కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం

మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం

మీకెవరైనా ఎప్పుడైనా ఒక రహస్యం చెప్పారా?— a నేను మీకో రహస్యం చెబుతాను. అదో పరిశుద్ధ రహస్యం. దీన్ని, ‘ఎన్నో సంవత్సరాల నుండి దాచబడిన ఒక రహస్యం’ అని బైబిలు అంటోంది. (ఏటవాలు ముద్దక్షరాలు మావి; రోమీయులు 16:25, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మొదట్లో దేవునికే ఆ పరిశుద్ధ ‘రహస్యం’ తెలుసు. ఆ రహస్యం అందరికీ తెలిసేలా దేవుడు ఎలా చేశాడో చూద్దాం.

ముందుగా, పరిశుద్ధం అంటే ఏమిటో మీకు తెలుసా?— పరిశుద్ధం అనే పదానికి పవిత్రమైన, పరిశుభ్రమైన లేదా చాలా ప్రత్యేకమైన అనే అర్థాలున్నాయి. ఆ రహస్యం పరిశుద్ధ దేవుని నుండి వచ్చింది కాబట్టి దాన్ని పరిశుద్ధ రహస్యమని అంటారు. ఈ ప్రత్యేకమైన రహస్యాన్ని ఎవరు తెలుసుకోవాలనుకున్నారు?— దేవదూతలు తెలుసుకోవాలనుకున్నారు. ‘దేవదూతలు దాని గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు’ అని బైబిలు చెబుతోంది. వాళ్లు ఆ పవిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్నారు.—1 పేతురు 1:12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యేసు ఈ భూమ్మీదకు వచ్చాక, ఆ పరిశుద్ధ రహస్యం గురించి మాట్లాడుతూ దాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, ‘దేవుని రాజ్యం గురించిన పరిశుద్ధ రహస్యం మీకు ఇవ్వబడింది. (మార్కు 4:11, NW) ఆ పరిశుద్ధ రహస్యం దేనికి సంబంధించినదో మీరు గమనించారా?— అది దేవుని రాజ్యానికి సంబంధించినది. యేసు దాని గురించే ప్రార్థించమని మనకు బోధించాడు.—మత్తయి 6:9, 10.

యేసు భూమ్మీదకు వచ్చి వివరించడం మొదలుపెట్టేంత వరకు, దేవుని రాజ్యం ‘ఎన్నో సంవత్సరాలు’ ఒక రహస్యంగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆదాము, హవ్వ దేవుని ఆజ్ఞ మీరి ఏదెను తోట నుండి వెళ్లగొట్టబడినా, ఈ భూమినంతా పరదైసుగా చేయాలన్న దేవుని సంకల్పం మాత్రం మారలేదని దేవుని సేవకులు తెలుసుకున్నారు. (ఆదికాండము 1:26-28; 2:8, 9; యెషయా 45:18) దేవుని రాజ్యంలో భూమ్మీద ప్రజలు పొందే సంతోషం గురించి వాళ్లు రాశారు.—కీర్తన 37:11, 29; యెషయా 11:6-9; 25:8; 33:24; 65:21-24.

దేవుని రాజ్యానికి రాజెవరో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడు ఎవరిని రాజుగా నియమించాడో మీకు తెలుసా?— ఆయన కుమారుణ్ణి, అంటే “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసుక్రీస్తును. ‘ఆయన భుజమ్మీద రాజ్యభారం ఉంటుంది’ అని బైబిలు చెబుతోంది. (యెషయా 9:6, 7) మనం ‘దేవుని పరిశుద్ధ రహస్యం గురించి, అంటే, క్రీస్తు గురించి తెలుసుకోవాలి.’ (కొలొస్సయులు 2:1, 2NW) దేవుడు తను సృష్టించిన మొదటి దేవదూత జీవాన్ని మరియ గర్భంలో ఉంచాడని మనం తెలుసుకోవాలి. మనం నిత్యజీవం పొందగలిగేలా, ఎంతో శక్తిగల దేవదూతగా ఉన్న ఆ కుమారుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి దేవుడు ఆయనను భూమ్మీదకు పంపించాడు.—మత్తయి 20:28; యోహాను 3:16; 17:3.

అయితే, మనం ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే, దేవుడు తన రాజ్యానికి రాజుగా యేసును నియమించాడనే దానికన్నా ఎక్కువే తెలుసుకోవాలి. పునరుత్థానం చేయబడిన యేసుతోపాటు వేరే స్త్రీపురుషులు కూడా పరలోకంలో పరిపాలన చేస్తారు. ఇది కూడా ఆ పరిశుద్ధ రహస్యంలో ఒక భాగమే!—ఎఫెసీయులు 1:8-12.

యేసుతోపాటు పరలోకంలో పరిపాలన చేసే వాళ్లలో కొంతమంది పేర్లను తెలుసుకుందాం. యేసు, ‘మీ కోసం స్థలం సిద్ధపర్చడానికి’ పరలోకానికి వెళ్తున్నానని తన నమ్మకమైన అపొస్తలులతో చెప్పాడు. (యోహాను 14:2, 3) ఈ కింద ఇవ్వబడిన లేఖనాలను పరిశీలిస్తే, యేసుతోపాటు ఆయన తండ్రి రాజ్యంలో పరిపాలన చేసే కొంతమంది స్త్రీపురుషుల పేర్లు మీరు తెలుసుకుంటారు.—మత్తయి 10:2-4; మార్కు 15:39-41; యోహాను 19:25.

యేసుతోపాటు ఎంతమంది పరిపాలన చేస్తారనేది చాలాకాలం వరకు రహస్యంగా ఉంది. అయితే ఎంతమంది అనేది ఇప్పుడు మనకు తెలిసింది. ఎంతమందో మీకు తెలుసా?— 1,44,000 మంది అని బైబిలు చెబుతోంది. ఇది కూడా ఆ పరిశుద్ధ రహస్యంలో ఒక భాగమే.—ప్రకటన 14:1, 4.

‘దేవుని రాజ్యం గురించిన ఈ పరిశుద్ధ రహస్యం’ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎంతో అద్భుతమైన రహస్యమని మీరు ఒప్పుకుంటారా?— అలాగైతే, ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పడం కోసం, దాని గురించి మనం నేర్చుకోగలిగినంత నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. (w10-E 12/01)

a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.

దేవదూతలు ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నించారని మీరు అనుకుంటున్నారు?