కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | తల్లిదండ్రులు

సెక్స్‌ గురించి మీ పిల్లలకు చెప్పండి

సెక్స్‌ గురించి మీ పిల్లలకు చెప్పండి

సమస్య

ఒకప్పుడు, కొడుకుకి లేదా కూతురికి సెక్స్‌ గురించి మొదట చెప్పే అవకాశం తల్లిదండ్రులకు దొరికేది. పిల్లల వయసును బట్టి, పరిస్థితుల్ని బట్టి వాళ్లు కొద్దికొద్దిగా వివరించేవాళ్లు.

కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. “నేడు విరివిగా ఉన్న సెక్స్‌ సమాచారం చాలా చిన్న వయసులోనే పిల్లలకు కూడా అందుబాటులో ఉంది, పిల్లలు వినే వాటిలో, చూసే వాటిలో సెక్స్‌కు సంబంధించిన విషయాలు ఎక్కువైపోతున్నాయి,” అని The Lolita Effect అనే పుస్తకం చెప్తుంది. మారిపోయిన ఈ పరిస్థితులు పిల్లలకు మంచి చేస్తాయా? లేదా హాని చేస్తాయా?

మీరు తెలుసుకోవాల్సినవి

మన చుట్టూ అలాంటి విషయాలే ఉన్నాయి. Talk to Me First, అనే పుస్తకంలో దెబ్ర రాఫ్‌మాన్‌ ఇలా రాసింది: “కంప్యూటర్‌ స్క్రీన్ల మీద, మాటల్లో, ఎడ్వర్టైస్మెంట్లలో, సినిమాల్లో, పుస్తకాల్లో, పాటల పదాల్లో, టి.వి. కార్యక్రమాల్లో, మేసేజ్‌ల్లో, ఆటల్లో, హోర్డింగ్‌లలో లేదా బ్యానర్లలో, ఫోన్లలో ఉంటున్న సెక్స్‌ బొమ్మలు, మాటలు, అసభ్యకరమైన సమాచారం చాలామంది [టీనేజర్లు, అంతకన్నా చిన్న పిల్లలు, బాగా చిన్నపిల్లలు కూడా] వాళ్లకు తెలియకుండానే సెక్స్‌ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అని అనుకునేలా చేస్తున్నాయి.”

మార్కెటింగ్‌ కొంతవరకు కారణం. ఎడ్వర్టైస్మెంట్‌ ఇచ్చేవాళ్లు, షాపుల వాళ్లు పిల్లలు సెక్సీగా కనిపించే బట్టలు అమ్ముతున్నారు. చూడడానికి ఎలా ఉన్నాం అని పిల్లలు చిన్న వయసు నుండే అనవసరంగా ఆలోచించేలా చేస్తున్నారు. “మార్కెటింగ్‌ చేసేవాళ్లకు చిన్నపిల్లల్లో సహజంగా ఉండే కోరికలు తెలుసు, వాళ్లు దాన్ని వాడుకుంటున్నారు. ఈ సెక్స్‌ బొమ్మలు, వస్తువులు అన్నీ పిల్లలు సెక్స్‌ ఇష్టపడాలని కాదు, పిల్లలు కొత్త వస్తువులు కొనుక్కోవాలని” అని So Sexy So Soon అనే పుస్తకం చెప్తుంది.

తెలిసుంటే సరిపోదు. కారు ఎలా నడపాలో తెలిసి ఉండడానికీ కారు జాగ్రత్తగా నడిపే డ్రైవర్‌గా ఉండడానికి చాలా తేడా ఉంది. అలాగే సెక్స్‌ గురించి అవగాహన ఉండడానికీ ఆ అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా తేడా ఉంది.

ఒక మాట: ఇంతకు ముందుకన్నా ఇప్పుడు జ్ఞానేంద్రియములు సాధకము చేసుకునేలా మీ పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. అప్పుడు “మేలు కీడులను” వివేచించగలుగుతారు.—హెబ్రీయులు 5:14.

ఏమి చేయవచ్చు

మాట్లాడడం మీ బాధ్యత. ఎంత ఇబ్బందిగా అనిపించినా, సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడడం మీ బాధ్యత. దాన్ని గుర్తించండి.—మంచి సలహా: సామెతలు 22:6.

అంతా ఒక్కసారే మాట్లాడేయకండి. సెక్స్‌ గురించి అంతా ఒకేసారి చెప్పేయకుండా వచ్చిన చిన్నచిన్న అవకాశాలను ఉపయోగించుకోండి. మీ అబ్బాయి లేదా అమ్మాయితో కారులో ప్రయాణిస్తున్నప్పుడు, కలిసి ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు మాట్లాడండి. మీ పిల్లల మనసులో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి సరైన ప్రశ్నలు అడగండి. ఉదాహరణకు, “ఇలాంటి ఎడ్వర్టైస్మెంట్స్‌ నీకు ఇష్టమా?” అని అడిగే బదులు, “ఎడ్వర్టైస్మెంట్‌ ఇచ్చేవాళ్లు వస్తువులు అమ్ముకోవడానికి ఇలాంటి బొమ్మలను ఎందుకు ఉపయోగిస్తారు?” అని అడగవచ్చు. మీ బాబు లేదా పాప జవాబు చెప్పాక, ఇలా అడగండి: “ఇది నీకు ఎలా అనిపిస్తుంది?”—మంచి సలహా: ద్వితీయోపదేశకాండము 6:6, 7.

వయసును బట్టి చెప్పండి. ఇంకా స్కూల్లో చేరని చిన్న పిల్లలకు కూడా సెక్స్‌ అవయవాల సరైన పేర్లు చెప్పాలి, లైంగికంగా దాడిచేసే వాళ్ల నుండి వచ్చే ప్రమాదాల నుండి వాళ్లనువాళ్లు ఎలా కాపాడుకోవాలో చెప్పాలి. పిల్లలు ఎలా పుడతారనే విషయం గురించి మీ పిల్లలు పెద్దవాళ్లు అవుతుండగా కొన్ని ముఖ్యమైన నిజాలు చెప్పండి. ఎదిగే వయసు వచ్చే సరికి, సెక్స్‌కు సంబంధించిన శారీరక, నైతిక విషయాలు పిల్లలకు దాదాపు తెలుసుండాలి.

విలువలు నేర్పించండి. మీ పిల్లలకు చాలా చిన్న వయసు నుండే నిజాయితీ, యథార్థత, గౌరవం గురించి నేర్పించడం మొదలుపెట్టండి. అలాచేస్తే సెక్స్‌ గురించి వాళ్లకు చెప్పే వయసు వచ్చేసరికి మీరు మంచి పునాది వేసినట్లు అవుతుంది. మీ విలువల గురించి స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పండి. ఉదాహరణకు, పెళ్లికి ముందు సెక్స్‌ తప్పని మీరు భావిస్తే దాన్ని మీ పిల్లలకు చెప్పండి. అది ఎందుకు తప్పో, దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటో వివరించండి. “టీనేజర్ల మధ్య సెక్స్‌ మా తల్లిదండ్రులకు ఇష్టం ఉండదని మాకు తెలుసు అని చెప్పే టీనేజర్లు సెక్స్‌లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ” అని Beyond the Big Talk అనే పుస్తకం చెప్తుంది.

మీరు చెప్పిన వాటిని మీరు పాటించండి. మీరు నేర్పించిన విలువలకు తగ్గట్టుగా మీరు జీవించాలి. ఉదాహరణకు, అసభ్యంగా ఉండే జోకులు చూసి మీరు నవ్వుతున్నారా? మీరు వేసుకునే బట్టలు ఇతరులను రెచ్చగొట్టేలా ఉన్నాయా? మీరు వేరేవాళ్లతో సరసాలు లేదా ఫ్లర్టింగ్‌ చేస్తారా? మీరు ఇలాంటి పనులు చేస్తే, మీ పిల్లలకు నేర్పించిన నైతిక విలువలను మీరే పాడుచేస్తున్నారు.—మంచి సలహా: రోమీయులు 2:21.

సరైన దృష్టితో చూడండి. సెక్స్‌, దేవుడు ఇచ్చిన ఒక బహుమతి, సరైన పరిస్థితుల్లో, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ల మధ్యలో ఉంటేనే అది ఎంతో ఆనందాన్ని ఇవ్వగలదు. (సామెతలు 5:18, 19) సమయం వచ్చినప్పుడు ఆ బహుమానాన్ని వాళ్లు కూడా ఆనందించవచ్చని మీ అమ్మాయికి లేదా అబ్బాయికి చెప్పండి. పెళ్లికి ముందు సెక్స్‌ వల్ల వచ్చే గుండెకోత నుండి, కష్టాలు నుండి తప్పించుకోవచ్చు అని మీ పిల్లలకు చెప్పండి.—1 తిమోతి 1:18, 19. ◼ (g16-E No. 5)