కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

అబీగయీలు ఆ యువకుడు భయంతో పరిగెత్తుకు రావడం చూసింది. అతని ముఖంలో ఆ భయం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అతను అంతలా భయపడడానికి కారణం ఏమిటంటే ఓ పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. ఆమె భర్తయైన నాబాలు ఇంట్లోని మగవారినందిరిని చంపడానికి దాదాపు 400 మంది సైనికులు అప్పటికే బయలుదేరారు. ఎందుకు?

ఆ ప్రమాదం ముంచుకురావడానికి కారణం నాబాలే. ఆయన ఎప్పటిలాగే క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించాడు. కానీ ఈసారి అతను అవమానించింది మామూలు వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి దావీదు. ఆయన నమ్మకస్థులూ సుశిక్షితులైన యోధులకు ప్రియతమ నాయకుడు. బహుశ నాబాలు గొఱ్ఱెలను కాసే పనివాడొకడు అబీగయీలు దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాడు. ఎందుకంటే నాబాలు ఇంటి వారి మీదకు వస్తున్న ఆ ప్రమాదాన్ని ఆమె తప్పించగలదనే నమ్మకం అతనికుంది. కానీ అంత సైన్యాన్ని ఒక స్త్రీ ఎలా ఆపగలదు?

ముందుగా మనం సమర్థురాలైన ఈ స్త్రీ గురించి కొంత తెలుసుకుందాం. అబీగయీలు ఎవరు? అసలు ఈ కష్టాలన్నిటికి కారణం ఏమిటి? విశ్వాసంతో ఆమె చేసిన పనినుండి మనమేమి నేర్చుకోవచ్చు?

‘సుబుద్ధిగలది, రూపవతి’

అబీగయీలు, నాబాలు సరైన జోడీ కాదు. నాబాలుకు ఆమెకన్నా మంచి భార్య దొరకదు, కానీ అబీగయీలుకు మాత్రం అంతకన్నా చెడ్డ భర్త దొరికే అవకాశం లేదు. అతను చాలా ధనవంతుడే. అందుకే తాను చాలా ప్రముఖుడ్నని అనుకునేవాడు. కానీ అతని గురించి ఇతరులు ఏమనుకునేవాళ్లు? బైబిలు అతని గురించి చెప్పినంత ఘోరంగా మరెవరి గురించి చెప్పడంలేదు. అతని పేరుకు అర్థం ‘మోటువాడు’ లేదా ‘మూర్ఖుడు.’ అతని తల్లిదండ్రులే అతనికి ఆ పేరు పెట్టారో, అతనికున్న అవలక్షణాల వల్ల అతనికి ఆ పేరు వచ్చిందో మనకు తెలీదు. ఏదేమైనప్పటికీ అతను తన పేరుకు తగ్గట్టే ప్రవర్తించేవాడు. నాబాలు ‘మోటువాడు, దుర్మార్గుడు.’ అతను చీటికిమాటికి గొడవలు పెట్టుకునేవాడు, పైగా తాగుబోతు. అతనంటే అందరికీ భయం అందుకే అతన్ని ఎవరూ ఇష్టపడేవారు కాదు.—1 సమూయేలు 25:2, 3, 17, 21, 25.

కాని అబీగయీలు అతనికి పూర్తిగా విరుద్ధం. ఆమె పేరుకు “నా తండ్రి నన్ను చూసి సంతోషిస్తున్నాడు” అని అర్థం. అందమైన కూతుర్ని చూసుకుని చాలామంది తండ్రులు గర్వపడుతుంటారు, అయితే జ్ఞానవంతుడైన తండ్రి తన కూతురుకు మంచి మనసుంటే ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు. సాధారణంగా అందంగా ఉన్నవాళ్లు బుద్ధి, వివేకం, ధైర్యం, విశ్వాసం వంటి సుగుణాలను అలవర్చుకోవడం ఎందుకు అవసరమో అర్థం చేసుకోరు. అబీగయీలు అలా కాదు. ఆమె ‘సుబుద్ధిగలది, రూపవతి’ అని బైబిలు చెబుతుంది.—1 సమూయేలు 25:3.

మరి, అంత తెలివైన అమ్మాయి అంత పనికిమాలిన వాడిని ఎందుకు చేసుకుంది అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే మనం ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి, అప్పట్లో తల్లిదండ్రులే సంబంధాలు చూసి పిల్లలకు పెళ్లి చేసేవారు. ఒకవేళ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం కాకపోయినా వాళ్ల అనుమతి తీసుకోవడం చాలాముఖ్యం. నాబాలు ఆస్తిపాస్తులు చూసి అబీగయీలు తల్లిదండ్రులు ఇష్టపడే ఈ పెళ్లి చేశారా లేక పేదరికాన్ని తట్టుకోలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? ఏదేమైనా నాబాలుకున్న డబ్బు అతనొక మంచి భర్త అని నిరూపించలేకపోయింది.

వివాహాన్ని ఎంతో గౌరవప్రదమైనదిగా చూడాలని జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తారు. డబ్బుకు ఆశపడి పెళ్లి చేసుకోమని వారిని బలవంతం చేయరు. అలాగే భార్యాభర్తలుగా తమ బాధ్యతలను నిర్వర్తించే యుక్తవయసు రాకముందే పెళ్లి చేసుకోమని తమ పిల్లలను తొందరపెట్టరు. (1 కొరింథీయులు 7:36) అయితే అబీగయీలుకు ఆ విషయాల గురించి ఆలోచించే అవకాశం లభించి ఉండకపోవచ్చు. ఆమె నాబాలును పెళ్లిచేసుకోవడానికి కారణం ఏదైనా, ఇప్పుడామె నాబాలు భార్య కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా మంచి భార్యగా ఉండాలనుకుంది.

‘అతడు వారితో కఠినంగా మాట్లాడాడు’

నాబాలు ఇప్పుడు చేసిన పనివల్ల అబీగయీలుకు మరో కష్టం వచ్చిపడింది. అతను దావీదు అంతటివాడ్ని అవమానించాడు. దావీదు నమ్మకమైన యెహోవా సేవకుడు. సౌలు తర్వాత రాజుగా ఉండడానికి దేవుడు ఆయనను ఎంచుకున్నాడని చూపించడానికి సమూయేలు ప్రవక్త ఆయనను అభిషేకించాడు. (1 సమూయేలు 16:1, 2, 11-13) అసూయతో తనను చంపడానికి చూస్తున్న సౌలు రాజు నుండి పారిపోతూ దావీదు తన 600 మంది నమ్మకస్థులైన యోధులతో అరణ్యంలో తలదాచుకున్నాడు.

నాబాలు మాయోనులో ఉండేవాడు, అయితే దగ్గర్లోని కర్మెలులో పని చేసుకునేవాడు ఎందుకంటే బహుశ అతనికి అక్కడ భూములు ఉండి ఉండవచ్చు. a ఆ పట్టణాలు గొఱ్ఱెలకు మంచి మేత దొరికే పచ్చిక బైళ్లున్న కొండలకు దగ్గరగా ఉన్నాయి. నాబాలుకు కూడా 3000 గొఱ్ఱెలు ఉన్నాయి. ఆ చుట్టు ప్రక్కలంతా బంజరు భూమి. దక్షిణాన పారాను అరణ్యం ఉంది. తూర్పునున్న ఉప్పు సముద్రం దగ్గరికి వెళ్లే మార్గంలో లోయలు, గుహలు ఉన్న బంజరు భూమి ఉంది. దావీదు, ఆయన మనుషులు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ ఈ ప్రాంతాల్లోనే ఉండేవారు. ధనవంతుడైన నాబాలు కోసం పనిచేసే గొఱ్ఱెల కాపరులు తరచూ అక్కడే వాళ్లకు ఎదురుపడుతుండేవాళ్లు.

ఎంతో కష్టపడి పనిచేసే ఆ సైనికులు గొఱ్ఱెలకాపరులతో ఎలా ఉండేవారు? వాళ్ల మందల్లో నుండి అప్పుడప్పుడు ఒక గొర్రెను తీసుకెళ్లిపోవడం వాళ్లకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయినా వాళ్లు అలా చేయకుండా, నాబాలు మందలకు, పనివాళ్లకు ఎలాంటి ఆపదా రాకుండా చూసుకున్నారు. (1 సమూయేలు 25:15, 16) గొర్రెలకు, గొర్రెలకాపరులకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండేవి. అప్పట్లో క్రూర జంతువులు తరచూ దాడి చేసేవి. ఇశ్రాయేలు దక్షిణ సరిహద్దు దగ్గర్లోనే ఉంది కాబట్టి, వేరే ప్రాంతాల నుండి వచ్చే గజదొంగల బెడద ఎక్కువగా ఉండేది. b

వాళ్లందరికీ ఆ అరణ్యంలో ఆహారం సమకూర్చడం పెద్ద పనే. కాబట్టి ఒకరోజు దావీదు సహాయం అడగడానికి పదిమంది దూతలను నాబాలు దగ్గరికి పంపించాడు. దావీదు ఎంతో ఆలోచించే ఆ సమయంలో మనుషులను పంపడానికి నిర్ణయించుకున్నాడు. అది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం, ఆ సమయంలో సాధారణంగా అందరూ ఉదారంగా ఇస్తూ పండుగ జరుపుకుంటారు. నాబాలుతో తన పనివాళ్లు మాట్లాడాల్సిన మాటల్ని కూడా దావీదు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంతో గౌరవంతో మర్యాదపూర్వకంగా ఉండే పదాలను ఎంచుకున్నాడు. నాబాలు వయస్సును గౌరవిస్తూ ఆయన తనను తాను “నీ కుమారుడైన దావీదు” అని కూడా చెప్పుకున్నాడు. మరి నాబాలు ఏమి చేశాడు?—1 సమూయేలు 25:5-8.

అతడు కోపంతో ఊగిపోయాడు. మొదటి పేరాలో మనం చూసిన యువకుడు అబీగయీలుతో చెప్పినట్లుగా ‘అతడు వారితో కఠినంగా మాట్లాడాడు.’ పిసినిగొట్టు నాబాలు తన రొట్టెలు, నీళ్లు, మాంసం చాలా విలువైనవని వాళ్ల మీద గట్టిగా అరిచాడు. దావీదును పనికిరాని వాడని అవమానిస్తూ, యజమానుని విడిచి పారిపోయిన దాసునితో ఆయనను పోల్చాడు. దావీదు విషయంలో, నాబాలు కూడా దావీదును ద్వేషించిన సౌలులాగే ఆలోచించి ఉంటాడు. ఆ ఇద్దరూ దావీదును యెహోవా చూసినట్లు చూడలేదు. దేవుడు దావీదును ప్రేమించాడు. ఆయనను తిరుగుబాటు చేసిన దాసునిగా కాదుగానీ, ఇశ్రాయేలు భవిష్యత్‌ రాజుగా చూశాడు.—1 సమూయేలు 25:10, 11, 14.

దావీదు పంపిన దూతలు తిరిగొచ్చి జరిగిన దాన్ని చెప్పినప్పుడు దావీదుకు పట్టరానంత కోపం వచ్చింది. “మీరందరు మీ కత్తులను ధరించుకొనుడి” అని ఆజ్ఞాపించాడు. దావీదు కూడా ఆయుధాలను ధరించి, తన వారిలో 400 మందిని తీసుకుని బయలుదేరాడు. నాబాలు ఇంట్లో ఉన్న మగవారినందరిని మట్టుపెడతానని ఒట్టుపెట్టుకున్నాడు. (1 సమూయేలు 25:12, 13, 21, 22) దావీదుకు కోపం రావడం సబబే, కానీ ఆయన ఆ కోపాన్ని చూపించాలనుకున్న తీరు మాత్రం తప్పు. “నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” అని బైబిలు చెబుతోంది. (యాకోబు 1:20) మరి అబీగయీలు తన ఇంటివారిని ఎలా కాపాడగలిగింది.

“నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక”

జరిగిన తప్పును సరిదిద్దడానికి చేయాల్సిన పనిని అబీగయీలు అప్పటికే మొదలు పెట్టిందని తెలుసుకున్నాం. తన భర్త నాబాలులా కాకుండా ఆమె చెప్పింది వినడానికి ఇష్టపడింది. పనివాడు నాబాలు గురించి చెబుతూ “మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు” అన్నాడు. c (1 సమూయేలు 25:17) నాబాలు తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఎవరు చెప్పినా వినడానికి ఇష్టపడేవాడు కాదు. ప్రజల్లో అలాంటి అహంకారం ఈ రోజుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే అబీగయీలు అలాంటిది కాదని తెలుసు కాబట్టే ఆ పనివాడు సమస్యను పరిష్కరించమని ఆమెను అడగడానికి వచ్చాడు.

అబీగయీలు ఆలోచించుకుని వెంటనే చేయాల్సింది మొదలుపెట్టింది. అబీగయీలు త్వరగా బయలుదేరిందని బైబిలు చెబుతుంది. ఆమె త్వరగా చర్య తీసుకుందనే విషయం ఈ ఒక్క వృత్తాంతంలోనే నాలుగుసార్లు చెప్పబడింది. దావీదు, ఆయన మనుషులు తినడానికి ఆమె రొట్టెలు, వండిన మాంసం, వేయించిన ధాన్యం, ద్రాక్షారసం, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలు, అంజూరపు అడలు తీసుకువెళ్లింది. (సామెతలు 31:10-31) ఆమె వాటన్నింటిని పనివాళ్లకు ఇచ్చి పంపి, వారి వెనక తను కూడా వెళ్లింది. అయితే ఆమె తన భర్త “నాబాలుతో ఏమియు చెప్పక” బయలుదేరిందని బైబిలు చెబుతుంది.—1 సమూయేలు 25:18, 19.

అంటే దానర్థం అబీగయీలు తన భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనా? కానేకాదు. యెహోవా అభిషేకించిన సేవకుణ్ణి నాబాలు అవమానించాడు. నాబాలు చేసిన పని వల్ల, ఆయన ఇంట్లోవున్న కల్లాకపటం ఎరుగని మిగతావారి ప్రాణాలకు ముప్పువాటిల్లింది. ఒకవేళ అబీగయీలు వెంటనే చేయాల్సింది చేసివుండకపోతే తన భర్తతో పాటు తానూ తప్పు చేసినట్లయ్యేది. ఏదేమైనప్పటికి, ఆమె తన భర్తకన్నా దేవునికే ఎక్కువగా లోబడాలి.

అబీగయీలుకు మధ్య దారిలో, దావీదు అతని మనుషులు ఎదురయ్యారు. వారిని చూడగానే ఆమె త్వరగా గాడిద మీద నుండి దిగి దావీదుకు నమస్కరించింది. (1 సమూయేలు 25:20, 23) తన భర్త మీద, తన ఇంటివారి మీద దయచూపించమని వేడుకుంటూ దావీదుకు అన్ని విషయాలు వివరించింది. ఆమె చెప్పిందాన్ని దావీదు ఎందుకు ఒప్పుకున్నాడు?

ఆమె తప్పు తన మీద వేసుకుని జరిగినదానికి తనను క్షమించమని దావీదును అడిగింది. ఆమె, తన భర్త పేరుకు తగ్గట్లే మోటువాడని లేదా మూర్ఖుడని అంటూ అలాంటి వాడిని శిక్షించడం దావీదుకే అవమానకరం అన్నట్లు మాట్లాడింది. దావీదు, “యెహోవా యుద్ధములను” చేస్తున్నాడని, ఆయనను దేవుడే నియమించాడని తను నమ్ముతున్నానని చెప్పింది. ‘యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించాడు’ అని చెబుతూ దావీదుకు రాజ్యాధికారం ఇస్తానని యెహోవా ఆయనకు చేసిన ప్రమాణం గురించి తనకు తెలుసని కూడా అంది. అంతేకాకుండా, ఆయన మీదకు రక్తాపరాధాన్ని తీసుకొచ్చే లేదా తర్వాతి కాలంలో ఆయనకు “మనోవిచారం” కలిగించే అంటే తప్పు చేశాననే బాధను మిగిల్చే పనేదీ చేయవద్దని దావీదును బ్రతిమాలుకుంది. (1 సమూయేలు 25:24-31) ఆమె దయగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడింది.

దానికి దావీదు ఏమన్నాడు? అబీగయీలు తెచ్చినవి తీసుకుని దావీదు ఆమెతో “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక” అన్నాడు. త్వరగా బయలుదేరి ధైర్యంగా తనను కలుసుకోవడానికి వచ్చినందుకు దావీదు ఆమెను మెచ్చుకున్నాడు. తన మీదికి రక్తాపరాధం రాకుండా ఆమె ఆపిందని ఆయన అన్నాడు. ఆయన వినయంగా “నీ మాటలు నేను ఆలకించితిని” అంటూ “సమాధానముగా నీ యింటికి పొమ్ము” అని ఆమెకు భరోసా ఇచ్చాడు.—1 సమూయేలు 25:32-35.

“నా యేలినవాని దాసురాలను”

ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అబీగయీలు దావీదు గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. నమ్మకస్థుడు, దయామయుడు అయిన దావీదుకు, క్రూరుడయిన తన భర్తకు ఎంత తేడా ఉందో గమనించే ఉంటుంది. అయితే ఆమె వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోలేదు. ‘అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు వచ్చింది’ అని చదువుతాం. కాబట్టి ఆమె ఎప్పటిలాగే భార్యగా తను చేయగలిగినదంతా చేయడానికి తన భర్త దగ్గరకు తిరిగి వచ్చింది. దావీదుకు, ఆయన మనుషులకు ఆమె ఇచ్చిన వాటి గురించి ఆమె నాబాలుకు చెప్పాల్సివుంది. నాబాలుకు తెలుసుకునే హక్కుంది. ఎందుకంటే ఎంత ప్రమాదం తప్పిందో అతను వేరెవరి దగ్గరో తెలుసుకునే ముందు ఆమె చెప్తే కనీసం ఆ గౌరవమన్నా అతనికి ఉంటుంది. అయితే ఆమె ఇప్పుడు అతనికి ఆ విషయం చెప్పలేదు. అతను అప్పటికి రాజులా విందు చేసుకుంటూ, పీకల వరకు తాగి మత్తులో ఉన్నాడు.—1 సమూయేలు 25:36.

ఆమె మరలా ధైర్యంగా, తెలివిగా నాబాలు మత్తు దిగేవరకు అంటే మరుసటి రోజు వరకు ఆగింది. అప్పుడైతేనే నాబాలు ఆమె చెప్తున్నది అర్థం చేసుకునే స్థితిలో ఉంటాడు కాకపోతే అతని కోపం వల్ల ఆమెకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె జరిగినదంతా అతనికి చెప్పింది. అతను కోపంతో రెచ్చిపోతాడని, బహుశ కొడతాడని కూడా ఆమె అనుకొని ఉంటుంది. కానీ అతను కూర్చున్న చోటే కదలకుండా ఉండిపోయాడు.—1 సమూయేలు 25:37.

అతనికి ఏమైంది? ‘అతని గుండెపగిలి, రాయిలా బిగుసుకుపోయాడు.’ బహుశ అతనికి గుండె పోటు వచ్చుంటుంది. అయితే అతను పది రోజుల తర్వాత చనిపోయాడు. కానీ అతను చనిపోయింది అనారోగ్యం వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే “యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.” (1 సమూయేలు 25:38) ఆ న్యాయమైన తీర్పు వల్ల పిడకలలాంటి ఆమె వివాహ జీవితం ముగిసింది. ఈ రోజుల్లో యెహోవా అలా అద్భుతంగా తీర్పు తీర్చకపోయినా ఇప్పుడు జరుగుతున్న గృహ హింసను, వేదింపులను ఆయన గమనించకుండా ఉండడనే భరోసాను ఈ సంఘటన ఇస్తుంది. ఆయన సమయం వచ్చిందనుకున్నప్పుడు, బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాడు.

అబీగయీలు క్రూరుడైన భర్త నుండి విముక్తితో పాటు మరో ఆశీర్వాదం కూడా పొందింది. నాబాలు చనిపోయాడని తెలిసిన తర్వాత దావీదు తనను పెళ్లి చేసుకోమని అడగడానికి ఆమె దగ్గరకు మనుషులను పంపించాడు. దానికి ఆమె “నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నాను” అని చెప్పింది. దావీదుకు భార్యనవుతానని తెలిసిన తర్వాత కూడా ఆమె మారిపోలేదుగానీ ఆయన సేవకులకు సేవకురాలిగా ఉంటానంది. ఇప్పుడు కూడా ఆమె త్వరగా బయలుదేరి దావీదు దగ్గరకు ప్రయాణమయ్యిందని చదువుతాం.—1 సమూయేలు 25:39-42.

అక్కడితో కథ సుఖాంతమైందని చెప్పలేం. దావీదుతో అబీగయీలు జీవితం ఎప్పుడూ సాఫీగా సాగుతుందని చెప్పలేం. దావీదుకు అప్పటికే అహీనోయముతో పెళ్లైంది. కాబట్టి అప్పట్లో నమ్మకస్థులైన స్త్రీలకు వారి భర్తలు ఇలా ఒకరి కన్నా ఎక్కువమందిని చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన సమస్యలు తలెత్తేవి. దానికితోడు దావీదు అప్పటికింకా రాజు కాలేదు. ఆయన రాజుగా యెహోవాను సేవించడం మొదలుపెట్టే లోపల ఇంకా ఎన్నో అడ్డంకులు, సమస్యలు తప్పకుండా వస్తాయి. కానీ అబీగయీలు జీవితాంతం దావీదుకు సహాయం చేస్తూ ఆయనకు తోడుగా నిలిచింది. కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు. తనను గౌరవించి కాపాడే భర్త దొరికాడని ఆమె తెలుసుకుంది. ఒక సందర్భంలో ఆమెను ఎత్తుకుపోయిన దుండుగుల చేతుల్లో నుండి కూడా ఆమెను కాపాడాడు. (1 సమూయేలు 30:1-19) ఆ విధంగా దావీదు, అలాంటి సుబుద్ధిగల, ధైర్యవంతులైన, నమ్మకస్థులైన స్త్రీలను ప్రేమించి గౌరవించే యెహోవా దేవునిలా నడుచుకున్నాడు. (w09 07/01)

[అధస్సూచీలు]

a ఇది, ఉత్తరాన ఎంతో దూరంలోవున్న కర్మెలు పర్వతం కాదుగానీ పారాను అరణ్యం చివరన ఉన్న ఒక పట్టణం.

b ఆ ప్రాంతంలో ఉన్న భూస్వాములను, వాళ్ల మందలను కాపాడడం యెహోవా దేవునికి సేవ చేసినట్లేనని దావీదు అనుకుని ఉండవచ్చు. ఆ రోజుల్లో, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి ఆ ప్రాంతంలో నివసించాలని యెహోవా ఉద్దేశించాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చే వేరే ప్రాంతాల వారినుండి, దోపిడీ దొంగల నుండి దాన్ని కాపాడడం ఒక విధంగా పరిశుద్ధ సేవగా పరిగణించబడేది.

c నిజానికి ఆ యువకుడు పలికిన మాటలకు “బెలయాలు కుమారుడు (పనికి రానివాడు)” అని అర్థం. వేరే బైబిలు అనువాదాలు నాబాలు ఎలాంటి వాడో వివరిస్తూ “అతను ఎవరి మాట వినడు” అందుకే “అతనితో మాట్లాడడం వ్యర్థం” అని చెబుతున్నాయి.

[15వ పేజీలోని చిత్రం]

అబీగయీలు తన భర్తలా కాకుండా ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినేది

[16వ పేజీలోని చిత్రం]

దావీదుతో మాట్లాడుతున్నప్పుడు అబీగయీలు వినయాన్ని, ధైర్యాన్ని, సుబుద్ధిని చూపించింది