కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లోకాంతం ఎప్పుడొస్తుంది? దాని గురించి యేసు ఏం చెప్పాడు?

లోకాంతం ఎప్పుడొస్తుంది? దాని గురించి యేసు ఏం చెప్పాడు?

లోకాంతం గురించి బైబిలు మాట్లాడుతున్నప్పుడు, భూమి గానీ మనుషులు గానీ నాశనం కారని మనం ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. బదులుగా ఇప్పుడున్న చెడ్డ పరిస్థితులు, వాటికి మద్దతిస్తున్న చెడ్డ ప్రజలు నాశనమవుతారని దానర్థం. మరి ఈ చెడ్డ పరిస్థితులన్నీ ఎప్పుడు నాశనమౌతాయో బైబిలు ఏమైనా చెప్తుందా?

అంతం గురించి యేసు చెప్పిన ఈ రెండు విషయాలు పరిశీలించండి:

“కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు.”—మత్తయి 25:13.

“ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు కాబట్టి అప్రమత్తంగా, మెలకువగా ఉండండి.”—మార్కు 13:33.

కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు అంతమవుతాయో భూమ్మీద ఉన్న ఎవ్వరికీ తెలీదు. కానీ అంతం రావడానికి దేవుడు “నియమిత కాలాన్ని” అంటే ఖచ్చితమైన “ఒక రోజును, గంటను” నిర్ణయించాడు. (మత్తయి 24:36) అంటే అంతం ఎంత దగ్గర్లో ఉందో తెలుసుకోవడం కష్టమని దానర్థమా? కానేకాదు. అంతం దగ్గర్లో ఉందని సూచించే చాలా సంఘటనల్ని యేసు తన శిష్యులకు ముందే చెప్పాడు.

యేసు చెప్పిన సూచన

ఈ సంఘటనలు “ఈ వ్యవస్థ ముగింపుకు” సూచనగా ఉన్నాయి. దాని గురించి యేసు ఇలా చెప్పాడు: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి.” (మత్తయి 24:3, 7) ఇంకా “తెగుళ్లు” అంటే అంటువ్యాధులు కూడా వస్తాయని ఆయన చెప్పాడు. (లూకా 21:11) యేసు చెప్పిన ఆ సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నట్టు మీరు గమనిస్తున్నారా?

ప్రజలు యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అలాగే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న వ్యాధుల వల్ల చాలా బాధలుపడుతున్నారు. ఉదాహరణకు 2004లో హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద సునామి వచ్చింది. దాని వల్ల 2,25,000 మంది ప్రజలు ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. కోవిడ్‌-19 మహమ్మారి వల్ల మూడు సంవత్సరాల్లో 69 లక్షలమంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. కాబట్టి యేసు చెప్పిన ఈ సంఘటనలు ఈ లోకంలోని చెడ్డ పరిస్థితులకు అంతం దగ్గరపడిందని చూపిస్తున్నాయి.

“చివరి రోజులు”

అంతం రావడానికి ముందున్న సమయాన్ని బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తోంది. (2 పేతురు 3:3, 4) రెండవ తిమోతి 3:1-5 చెప్తున్నట్టు, ప్రజలు నైతిక ప్రమాణాల్ని పట్టించుకోరనే విషయం, మనం “చివరి రోజుల్లో” ఉన్నామనడానికి ఒక గుర్తుగా ఉంది. (“ లోకాంతానికి కొంచెం ముందు” అనే బాక్సు చూడండి.) అంతేకాదు స్వార్థం, అత్యాశ, క్రూరత్వం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోవడం వంటి లక్షణాలున్న ప్రజలను ఇప్పుడు మీరు చూస్తున్నారా? మనం లోకాంతానికి దగ్గర్లో ఉన్నామని చెప్పడానికి ఇది కూడా ఒక రుజువు.

చివరి రోజులు ఎంతకాలం ఉంటాయి? “కొంచెం సమయమే” లేదా కొంతకాలమే ఉంటాయని బైబిలు చెప్తుంది. ఆ తర్వాత దేవుడు, ‘భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేస్తాడు.’—ప్రకటన 11:15-18, 12:12.

పరదైసు భూమి దగ్గరలో ఉంది!

చెడ్డ పరిస్థితులకు అంతం తీసుకురావడానికి దేవుడు ఇప్పటికే ఒక రోజును లేదా గంటను నిర్ణయించాడు. (మత్తయి 24:36) అయితే, మంచి విషయం ఏంటంటే దేవునికి, “ఎవరూ నాశనం అవ్వడం ఇష్టం లేదు.” (2 పేతురు 3:9) దేవుని ఇష్టం ఏంటో తెలుసుకుని తనకు లోబడే అవకాశాన్ని మనుషులందరికీ ఇస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఈ లోకాంతాన్ని తప్పించుకుని, పరదైసు భూమ్మీద మనందరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.

దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఒక విద్యా పనిని ఏర్పాటు చేశాడు. దానివల్ల తన రాజ్యం తెచ్చే కొత్త లోకంలో జీవించాలంటే ఏం చేయాలో ప్రజలకు నేర్పిస్తున్నాడు. దేవుని రాజ్యం గురించిన మంచివార్త “భూమంతటా ప్రకటించబడుతుందని” యేసు చెప్పాడు. (మత్తయి 24:14) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ప్రజల్లో ఆశను నింపే బైబిలు సందేశాన్ని ప్రకటించడంలో, బోధించడంలో కొన్ని కోట్ల గంటలు గడుపుతారు. అంతం రాకముందే ఈ ప్రకటనా పని భూమంతటా జరుగుతుందని యేసు చెప్పాడు.

మానవ పరిపాలనకు అంతం చాలా దగ్గర పడింది. కానీ మంచి విషయం ఏంటంటే, మీరు లోకాంతం నుంచి తప్పించుకుని దేవుడు మాటిచ్చిన పరదైసు భూమ్మీద జీవించగలరు. అయితే కొత్త లోకంలో జీవించాలంటే మీరేం చేయాలో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

“చివరి రోజుల” గురించి యేసు ముందే చెప్పిన విషయాలు మనలో నిజంగా ఆశను నింపుతాయి