కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా?

దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా?

దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా?

2011 మార్చిలో జపానులో 9.0 తీవ్రతగల భూకంపం, సునామీ వచ్చినప్పుడు ఆ దేశపు ప్రముఖ రాజకీయవేత్త ఒకరు ఇలా అన్నారు: “బాధితులను చూసి నా కడుపు తరుక్కుపోతోంది. అయినా [అది] టెంబాట్సూ (దేవుడు వేసిన శిక్ష) అని నాకనిపిస్తోంది.”

2010 జనవరిలో, హయిటీలో వచ్చిన భూకంపం 2,20,000 కన్నా ఎక్కువమందిని పొట్టనబెట్టుకుంది. టీవీలో మతప్రచారం చేసే ఒక ప్రముఖ వ్యక్తి దాని గురించి మాట్లాడుతూ, “అపవాదితో చేతులు కలపడం” వల్లే వాళ్లకు అలా జరిగిందని, వాళ్లు “దేవుని దగ్గరకు రావాల్సిన” అవసరముందని అన్నాడు.

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో తొక్కిసలాట జరిగి 79 మంది మృత్యువాతపడినప్పుడు, ఒక క్యాథలిక్‌ మతగురువు ఇలా అన్నాడు: “మొద్దుబారిన, నిద్రపోతున్న మన మనస్సాక్షిని మేల్కొల్పాలని దేవుడు అనుకున్నాడు.” ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న “విరిగిపడే కొండచరియలు, పెనుతుఫానులు, మరితర విపత్తుల ద్వారా దేవుడు తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నాడనే విషయాన్ని ఇరవై ఒక్క శాతంమంది పెద్దవాళ్లు నమ్ముతున్నారు” అని అక్కడి వార్తాపత్రిక ఒకటి పేర్కొంది.

చెడ్డవాళ్లను శిక్షించడానికి దేవుడు విపత్తులు తీసుకువస్తాడనే నమ్మకం ఇప్పటిది కాదు. 1755లో పోర్చుగల్‌లోని లిస్బన్‌లో వచ్చిన భూకంపం, అగ్నిప్రమాదం, సునామీ దాదాపు 60,000 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు, ప్రఖ్యాత తత్త్వవేత్త వొల్టేర్‌ ఇలా అడిగాడు: “భోగవిలాసాల్లో మునిగితేలుతున్న ప్యారిస్‌లో కన్నా, లిస్బన్‌లో ఎక్కువ చెడు ఉందా?” దేవుడు ప్రకృతి విపత్తులతో ప్రజలను శిక్షిస్తున్నాడని లక్షలాదిమంది అనుకుంటున్నారు. చాలాదేశాల్లో, ప్రజలు అలాంటి విపత్తులను “దేవుని కార్యాలు” అంటారు.

దేవుడు నిజంగానే ప్రకృతి విపత్తులతో ప్రజలను శిక్షిస్తున్నాడా? ఇటీవలి కాలంలో ఏకధాటిగా సంభవించిన విపత్తులు అలాంటివేనా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి.

ప్రకృతి విపత్తుల ద్వారా దేవుడు చేసిన నాశనం గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతాలను చూపిస్తూ కొందరు విపత్తులకు కారణం దేవుడే అని చెబుతారు. (ఆదికాండము 7:17-22; 18:20; 19:24, 25; సంఖ్యాకాండము 16:31-35) ఈ వృత్తాంతాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, విపత్తు తీసుకువచ్చిన ప్రతీ సందర్భంలో మూడు ముఖ్యమైన విషయాలను గమనించవచ్చు. మొదటిది, విపత్తుకు ముందు హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. రెండవది, నేడు సంభవించే ప్రకృతి విపత్తుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు అనే తేడా లేకుండా అందరూ చనిపోతారు, కానీ దేవుడు నాశనం చేసినప్పుడు అలా జరగలేదు. ఎప్పటికీ మారని దుష్టులు, హెచ్చరికలను పెడచెవినపెట్టినవాళ్లు మాత్రమే నాశనమయ్యారు. మూడవది, మంచివాళ్లు తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు.—ఆదికాండము 7:1, 23; 19:15-17; సంఖ్యాకాండము 16:23-27.

నేడు లెక్కలేనన్ని ప్రకృతి విపత్తులు లక్షలాదిమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి, కానీ వాటికి కారణం దేవుడు అనడానికి ఎలాంటి ఆధారమూ లేదు. అలాంటి విపత్తులు రానురాను ఎందుకు ఎక్కువౌతున్నాయి? వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవచ్చు? ప్రకృతి విపత్తులు ఉండని రోజు ఎప్పటికైనా వస్తుందా? తర్వాతి ఆర్టికల్స్‌ వీటికి జవాబిస్తాయి. (w11-E 12/01)