ఆదాయం తగ్గినప్పుడు ఎలా నెట్టుకురావచ్చు?
ఆదాయం తగ్గినప్పుడు ఎలా నెట్టుకురావచ్చు?
ఓబెద్ ఇద్దరు పిల్లల తండ్రి. ఆయన ఆఫ్రికాలోని ఒక పెద్ద నగరంలో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్లో 10 సంవత్సరాలు పనిచేశాడు, అప్పుడు కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. అప్పుడప్పుడూ కుటుంబాన్ని తీసుకుని తన దేశంలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు వెళ్ళి చక్కగా ఆనందించగలిగేవాడు. ఆ హోటల్‌కు వచ్చే కస్టమర్లు తగ్గిపోవడంతో ఆయనను ఉద్యోగంలో నుండి తీసేశారు, దాంతో ఇలాంటివేవీ లేకుండా పోయాయి.
స్టీఫెన్ ఒక పెద్ద బ్యాంకులో 22కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆ ఉద్యోగం వల్ల ఆయనకు పెద్ద బంగళా, కారు, పనివాళ్ళు, పిల్లలకు మంచి పాఠశాలల్లో చదువు లాంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరాయి. బ్యాంకులో కొన్ని మార్పులు జరగడంతో ఆయన ఉద్యోగం పోయింది. “నేను, నా కుటుంబం సర్వనాశనమైపోయాం. నిరాశ, దుఃఖం, భయం నన్ను చుట్టుముట్టాయి” అని స్టీఫెన్ చెబుతున్నాడు.
ఇవి అరుదైన సంఘటనలేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతుండడం వల్ల మంచి ఉద్యోగాల్లో ఉన్న కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎన్నో తంటాలుపడి ఉద్యోగం సంపాదించుకోగలిగిన చాలామంది, తక్కువ జీతంతోనే సరిపెట్టుకుంటూ ఆకాశాన్నంటే ధరలతో సతమతమౌతున్నారు. అభివృద్ధి చెందినవి, చెందనివి అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం బారినపడుతున్నాయి.
ఆచరణాత్మకమైన జ్ఞానం అవసరం
మన ఆదాయం తగ్గిపోయినప్పుడు లేదా ఉద్యోగం పోయినప్పుడు ఇట్టే తీవ్ర నిరుత్సాహానికి గురవుతాం. ప్రతీ ఒక్కరికీ భవిష్యత్తు గురించి ఎంతో కొంత భయం ఉంటుందన్నది వాస్తవమే. అయితే జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” (సామెతలు 24:10) ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కంగారు పడిపోయే బదులు దేవుని వాక్యం చెబుతున్నట్లుగా, ‘ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి.’—సామెతలు 2:7, NW.
బైబిలు ఆర్థిక సలహాలున్న పుస్తకం కాకపోయినా అలాంటి విషయాలతో వ్యవహరించడంలో అది ఇస్తున్న ఆచరణాత్మకమైన ఉపదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రయోజనం పొందారు. బైబిలు ఇస్తున్న కొన్ని ప్రాథమిక సూత్రాలను పరిశీలిద్దాం.
ఖర్చు ఎంతవుతుందో లెక్కచూసుకోండి. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” అని లూకా 14:28 లో యేసు చెప్పిన మాటల గురించి ఆలోచించండి. ఆ సూత్రాన్ని పాటించాలంటే దేనికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో లెక్క చూసుకొని అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్తపడాలి. అయితే అదంత సులువు కాదని ఓబెద్ అంగీకరిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ఉద్యోగం కోల్పోకముందు, సూపర్‌మార్కెట్‌కి వెళ్ళినప్పుడల్లా అంతగా అవసరం లేకపోయినా ఎన్నో వస్తువులు కొనితెచ్చుకునేవాళ్ళం. అప్పట్లో, ఏది కావాలంటే అది కొనుక్కోగలిగే పరిస్థితి మాకుండేది కాబట్టి మేము ఖర్చు గురించి ఎన్నడూ ఆలోచించేవాళ్ళం కాదు.” ముందుగా ప్లాన్ చేసుకుంటే ఉన్న కాస్త డబ్బును కుటుంబానికి అవసరమైన వాటికే వెచ్చించగలుగుతాం.
మీ జీవన శైలిని మార్చుకోండి. ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేయకుండా సాదాసీదాగా జీవించడం చాలా కష్టం, కానీ తప్పదు. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని బైబిల్లోని ఒక సామెత చెబుతోంది. (సామెతలు 22:3) “డబ్బు ఆదా చేయడానికి మేము చిన్నగా ఉన్న, అంతగా సౌకర్యాలు లేని మా సొంత ఇంట్లోకి మారాం. పిల్లల్ని తక్కువ ఫీజులకే మంచి చదువు చెప్పే పాఠశాలల్లో చేర్పించాం” అని స్టీఫెన్ చెబుతున్నాడు.
మారిన జీవన శైలికి అలవాటు పడాలంటే కుటుంబంలో అందరూ ఒకరితో ఒకరు మనసువిప్పి మాట్లాడుకోవడం అవసరం. తొమ్మిది సంవత్సరాలపాటు ఒక బ్యాంకులో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఆస్టిన్ ఇలా చెబుతున్నాడు: “నేను, నా భార్య మాకు నిజంగా అవసరమైన వస్తువుల పట్టిక తయారుచేశాం. మేము ఖరీదైన ఆహార పదార్థాలు తినడం, సెలవులకు ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కువగా ఖర్చుపెట్టడం, అవసరం లేకపోయినా కొత్తబట్టలు కొనడం వంటివి తగ్గించేశాం. ఈ విషయాలన్నిటిలో నా భార్యాపిల్లలు సహకరించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.” అలాంటి మార్పులు ఎందుకు చేసుకోవాల్సి వస్తోందో చిన్న పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పవచ్చు.
ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఆఫీసు పనికి అలవాటు పడివుంటే వేరేపనులు చేయడం కష్టంగా ఉండవచ్చు. “ఒక పెద్ద సంస్థలో ఉన్నత స్థానంలో పనిచేయడానికి అలవాటు పడ్డాను కాబట్టి చిన్నచిన్న పనులు చేయడానికి నాకు మనసొప్పేది కాదు” అని ఆస్టిన్ చెబుతున్నాడు. “మనుషులకు భయపడడం మూలంగా మనుషులు ఉరిలో చిక్కుకుంటారు” అని బైబిలు చెబుతున్న దాని దృష్ట్యా ఆయన చెప్పిన దానిలో ఆశ్చర్యమేమీ లేదు. (సామెతలు 29:25, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే కడుపు నిండదు. అలాంటి ప్రతికూల ఆలోచనలను అధిగమించాలంటే మీరేమి చేయవచ్చు?
అణకువగా ఉండడం ప్రాముఖ్యం. ఓబెద్ హోటల్లో ఉద్యోగం పోగొట్టుకున్నాక, మునుపటి తోటి ఉద్యోగి ఒకాయన, వాహనాలు రిపేరు చేసే తన షాపులో ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం చేయాలంటే, వాహనాలకు వేసే పెయింట్లు, ఇతర వస్తువులు కొనుక్కొని రావడానికి మట్టి రోడ్లపై ఎంతో దూరం నడవాల్సివుంటుంది. ఓబెద్ ఇలా చెబుతున్నాడు: “నాకు వేరే దారి లేనట్లు అర్థమైంది. నా గత ఆదాయంతో పోలిస్తే దానిలో నాలుగోవంతు కూడా రాకపోయినా, నా కుటుంబ అవసరాలకు సరిపోయేంత వస్తున్నందుకు అణకువతో ఆ ఉద్యోగం చేయడానికి తగిన మార్పులు చేసుకోగలిగాను.” మీరు కూడా మీ దృక్కోణాన్ని మార్చుకోవడం ద్వారా అలాగే ప్రయోజనం పొందవచ్చు.
ఉన్నదానితో తృప్తిపడండి. ఉన్నదానితో తృప్తిపడే వ్యక్తి, పరిస్థితులు ఎలావున్నా సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు. ఆర్థికంగా ఎంతో చితికిపోయి ఉన్న వ్యక్తికి ఆ వర్ణన వాస్తవికంగా అనిపించకపోవచ్చు. అయితే, అపొస్తలుడైన పౌలు దీనస్థితి అంటే ఏమిటో తెలిసిన మిషనరీ. ఆయన మాటలను పరిశీలించండి: “నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును.”—ఫిలిప్పీయులు 4:11, 12.
మన పరిస్థితి ఇప్పుడు కాస్త బాగానే ఉండవచ్చు, కానీ మారుతున్న ఈ కాలాల్లో మన పరిస్థితి ఎంతో దిగజారిపోవచ్చు కూడా. “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. . . . కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని పౌలు దైవప్రేరణతో ఇచ్చిన ఉపదేశాన్ని పాటిస్తే మనం నిజంగా ప్రయోజనం పొందవచ్చు. ఇక్కడ పౌలు సోమరితనాన్ని ప్రోత్సహించడం లేదు గానీ, భౌతిక అవసరాలను వాటి స్థానంలో ఎలా ఉంచాలో చూపిస్తున్నాడు.—1 తిమోతి 6:6, 7.
నిజమైన సంతోషానికి మూలం
మనం కావాలనుకున్నవన్నీ సమకూర్చుకున్నంత మాత్రాన లేదా సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నంత మాత్రాన నిజమైన సంతోషం దొరకదు. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” ఉన్నంతలో ఇతరులకు ఇవ్వడం ద్వారా, ఇతరులకు ప్రోత్సాహం కలిగే విధంగా ఉండడం ద్వారా మనం సంతోషాన్ని, సంతృప్తిని పొందవచ్చు.—అపొస్తలుల కార్యములు 20:35.
మన సృష్టికర్తయైన యెహోవా దేవునికి మన అవసరాలన్నీ తెలుసు. ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు ఆచరణాత్మకమైన ఉపదేశం ఇచ్చాడు, దానివల్ల చాలామంది తమ జీవితాలను మెరుగుపర్చుకొని, అనవసరమైన చింతలను తప్పించుకోగలిగారు. అయితే ఆ ఉపదేశాన్ని పాటించినంత మాత్రాన ఒక వ్యక్తి ఉన్నట్టుండి ధనవంతుడైపోడు. కానీ ‘రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెదికేవాళ్ళకు’ రోజువారీ అవసరాలన్నీ తీరతాయని యేసు హామీ ఇస్తున్నాడు.—మత్తయి 6:33. (w12-E 06/01)