కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు

భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు

“నా భర్త, వయసులో ఉన్న అమ్మాయి కోసం నన్ను వదిలేస్తున్నానని చెప్పినప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది. అదంతా తలచుకుంటే, ముఖ్యంగా తనకోసం నేను వదులుకున్న వాటిని గుర్తు చేసుకుంటే చాలా అన్యాయమనిపించింది.”—మరియ, స్పెయిన్‌.

“నా భార్య ఉన్నట్టుండి నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు నాలో ఒక భాగం చనిపోయినట్టు అనిపించింది. మా కలలు, ఆశలు, ప్లాన్‌లు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఒక్కోసారి నేను ఆందోళన నుండి బయటపడ్డాను అనిపించేది, కానీ ఆ తర్వాత మళ్లీ నిరాశలో కూరుకుపోయేవాణ్ణి.”—బిల్‌, స్పెయిన్‌.

వివాహజత నమ్మకద్రోహం చేసినప్పుడు భర్త/భార్య పూర్తిగా కృంగిపోతారు. నిజమే కొంతమంది తప్పుచేసిన వివాహజతను క్షమించి, తిరిగి తమ బంధాన్ని బలపర్చుకోవడానికి కృషిచేస్తారు. * వాళ్లిద్దరూ కలిసున్నా లేదా విడిపోయినా, నమ్మకద్రోహానికి గురైన వివాహజత తీవ్రమైన మనోవేదన అనుభవించాల్సి వస్తుంది. మరి అలాంటివాళ్లు ఆ వేదనను ఎలా తట్టుకోవచ్చు?

సహాయం చేసే బైబిలు వచనాలు

అలాంటి తీవ్రమైన మనోవేదన అనుభవించిన చాలామంది తప్పుచేయని భర్తలు/భార్యలు లేఖనాల నుండి ఓదార్పు పొందారు. దేవుడు వాళ్ల కన్నీళ్లను చూస్తున్నాడని, వాళ్ల బాధను పట్టించుకుంటున్నాడని వాళ్లు అర్థం చేసుకున్నారు.—మలాకీ 2:13-16.

“నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.”కీర్తన 94:19.

“ఆ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా ఒక కనికరం గల తండ్రిలా నన్ను ప్రేమతో ఓదారుస్తున్నట్టు ఊహించుకునేవాణ్ణి” అని బిల్‌ గుర్తుచేసుకుంటున్నాడు.

“విశ్వసనీయంగా ఉండేవాళ్లతో నువ్వు విశ్వసనీయంగా ఉంటావు.”కీర్తన 18:25, NW.

కొన్ని నెలలపాటు నమ్మకద్రోహం చేసిన తన భర్త గురించి కార్మన్‌ ఇలా చెప్తుంది: “నా భర్త నాకు ద్రోహం చేశాడు. కానీ యెహోవా ఎప్పుడూ విశ్వసనీయంగా ఉంటాడని నేను నమ్మవచ్చు, ఆయన నన్ను ఎన్నడూ నిరాశపర్చడు.”

“ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో . . . ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి; అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”ఫిలిప్పీయులు 4:6, 7.

సాషా ఇలా చెప్తుంది: “నేను ఆ వచనాలను మళ్లీ, మళ్లీ చదివాను, పదేపదే ప్రార్థించడం వల్ల దేవుడు నా జీవితంలో మనశ్శాంతిని దయచేశాడు.”

పైన ప్రస్తావించిన వాళ్లంతా ఒక్కోసారి జీవితం మీద ఆశను కోల్పోయారు. కానీ వాళ్లు యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచారు, ఆయన వాక్యం నుండి బలం పొందారు. బిల్‌ ఇలా చెప్తున్నాడు: “అంతా కోల్పోయినట్టు అనిపించినా, నా విశ్వాసం జీవితం మీద నాకు ఒక ఆశనిచ్చింది, నేను కొంతకాలం ‘గాఢాంధకారపు లోయలో’ నడిచినా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.”—కీర్తన 23:4.

^ క్షమించాలా, వద్దా అనే దానిగురించి తేజరిల్లు! (ఇంగ్లీషు) ఏప్రిల్‌ 22లోని “వివాహజత నమ్మకద్రోహం చేసినప్పుడు” అనే ఆర్టికల్స్‌ను, అలాగే తేజరిల్లు! సెప్టెంబరు 8, 1995, “జారత్వాన్ని—క్షమించాలా వద్దా?” అనే ఆర్టికల్‌ను చూడండి.