కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు నార్వేలో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు నార్వేలో

ప్రస్తుతం 50వ పడిలో ఉన్న రోవాల్‌, ఎల్సాబెత్‌ అనే దంపతులు కొన్నేళ్ల క్రితం నార్వేలోని రెండవ పెద్ద నగరమైన బెర్గన్‌లో హాయిగా జీవనం సాగిస్తుండేవాళ్లు. కూతురు ఈసాబెల్‌, కొడుకు ఫాబీయన్‌లతో కలసి వాళ్లు సంఘ కార్యకలాపాల్లో నమ్మకంగా పాల్గొనేవాళ్లు. రోవాల్‌ ఓ సంఘ పెద్ద, ఎల్సాబెత్‌ పయినీరు, వాళ్ల పిల్లలు కూడా చురుకైన ప్రచారకులే.

2009 సెప్టెంబరులో, ఆ కుటుంబ సభ్యులు కాస్త కొత్తగా ఉంటుందని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి ఒక వారం పాటు సువార్త ప్రకటించాలనుకున్నారు. రోవాల్‌, ఎల్సాబెత్‌, 18 ఏళ్ల ఫాబీయన్‌ కలిసి, ఆర్కిటిక్‌ వలయానికి దగ్గరగా ఉన్న ఫిన్‌మార్క్‌కు చెందిన నార్కిన్‌ ద్వీపకల్పానికి ప్రయాణమయ్యారు. అక్కడ వాళ్లు తమలాగే వేరే ప్రాంతాల నుండి వచ్చిన సహోదరసహోదరీలతో కలిసి కోలఫ్జర్‌ అనే గ్రామంలో సువార్త ప్రకటించారు. రోవాల్‌ ఇలా అన్నాడు: “ఓ వారమంతా ఈ ప్రత్యేక ఏర్పాటులో పాలుపంచుకునేలా నేను నా పనులన్నిటినీ చక్కబెట్టుకోగలిగినందుకు వారం మొదట్లో ఎంతో సంతోషించాను.” కానీ అదే వారంలో, రోవాల్‌ సంతోషానికి భంగం కలిగింది. ఇంతకీ ఏమి జరిగింది?

ఊహించని ప్రశ్న

“ఫిన్‌మార్క్‌లో పయినీరు సేవచేస్తున్న మార్యో అనే సహోదరుడు, ‘లాక్సల్వ్‌ పట్టణంలో 23మంది ప్రచారకులున్న సంఘానికి సహాయపడేందుకు అక్కడికి వెళ్లడం మీకు ఇష్టమేనా?’ అని హఠాత్తుగా అడిగాడు” అని రోవాల్‌ అన్నాడు. ఊహించని ఆ ప్రశ్నకు రోవాల్‌ నివ్వెరపోయాడు. రోవాల్‌ ఇలా అన్నాడు: “రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న చోటకు వెళ్లి సేవచేయాలని నేను, ఎల్సాబెత్‌ గతంలోనే అనుకున్నాం. కానీ, మా పిల్లలు పెరిగి పెద్దవాళ్లై తమ కాళ్లమీద తాము నిలబడ్డాక అలా చేద్దామనుకున్నాం.” అయితే, ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ గడిపిన ఆ కొన్ని రోజుల్లో అక్కడి ప్రజలు యెహోవా గురించి తెలుసుకోవడానికి సుముఖంగా ఉన్నారని రోవాల్‌ గమనించాడు. వాళ్లకు సహాయం కావాల్సింది ఎప్పుడో కాదు, ఇప్పుడే. “మార్యో వేసిన ప్రశ్న నా మనసును కుదురుగా ఉండనివ్వలేదు, దానివల్ల నేను కొన్ని నిద్ర లేని రాత్రులు గడిపాను” అని రోవాల్‌ గుర్తుచేసుకున్నాడు. మార్యో ఆ తర్వాత రోవాల్‌ని, ఆయన కుటుంబాన్ని కోలఫ్జర్‌కు 240 కి.మీ. దూరంలో ఉన్న లాక్సల్వ్‌ పట్టణానికి తీసుకువెళ్లి అక్కడున్న చిన్న సంఘాన్ని చూపించాడు.

లాక్సల్వ్‌ సంఘంలో ఉన్న ఇద్దరు సంఘ పెద్దల్లో ఒకరైన ఆండ్రేయాస్‌ అతిథులకు ఆ ప్రదేశాన్ని, రాజ్యమందిరాన్ని చూపించాడు. సంఘమంతా వాళ్లను సాదరంగా ఆహ్వానించారు. రాజ్య పనిలో సహాయం చేయడానికి రోవాల్‌ కుటుంబమంతా ఇక్కడికి వచ్చేస్తే ఎంతో సంతోషిస్తామని వాళ్లు రోవాల్‌, ఎల్సాబెత్‌లతో అన్నారు. అప్పటికే రోవాల్‌, ఫాబీయన్‌లకు జాబ్‌ఇంటర్వ్యూ కోసం ఏర్పాట్లు కూడా చేశానని ఆండ్రేయాస్‌ చిరునవ్వుతో చెప్పాడు. మరి వాళ్లు ఏం చేశారు?

వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?

ఫాబీయన్‌ మొదట్లో ఇలా స్పందించాడు: “నాకు అక్కడికి వెళ్లాలని లేదు.” సంఘంలోని చిన్ననాటి స్నేహితులను విడిచిపెట్టి ఓ చిన్న పట్టణంలో నివసించేందుకు వెళ్లడం అతనికి నచ్చలేదు. పైగా అతను చేస్తున్న ఎలక్ట్రిషియన్‌ కోర్సు ఇంకా పూర్తి కాలేదు కూడా. మరోవైపున, ఆ చిన్న పట్టణానికి వెళ్లడం గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని అప్పటికి 21 ఏళ్లున్న ఈసాబెల్‌ను అడిగినప్పుడు, ఆమె ఆనందంతో “సరిగ్గా నేను కోరుకున్నది కూడా అదే!” అని అంది. కానీ, ఆ తర్వాత తనకేమి అనిపించిందో చెబుతూ ఈసాబెల్‌ ఇలా అంది: “దాని గురించి మరింత ఆలోచించినప్పుడు, ‘అక్కడికి వెళ్లడం సరైనదేనా? ఇక్కడి స్నేహితులను విడిచిపెట్టినందుకు బెంగపెట్టుకుంటానా? లేక పరిస్థితులు సక్రమంగా, సజావుగా ఉన్న మా సంఘంలోనే ఉండిపోవాలా?’ అనే ఆలోచనలో పడ్డాను.” మరి ఎల్సాబెత్‌ ఎలా స్పందించింది? ఆమె ఇలా అంది: “యెహోవా మా కుటుంబానికి ఒక బాధ్యతను అప్పగించాడు అని నాకు అనిపించింది. కానీ అదే సమయంలో, ఈ మధ్యే మాకు నచ్చినట్లుగా మార్పులు చేయించుకున్న మా ఇంటి గురించి, పాతిక సంవత్సరాలుగా కష్టపడి మేము సంపాదించుకున్న వస్తువుల గురించి కూడా ఆలోచించాను.”

ఎల్సాబెత్‌, ఈసాబెల్‌

ఆ ప్రత్యేక వారం ముగిశాక రోవాల్‌, ఆయన కుటుంబం తిరిగి బెర్గన్‌కు వచ్చారు.కానీ, ఇంటికి వచ్చాక కూడా వాళ్లు 2,100 కి.మీ. దూరంలో ఉన్న లాక్సల్వ్‌ పట్టణంలోని క్రైస్తవ సహోదరసహోదరీల గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఎల్సాబెత్‌ ఇలా అంది: “నేను చాలాసార్లు యెహోవాకు ప్రార్థించాను. అక్కడ మాకు పరిచయమైన స్నేహితులతో తీసుకున్న ఫోటోలను, మాకు ఎదురైన అనుభవాలను పరస్పరం పంచుకోవడం ద్వారా వాళ్లతో టచ్‌లో ఉన్నాం.” రోవాల్‌ ఇలా అన్నాడు: “అక్కడికి వెళ్లాలనే ఆలోచనను జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అక్కడికి వెళ్లడం ఎంతవరకు సమంజసమో కూడా ఆలోచించాను. అక్కడికి వెళ్తే ఇల్లు ఎలా గడుస్తుంది? నాకు వచ్చిన అలాంటి ఆలోచనలన్నిటినీ యెహోవా ముందు కుమ్మరించాను, నా కుటుంబంతో, అనుభవజ్ఞులైన సహోదరులతో మాట్లాడాను.” ఫాబీయన్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “నేను దాని గురించి ఆలోచించే కొద్దీ, అక్కడికి వెళ్లకపోవడానికి సరైన కారణాలు నాకు కనిపించలేదు. తరచూ యెహోవాకు ప్రార్థించాను, దానివల్ల ఆ ప్రాంతానికి వెళ్లి సేవచేయాలనే నా కోరిక రానురాను బలపడింది.” మరి ఈసాబెల్‌ విషయమేమిటి? సుదూర ప్రాంతానికి వెళ్లి సేవచేయడానికి ముందుగానే బాటలు వేసుకునేలా ఆమె తన సొంత ఊర్లో పయినీరు సేవ మొదలుపెట్టింది. ఆమె ఒకవైపు పయినీరు సేవ చేస్తూనే వ్యక్తిగత అధ్యయనానికి కూడా చాలా సమయాన్ని వెచ్చించింది. అలా ఆరు నెలలు తిరిగేసరికల్లా సుదూర ప్రాంతానికి వెళ్లి సేవచేయగలననే నమ్మకం ఆమెకు కుదిరింది.

లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నారు

రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న చోటకు వెళ్లి సేవచేయాలనే కోరిక బలపడడంతో, ఆ కుటుంబం తమ లక్ష్యం చేరుకోవడానికి తగిన చర్యలు తీసుకుంది. అప్పటికి రోవాల్‌కు మంచి ఆదాయం వచ్చే ఉద్యోగం ఉంది, పైగా ఆ పని ఆయనకు ఎంతో సంతృప్తినిచ్చేది. అయినా, ఒక ఏడాది పాటు సెలవు కావాలని ఆయన తన మేనేజర్‌ను అడిగాడు. అయితే, వాళ్ల మేనేజర్‌ ఆయనను పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా కొనసాగమని చెప్పి ఒక ప్రతిపాదన ఆయన ముందు పెట్టాడు. ఆ ప్రతిపాదన ప్రకారం ఆయన రెండు వారాలు పనిచేసి, ఆరు వారాల పాటు సెలవు తీసుకోవచ్చు, ఆ ఏడాదంతా అదే క్రమంలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనను అంగీకరించిన రోవాల్‌ ఆ తర్వాత ఇలా అన్నాడు: “దానివల్ల, నాకు చాలా తక్కువ జీతం వచ్చినా, మేము మా లక్ష్యాన్ని చేరుకోగలిగాం.”

ఎల్సాబెత్‌ ఇలా అంది: “లాక్సల్వ్‌లో ఉండేందుకు ఓ ఇల్లు చూడమని, అలాగే బెర్గన్‌లో ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చేద్దామని మావారు అన్నారు. వాటికోసం చాలా సమయం పట్టింది, ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయినా, అనుకున్నది చేయగలిగాం. కొంతకాలానికి మా పిల్లలకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు దొరికాయి, అలా వాళ్లు ఖర్చులకు ఆసరాగా ఉండడం మొదలుపెట్టారు.”

ఈసాబెల్‌ ఇలా అంది: “మేము వచ్చేసిన ఊరు చిన్నది. కాబట్టి, పయినీరు సేవను కొనసాగించేందుకు ఓ ఉద్యోగం సంపాదించడం అక్కడ నాకు పెద్ద సవాలుగా అనిపించింది. కొన్నిసార్లైతే, అసలు ఉద్యోగం దొరుకుతుందో లేదో అనిపించింది.” అయినా, దొరికిన ఏ చిన్న ఉద్యోగాన్నైనా చేయడం వల్ల ఆమె తన ఖర్చులను భరించుకోగలిగింది. అక్కడున్న మొదటి సంవత్సరంలో ఆమె మొత్తం తొమ్మిది పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసింది. మరి ఫాబీయన్‌ విషయమేమిటి? “ఎలక్ట్రిషియన్‌ కోర్సును పూర్తిచేసేందుకు, నేను ఇంకా అప్రెంటిస్‌గా పనిచేయాల్సి ఉంది కాబట్టి దాన్ని లాక్సల్వ్‌లో పూర్తి చేశాను. ఆ తర్వాత నేను పరీక్ష పాసయ్యి ఎలక్ట్రిషియన్‌గా ఓ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం సంపాదించుకున్నాను” అని అతను అన్నాడు.

ఇతరులు తమ సేవను ఎలా విస్తృతపర్చుకున్నారు

నార్వేలోని సమీ ప్రాంతంలో ఓ స్త్రీకి సాక్ష్యమిస్తున్న మారెల్యస్‌, కెసీయా

మారెల్యస్‌, ఆయన భార్య కెసీయా కూడా రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న చోట సేవచేయాలనుకున్నారు. 29 ఏళ్ల మారెల్యస్‌ ఇలా అన్నాడు: “సమావేశాల్లో పయినీరు సేవకు సంబంధించిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు వినడం వల్ల నేను నా సేవను విస్తృతపర్చుకోవాలనే ఆలోచనలోపడ్డాను.”అయితే, కుటుంబానికి దూరంగా ఉండడం 26 ఏళ్ల కెసీయాకు ఓ పెద్ద సవాలు.ఆత్మీయులైన నా వాళ్లకు దూరంగా ఉండాలనే ఆలోచన నాలో భయాన్ని రేపింది. పైగా ఇంటిమీద ఉన్న అప్పును తీర్చడానికి మారెల్యస్‌ ఫుల్‌టైం జాబ్‌ చేసేవాడు. ఆయన ఇలా అన్నాడు: “తగిన మార్పులు చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ఎన్నోసార్లు ప్రార్థించి, ఆయన సహాయంతో మేము ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న చోటికి వెళ్లగలిగాం.” ముందుగా వాళ్లు బైబిలు అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చించారు. తర్వాత కొంతకాలానికి, వాళ్లు తమ ఇంటిని అమ్మేశారు, ఉద్యోగాలను వదిలేశారు, చివరకు 2011 ఆగస్టులో ఉత్తర నార్వేలోని ఆల్టా నగరానికి తరలివెళ్లారు. అక్కడ పయినీర్లుగా సేవచేస్తూ తమను తాము పోషించుకోవడానికి మారెల్యస్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు, కెసీయా ఓ షాపులో పనిచేస్తోంది.

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న నూట్‌, లీస్‌బెట్‌ అనే దంపతులు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేసేవాళ్ల అనుభవాలను వార్షిక పుస్తకంలో చదివి ప్రేరణ పొందారు. లీస్‌బెట్‌ ఇలా అంది: “వేరే దేశాల్లో సేవచేయడం గురించి ఆలోచించేలా ఆ అనుభవాలు మమ్మల్ని పురికొల్పాయి. కానీ, సాధారణ వ్యక్తినైన నేను ఆ పని చేయగలనా అని కొంత తటపటాయించాను.” అయినా, వాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. నూట్‌ ఇలా అన్నాడు: “మేము మా ఇంటిని అమ్మేసి, డబ్బు ఆదా చేయడం కోసం మా అమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నాం. ఆ తర్వాత, వేరే దేశాల్లో సేవచేయడం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు, బెర్గన్‌లోని ఆంగ్లభాషా సంఘానికి మారాం. అక్కడ ఓ సంవత్సరం పాటు మేము మా అత్తగారింట్లో ఉన్నాం.” కొంతకాలానికే, నూట్‌ లీస్‌బెట్‌లు ఉగాండాకు వెళ్లి సేవ చేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్లు సంవత్సరానికి ఒకసారి రెండు నెలల పాటు ఉద్యోగం చేయడానికి నార్వేకు తిరిగి వస్తుంటారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో, వాళ్లు మిగతా పది నెలల పాటు ఉగాండాలో తమను తాము పోషించుకుంటూ, ప్రకటనాపనిలో పూర్తిగా నిమగ్నమౌతారు.

‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి’

“మేము ఒకరికొకరం మరింత దగ్గరయ్యాం.”—రోవాల్‌

అవసరమున్న చోట సేవ చేయడానికి మనస్ఫూర్తిగా వెళ్లినవాళ్లు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?రోవాల్‌ ఇలా అన్నాడు: “మేము బెర్గన్‌లో ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఈ మారుమూల ప్రాంతంలో కుటుంబంగా కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం. మేము ఒకరికొకరం మరింత దగ్గరయ్యాం. మా పిల్లలు ఆధ్యాత్మిక పురోగతి సాధించడం చూసి ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మేము వస్తుపరమైన విషయాల గురించి అంతగా చింతించడం లేదు. వాటికి అంత విలువ లేదని గ్రహించాం.”

మరో భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎల్సాబెత్‌ గ్రహించింది. ఎందుకు? లాక్సల్వ్‌ సంఘ క్షేత్ర పరిధిలో ఉన్న సమీ అనే ప్రాంతంలో కారస్యోక్‌ అనే గ్రామం ఉంది. అక్కడ నార్వే, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, రష్యా దేశాల్లోని ఉత్తర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన సమీ భాషా ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రజలకు ప్రకటించేందుకు వీలుగా ఎల్సాబెత్‌ సమీ భాషా కోర్సు తీసుకుంది. దానివల్ల ఆమె ఇప్పుడు ప్రజలతో ఆ భాషలో కొంచెంకొంచెం మాట్లాడగలుగుతోంది. మరి ఆ కొత్త క్షేత్రంలో ఆమె పరిచర్య ఎలా ఉంది? ఆమె ఆనందోత్సాహాలతో ఇలా చెప్పింది: “నేను ఇప్పుడు ఆరు బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాను. నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను!”

సంఘ కార్యకలాపాల్లో మరింతగా పాల్గొనేందుకు ప్రోత్సాహం అవసరమైన ముగ్గురు యువతీయువకులకు తాను, ఈసాబెల్‌ సహాయం చేశామని ఫాబీయన్‌ చెబుతున్నాడు. ఫాబీయన్‌ ప్రస్తుతం పయినీరుగా, పరిచర్య సేవకునిగా సేవచేస్తున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు యువతీయువకులు పరిచర్యలో చురుగ్గా పాల్గొంటున్నారు. వాళ్లలో ఇద్దరు బాప్తిస్మం తీసుకొని 2012 మార్చి నెలలో సహాయ పయినీరు సేవచేశారు. సత్యం నుండి దూరంగా వెళ్తున్న తనకు మళ్లీ సత్యంలో స్థిరంగా నిలబడేలా సహాయం చేసినందుకు ఆ ముగ్గురిలో ఒక యువతి ఫాబీయన్‌, ఈసాబెల్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. ఫాబీయన్‌ ఇలా అన్నాడు: “ఆమె ఆ విషయాన్ని చెప్పినప్పుడు నేను నిజంగా చలించిపోయాను. ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు మనం ఎంత సంతోషాన్ని పొందుతామో కదా!” ఈసాబెల్‌ ఇలా అంది: “నేను ఇక్కడికి వచ్చి సేవచేయడం ద్వారా, నిజంగా ‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను.’” (కీర్త. 34:8) “ఇక్కడ సేవచేయడం నాకు చాలా సరదాగా ఉంది!” అని కూడా ఆమె అంది.

మారెల్యస్‌, కెసీయా ఇప్పుడు నిరాడంబరంగా జీవిస్తున్నప్పటికీ ఎంతో సంతృప్తిని పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్లు సేవచేస్తున్న ఆల్టాలోని సంఘంలో 41 మంది ప్రచారకులు ఉన్నారు. మారెల్యస్‌ ఇలా అన్నాడు: “మా జీవితం ఎంతగా మారిపోయిందో క్షణమాగి ఆలోచిస్తే చాలా ప్రోత్సాహం కలుగుతోంది. పయినీర్లుగా ఇక్కడ యెహోవా సేవ చేయగలుగుతున్నందుకు ఆయనకు కృతజ్ఞులం. ఇంతకన్నా సంతృప్తికరమైనది మరొకటి ఉండదు!” దానికి కెసీయా మాటలు జోడిస్తూ ఇలా అంది: “యెహోవా మీద మరింత పూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాను. నిజంగా ఆయన మాకు ఏ లోటూ రానివ్వలేదు. బంధుమిత్రుల నుండి దూరంగా ఉండడం వల్ల, వాళ్లతో గడిపే కొన్ని క్షణాలు మరింత అమూల్యంగా అనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే విషయంలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ఏనాడూ బాధపడలేదు.”

ఉగాండాలో ఓ కుటుంబంతో బైబిలు అధ్యయనం చేస్తున్న నూట్‌, లీస్‌బెట్‌

మరి ఉగాండాలో సేవచేస్తున్న నూట్‌, లీస్‌బెట్‌ల విషయమేమిటి? నూట్‌ ఇలా అంటున్నాడు: “కొత్త వాతావరణానికి, సంస్కృతికి అలవాటుపడడానికి కాస్త సమయం పట్టింది. నీటి సమస్య, కరెంటు కోత, ఆరోగ్య సమస్యలు వచ్చి పోతుంటాయి. కానీ, మాకు చేతినిండా కావాల్సినన్ని బైబిలు అధ్యయనాలు ఉన్నాయి.” లీస్‌బెట్‌ ఇలా అంటోంది: “మేము ఉంటున్న ప్రాంతం నుండి అరగంట ప్రయాణ దూరంలో, ఇప్పటివరకు సువార్త చేరని ప్రాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ, మేము అక్కడికి వెళ్లినప్పుడు, బైబిలు చదువుతూ తమకు బైబిలు గురించి నేర్పించమని అడిగే ప్రజలు చాలామంది తారసపడుతుంటారు. వినయంగల అలాంటి ప్రజలకు బైబిలు సందేశాన్ని బోధించడం వల్ల కలిగే ఆనందాన్ని మరిదేనితోనూ పోల్చలేం.”

ఈ భూమ్మీదున్నప్పుడు తాను ప్రారంభించిన సువార్త ప్రకటనా పని ప్రపంచ నలుమూలలా విస్తరించడం చూసి పరలోకంలో ఉన్న మన నాయకుడైన క్రీస్తుయేసు ఎంత సంతోషిస్తున్నాడో కదా! అవును, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి సంతోషంగా తమ జీవితాల్ని అంకితం చేసుకుంటున్న వాళ్లను చూస్తే దేవుని ప్రజలందరికీ మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది.—మత్త. 28:19, 20.