కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు రాజకీయాల్లో ఎందుకు తలదూర్చరు?

యెహోవాసాక్షులు రాజకీయాల్లో ఎందుకు తలదూర్చరు?

 బైబిలు బోధిస్తున్న కొన్ని విషయాల కారణంగా యెహోవాసాక్షులు రాజకీయాల్లో తలదూర్చరు. మేం రాజకీయ పార్టీలకు లేదా అభ్యర్థులకు ఓటు వేయం, ఎన్నికల్లో నిలబడిన వాళ్ల తరఫున ప్రచారం చేయం, ఎన్నికల్లో పోటీచేయం, ప్రభుత్వాన్ని మార్చమని చేసే ఏ పనుల్లోనూ పాల్గొనం. ఇలా చేయడం సరైనదని మేం నమ్మడానికి బైబిల్లో చాలా బలమైన కారణాలు ఉన్నాయి.

  •   రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించిన యేసు అడుగుజాడల్లో మేం నడుస్తాం. (యోహాను 6:15) ‘లోకసంబంధులుగా’ ఉండొద్దని ఆయన తన శిష్యులకు నేర్పించాడు. అంతేకాదు రాజకీయ వివాదాల్లో తలదూర్చొద్దని కూడా వాళ్లకు స్పష్టంగా చెప్పాడు.—యోహాను 17:14, 16; 18:36; మార్కు 12:13-17.

  •   మేం దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉంటాం. ఆ రాజ్యం గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:14) దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా, ఆ రాజ్యం వస్తోందని అందరికీ చెప్పే బాధ్యత మాపై ఉంది. అందుకే మేం ఉంటున్న దేశంతోసహా ఏ దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చం.—2 కొరింథీయులు 5:20; ఎఫెసియులు 6:20.

  •   అలా రాజకీయ విషయాల్లో తలదూర్చకపోవడం వల్ల మేం అన్ని పార్టీలకు చెందిన ప్రజలకు దేవుని రాజ్యసువార్తను చక్కగా చెప్పగలుగుతున్నాం. ప్రపంచంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుని రాజ్యమేనని నమ్మతున్నామని మా మాటల్లో, పనుల్లో చూపించడానికి ప్రయత్నిస్తాం.—కీర్తన 56:11.

  •   మాలో రాజకీయ విభేదాలు ఉండవు కాబట్టి మేం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా ఒకే కుటుంబంలా ఉంటున్నాం. (కొలొస్సయులు 3:14; 1 పేతురు 2:17) దీనికి భిన్నంగా రాజకీయాల్లో పాల్గొనే మతాలు ఐక్యంగా ఉండడం లేదు.—1 కొరింథీయులు 1:10.

 ప్రభుత్వాల పట్ల గౌరవం. మేం రాజకీయాల్లో పాల్గొనకపోయినా, మేం ఉంటున్న దేశంలోని ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే “ప్రతివాడును అధికారులకు లోబడియుండ వలెను” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 13:1) మేం చట్టానికి లోబడతాం, పన్నులు కడతాం, ప్రజల మంచికోసం ప్రభుత్వం చేసేవాటికి మేం సహకరిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేం ఏ పనీ చేయం, బదులుగా “రాజులకొరకును అధికారులందరికొరకును” ప్రార్థన చేయమని బైబిలు చెప్తున్నదాన్ని మేం పాటిస్తాం. ముఖ్యంగా ఆరాధించే విషయంలో ప్రజలకున్న హక్కును ప్రభావితం చేసే నిర్ణయాలను అధికారులు తీసుకుంటున్నప్పుడు మేం మరెక్కువగా ప్రార్థిస్తాం.—1 తిమోతి 2:1, 2.

 రాజకీయ విషయాల్లో సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులకున్న హక్కును మేం గౌరవిస్తాం. ఉదాహరణకు, ఎన్నికలప్పుడు మేం గొడవలు చేయం లేదా ఓటు వేయాలనుకుంటున్న వాళ్లను అడ్డుకోం.

 ఈ మధ్యకాలం నుండే రాజకీయాల్లో పాల్గొనడం మేం మానేశామా? లేదు. అపొస్తలులు, మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవులు కూడా రాజకీయాల్లో పాల్గొనలేదు. బియాండ్‌ గుడ్‌ ఇన్‌టెన్షన్స్‌ పుస్తకంలో ఇలా ఉంది, “అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత తమకుందని తొలి క్రైస్తవులు నమ్మినప్పటికీ రాజకీయ విషయాల్లో పాల్గొనాల్సిన అవసరంలేదని వాళ్లు నమ్మారు.” అదేవిధంగా, తొలి క్రైస్తవులు “రాజకీయ పదవులు చేపట్టరు” అని ఆన్‌ ద రోడ్‌ టు సివిలైజేషన్‌ అనే పుస్తకంలో ఉంది.

 మేం రాజకీయాల్లో పాల్గొనం కాబట్టి మావల్ల దేశ భద్రతకు ఏదైనా ముప్పు ఉంటుందా? లేదు. మేం శాంతిని ప్రేమించే ప్రజలం, మా విషయంలో ప్రభుత్వాలు ఏం భయపడనక్కర్లేదు. మా గురించి యుక్రెయిన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ 2001లో ఇచ్చిన రిపోర్టును గమించండి. ఆ రిపోర్టులో ఇలా ఉంది, “యోహోవాసాక్షులు రాజకీయాల్లో పాల్గొనకపోవడం ఈ రోజుల్లో చాలామందికి నచ్చకపోవచ్చు. గతంలో నిరంకుశ నాజీ, కమ్యూనిస్టు ప్రభుత్వాలు వాళ్లను తప్పుబట్టానికి కూడా అదే ఒక ప్రధాన కారణం.” అయినా సోవియట్‌ ప్రభుత్వం ప్రజలను అణచివేయాలని చూసిన సమయంలో, “చట్టానికి లోబడినవాళ్లు యెహోవాసాక్షులే. వాళ్లు నిజాయితీగా, నిస్వార్థంగా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కమ్యూనిస్టు పరిపాలకులకు ఎలాంటి హాని తలపెట్టలేదు.” గతంలోలాగే ఇప్పుడు కూడా యెహోవాసాక్షుల నమ్మకాలు ఆచారాలు “ఏ రాష్ట్ర భద్రతకు, ఐక్యతకు హాని కలిగించవు” అని ఆ రిపోర్టు చివర్లో ఉంది.