కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈస్ట్‌ కణంలో ఒక కేంద్రకం (nucleus), DNAతోపాటు మామూలు కంటికి కనిపించని ఒక పెద్ద వ్యవస్థే ఉంటుంది. కణానికి అవసరమైన పోషకాల్ని అందించడం, ఇతర జీవ ప్రక్రియలు జరపడం లాంటివి ఆ వ్యవస్థ చూసుకుంటుంది.

జీవం ఏం రుజువు చేస్తుంది?

జీవం ఏం రుజువు చేస్తుంది?

ప్రాణం ఉండే ప్రతీది పెరుగుతుంది, కదులుతుంది, సంఖ్యను పెంచుకుంటుంది. అవి మన భూమికి ఒక ప్రత్యేకతను, అందాన్ని తెస్తున్నాయి. పరిశోధనల వల్ల ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు, మనుషులకు ప్రాణుల గురించి ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. ఇంతకీ, జీవం ఎలా వచ్చిందని ప్రాణులు రుజువు చేస్తున్నాయి? వీటి గురించి ఆలోచించండి:

జీవం దానంతటదే రాలేదని తెలుస్తోంది. ప్రతీ ప్రాణి కణాలతో రూపొందించబడింది. ఒకవిధంగా, ఈ కణాలను చిన్నసైజు ఫ్యాక్టరీలతో పోల్చవచ్చు. అవి మన మేధస్సుకు మించిన ఎన్నో వేల పనుల్ని చేస్తూ ఉంటాయి; ప్రాణులు జీవించడానికి, వాటి సంఖ్యను పెంచుకోవడానికి ఈ పనులు సహాయం చేస్తాయి. ప్రాణి ఎంత చిన్నదైనా అందులో జరిగే జీవ ప్రక్రియలు అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటాయి. ఉదాహరణకు, బ్రెడ్‌ తయారుచేయడానికి వాడే ఈస్ట్‌ (yeast) విషయాన్నే తీసుకుందాం. ఈస్ట్‌ అనేది ఒక చిన్న ప్రాణి; అందులో ఒకే ఒక్క కణం ఉంటుంది. మనుషుల్లో ఉండే కణాలతో పోలిస్తే ఈస్ట్‌ కణాన్ని అర్థంచేసుకోవడం తేలికని అనిపించవచ్చు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఈస్ట్‌ కణంలో ఒక కేంద్రకం (nucleus), DNAతోపాటు మామూలు కంటికి కనిపించని ఒక పెద్ద వ్యవస్థే ఉంటుంది. కణానికి అవసరమైన పోషకాల్ని అందించడం, ఇతర జీవ ప్రక్రియలు జరపడం లాంటివి ఆ వ్యవస్థ చూసుకుంటుంది. ఒకవేళ పోషకాలు అందుబాటులో లేకపోతే, ఈస్ట్‌ కణం దానిలో జరిగే ప్రక్రియలన్నిటినీ ఆపేస్తుంది (ఇంకోలా చెప్పాలంటే, inactive అయిపోతుంది). అందుకే ఈస్ట్‌ని కిచెన్‌లో ఎంతకాలమైనా భద్రపర్చుకోవచ్చు. అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీసి వాడితే, ఆగిపోయిన ప్రక్రియలు మళ్లీ పనిచేయడం మొదలౌతాయి.

మనిషి శరీరంలోని కణాల పనితీరును మరింత బాగా అర్థంచేసుకోవడానికి, సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా ఈస్ట్‌ కణాల్ని స్టడీ చేస్తున్నారు. అయితే వాళ్లకు అర్థంకాని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. స్వీడెన్‌లో ఉన్న చాల్మర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాస్‌ కింగ్‌ ఇలా అన్నారు: “కేవలం ఒక్క కణంతో జీవించే ఈస్ట్‌ పనితీరు తెలుసుకోవాలంటేనే ఎన్నో పరిశోధనలు చేయాలి. వాటన్నిటిని చేయడానికి సరిపడా బయోలజిస్టులు మన దగ్గర లేరు.”

ఒక్క కణం ఉండే ఈస్ట్‌ లాంటి చిన్న ప్రాణిలోనే మనం అర్థం చేసుకోలేనన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి కదా! మరి, మీరేమంటారు? సైంటిస్టుల ఊహకే అందని ఈస్ట్‌ కణం దానంతటదే పుట్టుకొచ్చి ఉంటుందా?

నిర్జీవమైనదాని నుండి జీవం రావడం సాధ్యంకాదు. న్యూక్లియోటైడ్స్‌ అనే అణువులతో DNA తయారౌతుంది. మనిషి శరీరంలోని ఒక్కో కణంలో 320 కోట్ల న్యూక్లియోటైడ్‌లు ఉంటాయి. ఇవన్నీ ఒక పద్ధతిలో ఏర్పడినప్పుడే మన శరీరంలో ఎంజైమ్‌లు, ప్రొటీన్లు తయారౌతాయి.

అన్నిటికన్నా సింపుల్‌ న్యూక్లియోటైడ్‌ స్ట్రాండ్‌నే తీసుకుంటే, అవి అనుకోకుండా వాటంతటవే ఒక క్రమపద్ధతిలో ఏర్పడి DNAగా తయారయ్యే అవకాశం, 10150⁠లో (1 పక్కన 150 సున్నాలు) 1 అని అంచనా. అంటే అలాంటిది జరగడం అసంభవం.

వాస్తవం ఏంటంటే, ఇప్పటిదాకా సైంటిస్టులు చేసిన పరిశోధనలేవీ నిర్జీవమైనదాని నుండి జీవం పుట్టగలదని నిరూపించలేదు.

మనిషి జాతి చాలా ప్రత్యేకమైనది. మనుషులుగా మనకున్నలాంటి సామర్థ్యాలు మిగతా ఏ ప్రాణులకు లేవు. పాడడం, బొమ్మలేయడం, స్నేహితుల్ని చేసుకోవడం, ఫీలింగ్స్‌ బయటికి చెప్పడం లాంటివి మనం మాత్రమే చేయగలం. వాసనల్ని, రుచుల్ని, శబ్దాల్ని, రంగుల్ని, రకరకాల ప్రదేశాల్ని గుర్తించగలం, ఆనందించగలం. రేపు ఏం చేయాలి, ఎలా సంతోషంగా జీవించాలి లాంటి విషయాల్ని ముందే ఆలోచించి, దాని ప్రకారం చేయగలం.

మీరేమంటారు? ఈ సామర్థ్యాలు మనకు నిజంగా అవసరమా? అవి లేకపోతే మనం జీవించడం, పిల్లల్ని కనడం సాధ్యం కాదా? లేదా, మనం జీవితాన్ని సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో, సృష్టికర్తే మనకు ఆ సామర్థ్యాల్ని ప్రేమతో గిఫ్టుగా ఇచ్చాడా?