బాగా సిద్ధపడి చేసిన ఒక ప్రార్థన నుండి పాఠాలు
“నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.”—నెహె. 9:5.
1. దేవుని ప్రజలు సమకూడిన ఏ సందర్భం గురించి మనమిప్పుడు పరిశీలించనున్నాం, మనం ఏమని ప్రశ్నించుకోవాలి?
“నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడి.” ఒకచోట సమకూడి యెహోవాకు ప్రార్థించమని ఇశ్రాయేలీయులందర్నీ ఆహ్వానిస్తూ లేవీయులు పలికిన మాటలవి. బైబిల్లో నమోదైన పెద్ద ప్రార్థనల్లో అది ఒకటి. (నెహె. 9:4, 5) సా.శ.పూ. 455, తిష్రీ అనే యూదుల ఏడవ నెల, 24వ రోజున వాళ్లందరూ యెరూషలేములో సమకూడారు. ఆ ప్రత్యేకమైన సందర్భం గురించి పరిశీలిస్తున్నప్పుడు, మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘వాళ్లకున్న ఏ మంచి అలవాటు వల్ల ఆ సందర్భం అంత విజయవంతమైంది? బాగా సిద్ధపడి చేసిన ఆ ప్రార్థన నుండి నేను ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?’—కీర్త. 141:2.
ఒక ప్రత్యేకమైన నెల
2. ప్రాచీనకాల యూదులు మనకు ఎలాంటి ఆదర్శం ఉంచారు?
2 యూదులు అలా సమకూడడానికి ఒక నెల ముందే, యెరూషలేము గోడల్ని మళ్లీ నిర్మించారు. (నెహె. 6:15) వాళ్లు కేవలం 52 రోజుల్లోనే ఆ పనిని ముగించి, ఆ తర్వాత తమ ఆధ్యాత్మిక అవసరాల పట్ల మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి తిష్రీ నెల మొదటి రోజున వాళ్లందరూ ఒక మైదానంలో సమకూడి, ఎజ్రా ఆయనతో పాటు ఇతర లేవీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదువుతుండగా, అర్థాన్ని వివరిస్తుండగా విన్నారు. ‘తెలివితో వినగలగిన వారందరితో సహా’ ప్రతీ కుటుంబంలోని వాళ్లు “ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు” నిలబడేవుండి విన్నారు. కూటాల కోసం సౌకర్యవంతమైన రాజ్యమందిరాల్లో సమకూడే మనందరికీ ఆ యూదులు ఎంత చక్కని ఆదర్శం ఉంచారో కదా! అయినప్పటికీ, కూటాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీ మనసు అటూఇటూ వెళ్తుందా? లేదా ఏమాత్రం ప్రాముఖ్యంకాని వాటి గురించి మీరు ఆలోచిస్తుంటారా? అలాగైతే, ప్రాచీనకాల యూదుల్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి, వాళ్లు కేవలం విని ఊరుకోకుండా, విన్నవాటి గురించి ఆలోచించారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని గుర్తించినప్పుడు వాళ్లు ఏడ్చారు కూడా.—నెహె. 8:1-9.
3. ఇశ్రాయేలీయులు ఏ మాటలకు లోబడ్డారు?
3 అయితే, వాళ్లు తమ పాపాలను బహిరంగంగా ఒప్పుకోవాల్సిన సందర్భం అది కాదు. ఆ రోజు పండుగ కాబట్టి, అది యెహోవా ఆరాధనలో సంతోషంగా గడపాల్సిన సమయం. (సంఖ్యా. 29:1-6) అందుకే నెహెమ్యా ప్రజలకిలా చెప్పాడు: “పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.” మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రజలు ఆ మాటలకు లోబడ్డారు, దాంతో ఆ రోజు ఎంతో సంతోషంగా గడిచింది.—నెహె. 8:10-12.
4. ఇశ్రాయేలు కుటుంబ పెద్దలు ఏమి చేశారు? పర్ణశాలల పండుగకు సంబంధించిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటి?
4 ఆ మరుసటి రోజే కుటుంబ పెద్దలు సమకూడి, తాము ఒక జనాంగంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మరింత ఎక్కువగా ఎలా పాటించవచ్చో చర్చించుకున్నారు. వాళ్లు లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, తిష్రీ అనే 7వ నెలలో 15వ రోజు నుండి 22వ రోజు వరకు పర్ణశాలల పండుగ జరుపుకోవాలనీ చివరి రోజు సర్వసమాజం కూడుకోవాలనీ తెలుసుకుని దానికోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆ పండుగ ఎంత విజయవంతం అయ్యిందంటే యెహోషువ కాలం నుండి ఆ పండుగ అంత గొప్పగా ఎప్పుడూ జరగలేదు, దాంతో “బహు సంతోషము పుట్టెను.” ఈ పండుగలోని ఒక ప్రాముఖ్యమైన అంశం, దేవుని ధర్మశాస్త్రాన్ని ‘మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు అనుదినము’ బిగ్గరగా చదివి వినిపించడం.—నెహె. 8:13-18.
పాపాలు ఒప్పుకునే రోజు
5. లేవీయులు యెహోవాకు ప్రార్థన చేయడానికి ముందు ప్రజలు ఏమి చేశారు?
5 రెండు రోజుల తర్వాత, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించనందుకు ఇశ్రాయేలీయులు తమ పాపాల్ని బహిరంగంగా ఒప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ దినం, వాళ్లు విందులు చేసుకోవాల్సిన పండుగ దినం కాదు. అందుకే, దేవుని ప్రజలు ఉపవాసం ఉండి, దుఃఖానికి ప్రతీకగా గోనెపట్టలు ధరించారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉదయంవేళ సుమారు మూడు గంటలపాటు మళ్లీ ప్రజలకు చదివి వినిపించారు. మధ్యాహ్నం వాళ్లు, “తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.” అప్పుడు లేవీయులు బాగా సిద్ధపడి ప్రజల తరఫున ప్రార్థన చేశారు. —నెహె. 9:1-4.
6. అర్థవంతంగా ప్రార్థించడానికి లేవీయులకు ఏది దోహదపడింది? దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
6 దేవుని ధర్మశాస్త్రాన్ని తరచూ చదివే లేవీయులు ఆ అలవాటువల్లే అర్థవంతంగా ప్రార్థన చేసేలా సిద్ధపడ్డారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రార్థనలోని మొదటి భాగంలో వాళ్లు యెహోవా దేవుని కార్యాల గురించి, లక్షణాల గురించే నొక్కిచెప్పారు. మిగతా భాగంలో, దేవుని “బహు విస్తారమైన కృప” గురించిన ప్రస్తావనను పదేపదే చూస్తాం, దానితోపాటు అలాంటి కృప పొందడానికి ఇశ్రాయేలీయులు ఏమాత్రం అర్హులు కారని లేవీయులు స్పష్టంగా ఒప్పుకోవడం కూడా చూస్తాం. (నెహె. 9:19, 27, 28, 31) లేవీయుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించాలి. ఆ విధంగా యెహోవా చెప్పే మాటలు వినాలి. అలా చేస్తే, ప్రార్థనలో యెహోవాతో మాట్లాడడానికి మన దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి, పైగా మన ప్రార్థనలు అర్థవంతంగా ఉంటాయి.—కీర్త. 1:1, 2.
7. లేవీయులు దేవునికి ఏ విన్నపం చేశారు? దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
7 ఈ ప్రార్థనంతటిలో ఒకే ఒక్క విన్నపం ఉంది. అది 32వ వచనంలో ఇలా ఉంది: “చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జనులందరిమీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.” అలా మన ప్రార్థనలో యెహోవాకు విన్నపాలు చేసే ముందు, ఆయన్ను స్తుతించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని లేవీయుల మంచి ఉదాహరణ చూపిస్తోంది.
దేవుని ఘనమైన నామాన్ని స్తుతించారు
8, 9. (ఎ) లేవీయులు వినయంగా యెహోవాను ఏమని అర్థించారు? (బి) ఏ రెండు పరలోక సైన్యాల గురించి లేవీయులు ప్రస్తావించారు?
8 లేవీయులు ముందుగానే బాగా సిద్ధపడి, ప్రార్థనలో ఎన్నో మంచి పదాలు ఉపయోగించినా అవి యెహోవాకు నిజంగా తగిన స్తుతిని చెల్లించడానికి సరిపోవనే విషయాన్ని వినయంగా గుర్తించారు. దాంతో వాళ్లు ఇశ్రాయేలీయులందరి కోసం ప్రార్థిస్తూ యెహోవాను వినయంగా ఇలా అర్థించారు: “సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.”—నెహె. 9:5.
9 ఆ ప్రార్థన ఇలా కొనసాగుతుంది: “నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.” (నెహె. 9:6) ఇక్కడ లేవీయులు యెహోవా సృష్టించిన కొన్ని అద్భుత కార్యాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన ఆకాశమును, “వాటి సైన్యమును” అంటే అసంఖ్యాకమైన నక్షత్రవీధుల్లోని నక్షత్రాలను సృష్టించాడు. అంతేకాక మన సుందరమైన భూగ్రహం మీదున్న సమస్తాన్ని సృష్టించాడు, దానిమీదున్న రకరకాల ప్రాణులు తమ జాతి ప్రాణులను పునరుత్పత్తి చేసే శక్తిని ఇచ్చాడు. ఆ ప్రార్థనలో మరో రకమైన సైన్యం గురించిన ప్రస్తావన కూడా ఉంది. దేవుని పరిశుద్ధ దూతలనే ‘ఆకాశ సైన్యంగా’ లేదా పరలోక సైన్యంగా ఆ ప్రార్థన వర్ణిస్తోంది. (1 రాజు. 22:19; యోబు 38:4, 7) పైగా ఈ దూతలు “రక్షణయను స్వాస్థ్యము పొందబోవు” అపరిపూర్ణులైన మనుషులకు పరిచారం చేస్తూ వినయంగా దేవుని చిత్తం చేస్తున్నారు. (హెబ్రీ. 1:14) నిష్ణాతులైన సైన్యంవలె ఐక్యంగా యెహోవాను సేవిస్తున్న మనకు దేవదూతలు ఎంతటి గొప్ప మాదిరి ఉంచారో కదా!—1 కొరిం. 14:33, 39-40.
10. దేవుడు అబ్రాహాముతో వ్యవహరించిన విధానం నుండి ఏమి నేర్చుకుంటాం?
10 లేవీయులు ఆ తర్వాత, దేవుడు అబ్రాముకు చేసినదాన్ని ప్రస్తావించారు. యెహోవా ఆయన పేరును “అనేక జనములకు తండ్రి” అని అర్థమున్న అబ్రాహాముగా మార్చాడు. అయితే అబ్రాహాముకు అప్పటికి పిల్లలు లేరు, పైగా ఆయన వయసు 99 సంవత్సరాలు. (ఆది. 17:1-6, 15, 16) అబ్రాహాము సంతతివాళ్లు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందుతారని కూడా యెహోవా వాగ్దానం చేశాడు. మనుషులు తామిచ్చిన మాటను తరచుగా మర్చిపోతుంటారు, కానీ యెహోవా అలా కాదు. అందుకే లేవీయులు ఆ ప్రార్థనలో ఇలా గుర్తుచేసుకున్నారు: “దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సుగలవాడని యెరిగి, కనానీయుల . . . దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే. నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి.” (నెహె. 9:7-9) మనం కూడా ఇచ్చిన మాటకు కట్టుబడివుంటూ, నీతిమంతుడైన మన దేవుణ్ణి అనుకరించడానికి కృషి చేద్దాం.—మత్త. 5:37.
యెహోవా తన ప్రజల కోసం చేసిన అద్భుత కార్యాలు
11, 12. యెహోవా పేరుకున్న అర్థాన్ని వివరించండి? అబ్రాహాము సంతతితో యెహోవా వ్యవహరించిన విధానంలో అది ఎలా కనిపిస్తుంది?
11 యెహోవా పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. అంటే ఆయన తన వాగ్దానాలు నిజమయ్యేలా చేయడానికి పని చేస్తూనే ఉంటాడని దానర్థం. అబ్రాహాము సంతతియైన ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన వాగ్దానాన్ని యెహోవా నిలబెట్టుకున్న విధానమే దానికి ఓ అద్భుతమైన ఉదాహరణ. వాళ్లు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ జనాంగమంతటినీ విడిపించి, వాగ్దాన దేశంలోకి ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. అది అప్పుడు దాదాపు అసాధ్యంగానే కనిపించింది. అయితే ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటూ, చివరకు వాళ్లను విడిపించాడు. అలా యెహోవా అనే తన మహాగొప్ప నామాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నాడు.
12 నెహెమ్యా గ్రంథంలో నమోదైన ప్రార్థన యెహోవా గురించి ఇలా చెబుతుంది: “ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి. మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.” తర్వాత యెహోవా తన ప్రజలకు ఇంకా ఏమి చేశాడో చెబుతూ ఆ ప్రార్థన ఇలా కొనసాగింది: “నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగున వారు తిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.”—నెహె. 9:9-11, 24, 25.
13. యెహోవా ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక అవసరాలు ఎలా తీర్చాడు? అయితే వాళ్లు ఏమి చేశారు?
13 తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా మరెన్నో ఇతర చర్యలు చేపట్టాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత యెహోవా వాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చాడు. లేవీయులు తమ ప్రార్థనలో ఇలా గుర్తు తెచ్చుకున్నారు: “సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.” (నెహె. 9:13) వాగ్దాన దేశపు వారసులుగా తన ప్రజలు తన పరిశుద్ధ నామాన్ని ధరించడానికి యోగ్యులయ్యేలా వాళ్లకు బోధించడానికి యెహోవా ఎంతో ప్రయత్నించాడు, అయితే వాళ్లు మాత్రం నేర్చుకున్న మంచి విషయాల్ని గాలికి వదిలేశారు.—నెహెమ్యా 9:16-18 చదవండి.
క్రమశిక్షణ అవసరం
14, 15. (ఎ) పాపులైన తన ప్రజల పట్ల కనికరంతో యెహోవా ఎలా శ్రద్ధ తీసుకున్నాడు? (బి) ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా వ్యవహరించిన తీరు నుండి ఏమి నేర్చుకుంటాం?
14 దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని సీనాయి పర్వతం దగ్గర వాగ్దానం చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు చేసిన రెండు పాపాల గురించి లేవీయులు తమ ప్రార్థనలో ప్రస్తావించారు. ఆ పాపాల వల్ల వాళ్లు చనిపోయేలా దేవుడు విడిచిపెట్టడం వాళ్లకు తగిన శిక్షే. కానీ ఆ ప్రార్థనలో లేవీయులు యెహోవాను ఇలా స్తుతించారు: “వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు . . . నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.” (నెహె. 9:19, 21) మనం ఆయన్ను నమ్మకంగా సేవించడానికి కావాల్సిన ప్రతీదీ యెహోవా నేడు కూడా ఇస్తున్నాడు. అవిధేయత వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల అరణ్యంలో చనిపోయిన వేలమంది ఇశ్రాయేలీయుల్లా మనం ఉండకూడదని కోరుకుందాం. నిజానికి అలాంటి విషయాలు, “యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.”—1 కొరిం. 10:1-11.
15 విచారకరమైన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు వాగ్దానం దేశంలో స్థిరపడిన తర్వాత అనైతికత, రక్తపాతంతో నిండిన కనానీయుల ఆరాధనను అనుసరించారు. దాంతో పొరుగు దేశాలు తన జనాంగాన్ని అణచివేసేలా యెహోవా అనుమతించాడు. అయితే వాళ్లు పశ్చాత్తాపం చూపించినప్పుడు, యెహోవా కనికరంతో క్షమించి, శత్రువుల నుండి వాళ్లను రక్షించాడు. ఆయన “అనేకమారులు” అలా చేశాడు. (నెహెమ్యా 9:26-28, 31 చదవండి.) లేవీయులు ఇలా ఒప్పుకున్నారు: “నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి.”—నెహె. 9:30.
16, 17. (ఎ) బంధీలుగా ఉండి తిరిగొచ్చిన ఇశ్రాయేలీయుల పరిస్థితికీ, వాగ్దాన దేశంలో నివసించినవాళ్ల పితరుల పరిస్థితికీ తేడా ఏమిటి? (బి) ఇశ్రాయేలీయులు ఏ విషయం ఒప్పుకున్నారు, ఏమి చేస్తామని ప్రమాణం చేశారు?
16 వేరే దేశాల్లో బంధీలుగా ఉండి తిరిగొచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు పదేపదే అవిధేయత చూపించారు. ఫలితం? లేవీయులు ఇలా కొనసాగించారు: “చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము. మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది . . . మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.”—నెహె. 9:36, 37.
17 దేవుడు తన ప్రజలకు అన్యాయం చేశాడని లేవీయులు అంటున్నారా? ఎంతమాత్రం కాదు! “మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యముగానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి” అని వాళ్లు ఒప్పుకున్నారు. (నెహె. 9:33) ఇక అప్పటినుండి తమ జనాంగం దేవుని ధర్మశాస్త్రానికి లోబడుతుందని ఒక ప్రాముఖ్యమైన ప్రమాణం చేసి లేవీయులు తమ నిస్వార్థ ప్రార్థనను ముగించారు. (నెహెమ్యా 10:1, 2 చదవండి; 10:27, 28) ఆ ప్రమాణాన్ని ఒక పత్రంపై రాసి దానిపై 84 మంది యూదా నాయకులు తమ ముద్రలు వేశారు.—నెహె. 10:1-28.
18, 19. (ఎ) దేవుని నూతనలోకంలోకి ప్రవేశించాలంటే మనమేమి చేయాలి? (బి) దేనిగురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి? ఎందుకు?
18 యెహోవా తీసుకొచ్చే నీతియుక్తమైన నూతనలోకంలో ఉండడానికి అర్హులం అవ్వాలంటే మనకు ఆయనిచ్చే క్రమశిక్షణ అవసరం. “తండ్రి శిక్షింపని కుమారుడెవడు?” అని అపొస్తలుడైన పౌలు అడిగాడు. (హెబ్రీ. 12:7) ఆయన సేవలో నమ్మకంగా కొనసాగుతూ, మన వ్యక్తిత్వాన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు ఆయన ఆత్మను అనుమతిస్తూ మనం మన జీవితాల్లో దేవుని నిర్దేశాన్ని పాటిస్తున్నామని చూపిస్తాం. మనం గంభీరమైన పాపం చేసినప్పుడు, నిజంగా పశ్చాత్తాపపడి ఆయనిచ్చే క్రమశిక్షణ స్వీకరిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.
19 ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడుదల చేసినప్పుడు తెచ్చుకున్న పేరుకంటే మరింత గొప్పపేరును యెహోవా తెచ్చుకోబోతున్నాడు. (యెహె. 38:23) గతంలో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని ఎలాగైతే స్వతంత్రించుకున్నారో, అలాగే యెహోవా నమ్మకమైన సేవకులందరూ ఆయన నీతియుక్తమైన నూతనలోకంలో నిత్యజీవాన్ని సొంతం చేసుకుంటారు. (2 పేతు. 3:13) అలాంటి అద్భుతమైన నిరీక్షణ మన ముందుంది కాబట్టి, యెహోవా ఘనమైన నామం పరిశుద్ధపర్చబడాలని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉందాం. తర్వాతి ఆర్టికల్‌లో, మనం ఇప్పుడూ ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలు పొందేందుకు సహాయం చేసే మరో ప్రార్థన గురించి చూస్తాం.