కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎప్పుడూ జీవించేలా తయారు చేయబడ్డాం

మనం ఎప్పుడూ జీవించేలా తయారు చేయబడ్డాం

ఎక్కువ కాలం సంతోషంగా జీవించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మనం ఆరోగ్యంగా, సంతోషంగా నిరంతరం జీవిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎప్పుడూ మనం ప్రేమించే మనవాళ్లతో ఉండవచ్చు, ప్రపంచాన్ని చుట్టిరావచ్చు, కొత్తకొత్త పనులు నేర్చుకోవచ్చు, తెలివిని పెంచుకోవచ్చు, మనకు ఆసక్తి ఉన్నవాటి గురించి మనకిష్టమైనంత ఎక్కువగా నేర్చుకోవచ్చు.

ఇలా కోరుకోవడం తప్పా? అస్సలు కాదు! దేవుడే మన హృదయాల్లో ఆ కోరికను పెట్టాడని లేఖనాలు చెప్తున్నాయి. (ప్రసంగి 3:11) “దేవుడు ప్రేమ” అని కూడా అవి చెప్తున్నాయి. (1 యోహాను 4:8) నిరంతర జీవితం మనకెప్పటికీ సాధ్యం కాకపోతే, ప్రేమగల దేవుడు మనలో ఆ కోరికను ఎందుకు పెడతాడు?

ఒకటి మాత్రం నిజం, మరణం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మరణం, పిలవకుండా వచ్చే ఒక “శత్రువు” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 15:26) అది కొంతమంది దగ్గరికి త్వరగా వస్తుంది, కొంతమంది దగ్గరికి ఆలస్యంగా వస్తుంది. కానీ రాకుండా మాత్రం ఉండదు. చాలామంది మరణం గురించి ఆలోచించడానికే ఇబ్బంది పడతారు, చాలా భయపడతారు కూడా. ఈ శత్రువును ఓడించడం ఎప్పటికైనా సాధ్యమేనా?

నిరంతరం జీవిస్తాం అనడానికి రుజువులు

మనుషులు చనిపోవాలనేది దేవుని ఉద్దేశమే కాదంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మనుషులు భూమి మీద నిరంతరం జీవించాలనేది దేవుని ఉద్దేశం అని చెప్పే రుజువులు బైబిలు పుస్తకమైన ఆదికాండములో మనకు కనిపిస్తాయి. మనుషులు జీవించడానికి అనువుగా ఉండేలా దేవుడు భూమిని ఎంతో జాగ్రత్తగా తయారుచేశాడు. ఆ తర్వాత ఆయన మొదటి మనిషైన ఆదామును చేసి, ఆయన్ని పరదైసులో, అంటే ఏదెను అనే ఒక తోటలో పెట్టాడు. అప్పుడు ‘దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ ఉండెను.’—ఆదికాండము 1:26, 31.

ఆదాము దేవుని స్వరూపంలో, ఏ లోపం లేకుండా సృష్టించబడ్డాడు. (ద్వితీయోపదేశకాండము 32:4) ఆదాము భార్యయైన హవ్వ కూడా ఎటువంటి లోపం లేకుండా పరిపూర్ణమైన మనసుతో, శరీరంతో సృష్టించబడింది. యెహోవా వాళ్లతో, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని” చెప్పాడు.—ఆదికాండము 1:28.

ఆదాముహవ్వలు తమ పిల్లలతో భూమిని నింపడానికి సమయం పడుతుంది. హవ్వ పిల్లల్ని కంటుంది, ఆ పిల్లలు పిల్లల్ని కంటారు. అలా చివరికి దేవుడు అనుకున్న విధంగా భూమి పూర్తిగా నిండిపోతుంది. (యెషయా 45:18) కానీ ఆదాముహవ్వలకు వాళ్ల పిల్లల్ని, మనవళ్లు మనవరాళ్లని చూసేంత ఆయుష్షు మాత్రమే ఉండి, ఆ తర్వాత ఏమి జరుగుతుందో తెలియకపోతే యెహోవా వాళ్లతో ఆ మాటలు చెప్పేవాడా?

జంతువుల్ని ఏలమని దేవుడు చెప్పిన మాట గురించి కూడా ఆలోచించండి. జంతువులకు పేర్లు పెట్టమని దేవుడు ఆదాముకు చెప్పాడు, అందుకు సమయం పడుతుంది. (ఆదికాండము 2:19) జంతువుల్ని ఏలాలంటే ముందు వాటి గురించి తెలుసుకోవాలి, వాటిని ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోవాలి. వీటన్నిటికి చాలా సమయం పడుతుంది.

భూమిని నింపమని, జంతువులను ఏలమని దేవుడు మొదటి మనుషులకు చెప్పిన మాటలను చూస్తే ఆ మొదటి మానవ జంట ఎక్కువ కాలం జీవించేలా తయారు చేయబడ్డారని మనకు అర్థం అవుతుంది. నిజంగానే ఆదాము చాలాకాలం జీవించాడు.

మనుషులు భూమ్మీద పరదైసులో నిరంతరం జీవించాలనేది దేవుని ఉద్దేశం

వాళ్లు చాలాకాలం జీవించారు

ఆదాము, 930 ఏళ్లు

మెతూషెల, 969 ఏళ్లు

నోవహు, 950 ఏళ్లు

ఇప్పుడు, 70-80 ఏళ్లు

మనుషులు ఒకప్పుడు మనకన్నా చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించారని బైబిలు చెప్తుంది. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడని బైబిలు చెప్తుంది. ఆ తర్వాత 900 కన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఇంకో ఆరుగురి గురించి కూడా బైబిలు చెప్తుంది. వాళ్ల పేర్లు: షేతు, ఎనోషు, కేయినాను, యెరెదు, మెతూషెల, నోవహు. వాళ్లంతా నోవహు కాలంలో వచ్చిన జలప్రళయానికి ముందు జీవించారు, జలప్రళయం రాకముందు నోవహుకు 600 సంవత్సరాలు. (ఆదికాండము 5:5-27; 7:6; 9:29) అంత కాలం జీవించడం ఎలా సాధ్యమైంది?

వీళ్లంతా మనుషులు పరిపూర్ణతకు దగ్గరగా ఉన్న కాలంలో జీవించారు. వాళ్లు ఎక్కువ కాలం జీవించడానికి అదే ముఖ్యమైన కారణం అయ్యుంటుంది. కానీ పరిపూర్ణతకు, ఎక్కువ కాలం జీవించడానికి సంబంధం ఏంటి? మరణమనే శత్రువును ఎలా ఓడించవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ముందు మనం ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నామో తెలుసుకోవాలి.