కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నూతనలోక అనువాదం 2013 రివైజ్డ్‌ ఎడిషన్‌

నూతనలోక అనువాదం 2013 రివైజ్డ్‌ ఎడిషన్‌

గడిచిన సంవత్సరాల్లో పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం (ఇంగ్లీష్‌) బైబిల్ని ఇప్పటికీ చాలాసార్లు రివైజ్‌ చేశారు. కానీ 2013 లో విడుదలైన రివైజ్డ్‌ బైబిలు మాత్రం చాలా వేరుగా ఉంది. ఉదాహరణకు, ఇప్పుడున్న బైబిలులోని చాలా వచనాల్లో తక్కువ పదాలను వాడారు. అంతేకాదు, కొన్ని ప్రాముఖ్యమైన బైబిలు పదాలను కూడా మార్చారు. కొన్ని అధ్యాయాలను కావ్య రూపంలోకి మార్చి, కొన్ని పదాలకు అధస్సూచీల్లో వివరణను ఇచ్చారు. అయితే ఈ బైబిల్లో చేసిన మార్పులన్నిటినీ చర్చించడం సాధ్యం కాకపోయినా కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

ఏ ముఖ్యమైన బైబిలు పదాలను మార్చారు? ముందటి ఆర్టికల్‌లో చర్చించినట్లు “షియోల్‌,” “హేడిస్‌,” “ఆత్మ” వంటి వాటితోపాటు మరికొన్ని పదాలను కూడా మార్చారు.

“కాముకత్వం” బదులు గర్వాన్ని సూచించే గ్రీకు భాషా పదానికి దగ్గరగా ఉన్న ‘లెక్కలేనితనం’ అనే పదాన్ని ఉపయోగించారు. (గల. 5:19) ‘ప్రేమపూర్వక దయ’ స్థానంలో ‘యథార్థ ప్రేమ’ అనే పదాన్ని వాడారు. ఆ పదం బైబిలు తరచూ ఉపయోగించే ‘విశ్వసనీయత’ అనే పదానికి దగ్గరగా ఉంది.—కీర్త. 36:5; 89:1.

అన్నిచోట్ల ఒకేలా అనువదించిన కొన్ని పదాల్ని ఈ బైబిల్లో సందర్భానికి తగ్గట్టుగా అనువదించారు. ఉదాహరణకు ‘ఓలమ్‌,’ అనే హీబ్రూ పదాన్ని ఇంతకుముందు “యుగయుగములు” అని అనువదించారు కానీ రివైజ్డ్‌ బైబిల్లో దాన్ని ‘ఎప్పటికీ’ అని ఉపయోగించారు. దానివల్ల కీర్తన 90:2, మీకా 5:2 లేఖనాల్లో ఎలాంటి మార్పు కనిపిస్తుందో ఆ బైబిల్లో చూడండి.

లేఖనాల్లో ‘విత్తనం’ (సీడ్‌) అని అనువదించిన హీబ్రూ, గ్రీకు పదాల్ని వ్యవసాయానికి సంబంధించిన వాటి గురించి చెప్పడానికి అలాగే ‘సంతానాన్ని’ సూచించడానికి ఉపయోగించారు. అయితే, నూతనలోక అనువాదం పాత ఎడిషన్‌లో ఆదికాండము 3:15తో సహా చాలా వచనాల్లో ‘విత్తనం’ అనే పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. కానీ ఇంగ్లీషులో సీడ్‌ అనే పదాన్ని ‘సంతానాన్ని’ సూచించడానికి ఇప్పుడు ఎవరూ వాడడం లేదు. అందుకే, రివైజ్డ్‌ ఎడిషన్‌లో ఆదికాండము 3:15⁠లో, దానికి సంబంధించిన మరికొన్ని వచనాల్లో ‘సంతానం’ అని అనువదించారు. (ఆది. 22:17, 18; ప్రక. 12:17) ఇతర వచనాల్లో సందర్భానికి తగ్గట్టుగా అనువదించారు.—ఆది. 1:11; కీర్త. 22:30; యెష. 57:3.

ఉన్నదున్నట్లు అనువదించిన కొన్ని పదాల్ని ఎందుకు మార్చారు? ‘ఉన్నదున్నట్లు అనువదించడం వల్ల ఒక పదానికి లేదా వాక్యానికి ఉన్న అర్థం మారినప్పుడు ఆ స్థానంలో సరైన అర్థం వచ్చేలా అనువదించినప్పుడే’ అది ఒక మంచి బైబిలు అనువాదం అవుతుందని 2013 రివైజ్డ్‌ ఎడిషన్‌లోని అనుబంధం A1 చెప్తుంది. ఒకవేళ ఆదిమ భాషలోని జాతీయాలు వేరే భాషల్లో కూడా అదే అర్థాన్నిస్తుంటే వాటిని ఈ బైబిల్లో ఉన్నదున్నట్లు అనువదించారు. ఉదాహరణకు, ప్రకటన 2:23⁠లో ‘హృదయాల్ని పరీక్షించువాడు’ అనే మాట చాలా భాషల్లో అర్థమౌతుంది. అయితే, అదే వచనంలో ‘మూత్రపిండాలను పరీక్షించడం’ అంటే అంతగా అర్థంకాకపోవచ్చు. అందుకే, దాన్ని ఉన్నదున్నట్లు అనువదించే బదులు ఆదిమ భాషలో ఉన్న అర్థం వచ్చేలా ‘లోతైన ఆలోచనల్ని పరీక్షించువాడు’ అని అనువదించారు. అదేవిధంగా, ‘సున్నతి చేయబడని పెదవులు’ అనే వాక్యం చాలా భాషల్లో స్పష్టంగా అర్థంకాకపోవచ్చు. అందుకే, దాన్ని “సరిగ్గా మాట్లాడలేను” అని అనువదించారు. (నిర్గ. 6:12) లేఖనాల్లో స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా చాలా హీబ్రూ పదాలను సులభమైన భాషలో అనువదించారు.

‘ఇశ్రాయేలు కుమారులు,’ ‘తండ్రిలేని అబ్బాయిలు’ వంటి మాటల్ని ఈ బైబిల్లో ‘ఇశ్రాయేలీయులు,’ ‘తండ్రిలేని పిల్లలు’ అని ఎందుకు అనువదించారు? హీబ్రూ భాషలో అబ్బాయి గురించి చెప్పేటప్పుడు ఒక రకమైన పదాల్ని, అమ్మాయి గురించి చెప్పేటప్పుడు మరో రకమైన పదాల్ని ఉపయోగిస్తారు. కానీ, కొన్ని పదాల్ని మాత్రం అబ్బాయిలతోపాటు అమ్మాయిల గురించి చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, కొన్ని వచనాల్లోని సందర్భాన్నిబట్టి చూస్తే ‘ఇశ్రాయేలు కుమారులు’ అనే మాట పురుషులతోపాటు, స్త్రీలను కూడా సూచిస్తుంది. అందుకే, ఈ బైబిల్లో ఆ పదానికి బదులు ‘ఇశ్రాయేలీయులు’ అనే మాటను ఉపయోగించారు.—నిర్గ. 1:7; 35:29; 2 రాజు. 8:12.

అలాగే ఆదికాండము 3:16 లో హీబ్రూ భాషలో అబ్బాయిల్ని సూచించడానికి ఉపయోగించే ‘కుమారులు’ అనే పదాన్ని పాత నూతనలోక అనువాదంలో ‘పిల్లలు’ అని అనువదించారు. కానీ నిర్గమకాండము 22:24వ వచనంలో అదే పదాన్ని ఇప్పుడు రివైజ్డ్‌ ఎడిషన్‌లో, ‘మీ పిల్లలు [హీబ్రూలో ‘కుమారులు’] తండ్రిలేని వాళ్లవుతారు’ అని మార్చారు. అదే పద్ధతిని ఉపయోగించి ఇతర వచనాల్లో కూడా, ‘తండ్రిలేని అబ్బాయి’ అనే పదానికి బదులు ‘తండ్రిలేని పిల్లవాడు’ లేదా ‘అనాథ’ అనే పదాల్ని ఉపయోగించారు. (ద్వితీ. 10:18; యోబు 6:27) గ్రీకు సెప్టువజింటులో కూడా ఇలాంటి పదాల్నే ఉపయోగించారు.

ఆదిమ రాతప్రతుల్లో కవితా శైలిలో ఉన్న అధ్యాయాల్ని రివైజ్డ్‌ బైబిల్లో కూడా చాలావరకు కావ్య రూపంలోకి మార్చారు

చాలా అధ్యాయాల్ని కావ్య రూపంలోకి ఎందుకు మార్చారు? బైబిల్ని మొదట రాసినప్పుడు అందులో చాలా భాగాల్ని కావ్య రూపంలోనే రాశారు. ఆధునిక భాషల్లోని కవిత్వంలో ప్రాసకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కానీ హీబ్రూ కవిత్వంలో సారూప్యాలు, వ్యత్యాసాలు ప్రధాన అంశాలుగా ఉండేవి. వాటి రచయితలు తమ ఆలోచనల్ని ఓ చక్కని క్రమంలో అమర్చడం వల్ల హీబ్రూ కవిత్వంలో లయ ఉండేది.

యోబు, కీర్తన పుస్తకాల్లోని వచనాలను పాడడానికి లేదా కంఠస్థం చేయడానికి వీలుగా వాటిని నూతనలోక అనువాదం పాత ఎడిషన్‌లలో కవితా శైలిలోకి మార్చారు. దానివల్ల కవితా శైలి ఉట్టిపడడమే కాకుండా వాటిని గుర్తుంచుకోవడానికి కూడా సులభంగా ఉన్నాయి. సామెతలు, పరమగీతము అలాగే ప్రవచన పుస్తకాల్లో చాలా అధ్యాయాల్ని కూడా వచన రూపంలో రాశారు. కాబట్టి ఆ కవితా శైలిని అలాగే వాటిలో ఉన్న సారూప్యతల్ని-వ్యత్యాసాల్ని తేలిగ్గా గుర్తించే విధంగా 2013 రివైజ్డ్‌ బైబిల్లో మార్పులు చేశారు. ఉదాహరణకు, నూతనలోక అనువాదంలో యెషయా 24:2వ వచనాన్ని చూడండి అందులో ప్రతీ వాక్యం ఒక వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఆ వచనంలో దేవుని తీర్పును ఎవ్వరూ తప్పించుకోలేరని నొక్కి చెప్తుంది. ఇలాంటి వృత్తాంతాలను కవిత్వంగా గుర్తించడం వల్ల బైబిలు రచయిత కేవలం పదాలను మళ్లీమళ్లీ చెప్పట్లేదుగానీ దేవుని సందేశాన్ని కవితా శైలిలో చెప్తున్నాడని దాన్ని చదివేవాళ్లు తెలుసుకుంటారు.

హీబ్రూ భాషలో కవిత్వానికి, కవిత్వం కానివాటికి ఉన్న తేడా అన్నిసార్లూ స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే, కొన్ని బైబిలు అనువాదాల్లో ఏదైనా వృత్తాంతం కావ్య రూపంలో ఉంటే మరో అనువాదంలో అలా ఉండకపోవచ్చు. ఏ వచనాలు కావ్య రూపంలో ఉన్నాయో అనువాదకులు జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే విషయాన్ని నొక్కిచెప్పడానికి కొన్ని అధ్యాయాల్లో ఉపయోగించిన పదచిత్రాలు, పదబంధాలు, సారూప్యతల వల్ల అవి కవిత్వం కాకపోయినా కవిత్వంలా అనిపిస్తాయి.

ఈ కొత్త బైబిల్లో, ప్రతీ పుస్తకానికి ముందు ‘అధ్యాయాల్లోని అంశాలు’ ఉంటాయి. అవి, ముఖ్యంగా ప్రాచీన కావ్యమైన పరమగీతము పుస్తకంలో ఏ మాటల్ని ఎవరు చెప్తున్నారో గుర్తించడానికి సహాయం చేస్తుంది.

ఆదిమ భాషలోని ప్రాచీన రాతప్రతులను అధ్యయనం చేయడంవల్ల ఈ బైబిల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? హీబ్రూ మాసొరెటిక్‌ ప్రతి, వెస్కాట్‌, హోర్ట్‌ తయారుచేసిన గ్రీకు మూలప్రతి ఆధారంగా పాత నూతనలోక అనువాదం బైబిల్ని రూపొందించారు. ప్రాచీన బైబిలు రాతప్రతుల అధ్యయనం ప్రగతి సాధించడం వల్ల కొన్ని వచనాల్ని మరింత బాగా అర్థంచేసుకోవడానికి వీలైంది. మృత సముద్రం చుట్టల కాపీలు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని గ్రీకు రాతప్రతులను అధ్యయనం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త వివరాలు జోడించిన రాతప్రతులు కంప్యూటర్‌లో అందుబాటులో ఉండడం వల్ల ప్రాచీన హీబ్రూ లేదా గ్రీకు ప్రతులను ఒకదానితో ఒకటి పోల్చి వాటిలో ఏవి నమ్మదగినవో గుర్తించడం తేలికైంది. ద న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ వీటన్నిటి సహాయంతో కొన్ని వచనాలను అధ్యయనం చేసి అవసరమైన మార్పులు చేసింది.

ఉదాహరణకు 2 సమూయేలు 13:21వ వచనంలో, గ్రీకు సెప్టువజింటులో ఈ అర్థాన్నిచ్చే మాటలు ఉన్నాయి, ‘కానీ ఆయన తన కుమారుడైన అమ్నోను మనసును నొప్పించలేదు, ఎందుకంటే అమ్నోను తన మొట్టమొదటి కుమారుడు కాబట్టి అతన్ని ప్రేమించాడు.’ కానీ మాసొరెటిక్‌ ప్రతిలో ఈ మాటలు లేవు అందుకే నూతనలోక అనువాదం పాత ఎడిషన్‌లలో కూడా ఆ మాటల్ని చేర్చలేదు. అయితే, మృత సముద్రపు చుట్టల్లో ఆ మాటలు ఉన్నాయి కాబట్టి 2013 రివైజ్డ్‌ ఎడిషన్‌లో వాటిని చేర్చారు. అలాంటి కొన్ని కారణాల వల్లే 1 సమూయేలు పుస్తకంలో దేవుని పేరును 5 సార్లు అదనంగా చేర్చారు. అంతేకాదు గ్రీకు ప్రతులను అధ్యయనం చేయడం వల్ల మత్తయి 21:29-31 వచనాల్లో ఉన్న విషయాల క్రమాన్ని మార్చారు. అయితే, కేవలం ప్రాచీన గ్రీకు ప్రతినే అంటిపెట్టుకోకుండా ప్రాచీన రాతప్రతులను కూడా ఆధారం చేసుకుని ఈ మార్పులను చేశారు.

నూతనలోక అనువాదం బైబిల్ని ప్రజలతో సంభాషించే దేవుని నుండి వచ్చిన బహుమానంగా చూసే ప్రతీ ఒక్కరు మరింతగా చదవడానికి, తేలిగ్గా అర్థం చేసుకోవడానికి చేసిన మార్పుల్లో ఇవి కొన్ని మాత్రమే.