కంటెంట్‌కు వెళ్లు

టొరెంటో బుక్‌ ఫెయిర్‌లో JW.ORG

టొరెంటో బుక్‌ ఫెయిర్‌లో JW.ORG

2014, నవంబరు 13 నుండి 16 వరకు మెట్రో టొరెంటో కన్వెన్షన్‌ సెంటర్‌లో టొరెంటో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ జరిగింది. అక్కడ అచ్చు వేసిన పుస్తకాలతో పాటు ఎలక్టానిక్‌ ఫార్మేట్‌లో ఉన్న పుస్తకాలను ప్రదర్శనకు పెట్టారు. నాలుగు రోజులు జరిగిన ఆ ప్రదర్శనకు 20వేల కన్నా ఎక్కువమంది సందర్శకులు వచ్చారు.

అక్కడ ప్రదర్శన ఉంచిన వాళ్లలో యెహోవాసాక్షులు కూడా ఉన్నారు. ప్రకాశవంతమైన ఓ ఇంటరేక్టివ్‌ బూత్‌ను వాళ్లు ఆ బుక్‌ ఫెయిర్‌లో పెట్టారు. కొన్ని స్టాండ్లపై టాబ్లెట్‌ ఫోన్లను ఉంచి jw.org వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించాలో సందర్శకులకు చూపించారు.

ఆ ఈవెంట్‌ మేనేజర్లలో ఒకాయన ఇలా అన్నాడు, “మీ వెబ్‌సైట్‌ చాలా ఆధునికంగా ఉంది. ఇతర ప్రదర్శకులు మీ నుండి నేర్చుకోవాలి.” వెబ్‌సైట్‌ చాలా బాగుందని, ఉపయోగించడానికి చాలా తేలికగా ఉందని, ప్రాముఖ్యమైన ప్రశ్నలకు ఈ వెబ్‌సైట్‌లో జవాబులు ఉన్నాయని సందర్శకులు అన్నారు. ప్రజలు తమ సమస్యలను, చింతలను అధిగమించడానికి కావాల్సిన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉండడం సందర్శకులను ఆకట్టుకుంది.

అక్కడికి వచ్చిన చాలామంది ఈ బుక్‌ ఫెయిర్‌కి రాకముందు వరకు jw.org గురించి ఎక్కడా వినలేదని ఆ బూత్‌ను నిర్వహిస్తున్న సాక్షులు గ్రహించారు. దాదాపుగా అక్కడికి వచ్చిన అందరూ, మన కాంటాక్ట్‌ కార్డును లేదా జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రాన్ని తీసుకున్నారు. ఇక నుండి మన వైబ్‌సైట్‌ను చూస్తామని చాలామంది చెప్పారు. కొంతమందైతే యెహోవాసాక్షులు వచ్చి తమను ఇంటి దగ్గర కలుసుకోవాలని అడిగారు.

ప్రదర్శన జరుగుతున్న శుక్రవారం “బాలల దినోత్సవం” కావడంతో, అక్కడ బూత్‌ను నిర్వహిస్తున్న సాక్షులు వైట్‌ బోర్డు యానిమేషన్‌లను ప్రదర్శనకు ఉంచారు. వివిధ స్కూళ్ల నుండి తమ టీచర్లతో వచ్చిన విద్యార్థులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ వీడియోలను చూసి వెళ్లారు.

చికాగో నుండి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి, బైబిళ్లను ప్రింట్‌ చేసే ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన డిస్‌ప్లేలో ఉన్న పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం బైబిల్ని చూసి, దాని నాణ్యత చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఆ బైబిళ్లను ప్రింట్‌ చేసిన యెహోవాసాక్షుల్ని కలవాలనుకున్నాడు, మన కాంటాక్టు కార్డును కూడా తీసుకున్నాడు.

వెబ్‌సైట్‌లో ఉన్న 700 భాషల్లో సందర్శకులు 16 భాషలను చూశారు. అవేంటంటే అంహరిక్‌, ఇంగ్లీష్‌, ఉర్దూ, కొరియన్‌, గ్రీక్‌, చైనీస్‌, గుజరాతీ, తమిళ్‌, టైగ్రీన్య, ఫ్రెంచ్‌, పోర్చుగీస్‌, బెంగాలీ, వియత్నమీస్‌, స్పానిష్‌, స్వీడిష్‌, హిందీ.

వెబ్‌సైట్‌ గురించి ఇతరులకు చెప్పడానికి, వాళ్లకు చూపించడానికి మధ్య చాలా తేడా ఉందని సందర్శకులను ఆహ్వానించిన ఓ సాక్షి చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “వెబ్‌సైట్‌ను ఇతరులకు చూపించడానికి మాకు అద్భుతమైన అవకాశం దొరికింది.”