్షులను బైబిలు గురించి నేర్పించమని అడగండి. a ‘ప్రార్థన ఆలకించే’ దేవునికి దగ్గరవ్వడానికి మీరు వేయాల్సిన మొదటి అడుగు ఇదే.—కీర్తన 65:2. ▪ (w15-E 10/01)

a ఎక్కువ సమాచారం కోసం, మీకు దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షులతో మాట్లాడండి లేదా మా వెబ్‌సైట్‌ www.isa4310.com/te చూడండి.