కంటెంట్‌కు వెళ్లు

 బిలు వచనాల వివరణ

రోమీయులు 12:12​—“నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి”

రోమీయులు 12:12​—“నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి”

 “నిరీక్షణను బట్టి సంతోషించండి. శ్రమల్లో సహనం చూపించండి. పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి.”—రోమీయులు 12:12, కొత్త లోక అనువాదం.

 “నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.”—రోమీయులు 12:12, పరిశుద్ధ గ్రంథము.

రోమీయులు 12:12 అర్థమేంటి?

 ఈ వచనంలో అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులను మూడు పనులు చేయమని ప్రోత్సహించాడు; అవి, హింస లేదా వేరే సమస్యలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండడానికి వాళ్లకు సహాయం చేస్తాయి.

 “నిరీక్షణను బట్టి సంతోషించండి.” క్రైస్తవులకు శాశ్వత జీవితం అనే అద్భుతమైన నిరీక్షణ ఉంది. కొంతమంది పరలోకంలో శాశ్వత జీవితం పొందుతారు, చాలామంది అందమైన తోటలా మారే ఈ భూమి మీద శాశ్వత జీవితం పొందుతారు. (కీర్తన 37:29; యోహాను 3:16; ప్రకటన 14:1-4; 21:3, 4) ఆ నిరీక్షణలో, మనుషుల్ని బాధపెట్టే సమస్యలన్నిటినీ దేవుని రాజ్యం a పరిష్కరించడాన్ని కళ్లారా చూడడం కూడా ఉంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) దేవున్ని ఆరాధించేవాళ్లు శ్రమల్లో ఉన్నా సంతోషించవచ్చు; ఎందుకంటే వాళ్ల నిరీక్షణ ఖచ్చితంగా నిజమౌతుంది, వాళ్లు చూపించే సహనం వల్ల దేవుని ఆమోదం పొందుతారు.—మత్తయి 5:11, 12; రోమీయులు 5:3-5.

 “శ్రమల్లో సహనం చూపించండి.” బైబిల్లో “సహనం” అని అనువదించిన గ్రీకు క్రియాపదాన్ని ఎక్కువగా, “పారిపోకుండా ఉండిపోవడం; పట్టుదల చూపించడం; స్థిరంగా ఉండడం” అనే అర్థంతో ఉపయోగించారు. క్రీస్తు అనుచరులు “లోకానికి b చెందినవాళ్లు కాదు” కాబట్టి తమకు హింస ఎదురౌతుందని వాళ్లకు తెలుసు, అందుకే వాళ్లకు సహనం అవసరం. (యోహాను 15:18-20; 2 తిమోతి 3:12) ఒక క్రైస్తవుడు దేవున్ని నమ్మకంగా సేవించినప్పుడు, చివరికి కష్టాలు సహించాల్సి వచ్చినా అలా చేసినప్పుడు, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడనే అతని విశ్వాసం బలపడుతుంది. (మత్తయి 24:13) అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు అతను ఓర్పుతో, ఆనందంతో కష్టాల్ని సహించగలుగుతాడు.—కొలొస్సయులు 1:11.

 “పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి.” క్రైస్తవులు దేవునికి నమ్మకంగా ఉండాలంటే వాళ్లు ప్రార్థిస్తూ ఉండాలి. (లూకా 11:9; 18:1) వాళ్లు ఎల్లప్పుడూ దేవుని నిర్దేశాన్ని వెదుకుతారు, అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడతారు. (కొలొస్సయులు 4:2; 1 థెస్సలొనీకయులు 5:17) వాళ్లు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, ఆయన్ని సంతోషపెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తారు కాబట్టి దేవుడు తమ ప్రార్థనలకు జవాబిస్తాడని నమ్మకంతో ఉంటారు. (1 యోహాను 3:22; 5:14) అంతేకాదు, పట్టుదలగా ప్రార్థిస్తూ ఉంటే ఎలాంటి కష్టంలో ఉన్నా నమ్మకంగా ఉండడానికి కావల్సిన బలాన్ని దేవుడు ఇస్తాడని వాళ్లకు తెలుసు.—ఫిలిప్పీయులు 4:13.

రోమీయులు 12:12 సందర్భం

 పౌలు తన ఉత్తరాన్ని దాదాపు క్రీ.శ. 56వ సంవత్సరంలో రోములో ఉన్న క్రైస్తవులకు రాశాడు. ఆ ఉత్తరంలోని 12వ అధ్యాయంలో పౌలు, క్రైస్తవ లక్షణాలను ఎలా చూపించాలో, తోటి విశ్వాసులతో అలాగే మిగతావాళ్లతో ఎలా మెలగాలో, హింస వచ్చినప్పుడు శాంతిగా ఎలా నడుచుకోవాలో చెప్తూ మంచిమంచి సలహాలు ఇచ్చాడు. (రోమీయులు 12:9-21) రోములో ఉన్న క్రైస్తవులకు ఆ సలహాలు సరైన సమయంలో అందాయని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ తర్వాత కొంతకాలానికే వాళ్లకు తీవ్రమైన హింసలు వచ్చాయి.

 కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే క్రీ.శ. 64 లో పెద్దపెద్ద మంటలు చెలరేగి రోము నగరంలో చాలా భాగం కాలిపోయింది. ఆ మంటను నీరో చక్రవర్తి అంటించాడనే వదంతి కూడా వ్యాపించింది. రోమా చరిత్రకారుడైన టాసిటస్‌ ప్రకారం, నీరో చక్రవర్తి ఆ నిందను క్రైస్తవుల మీద వేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దానివల్ల క్రైస్తవులకు తీవ్రమైన హింసలు వచ్చి ఉంటాయని అర్థమౌతుంది. హింసను ఎలా సహించాలో చెప్తూ పౌలు ఇచ్చిన సలహా, ఆ కష్టమైన పరిస్థితిని విశ్వాసంతో-హుందాగా ఎదుర్కోవడానికి వాళ్లకు సహాయం చేసింది. (1 థెస్సలొనీకయులు 5:15; 1 పేతురు 3:9) వాళ్ల ఆదర్శం నుండి ఇప్పుడున్న దేవుని సేవకులు ఎంతో నేర్చుకోవచ్చు.

 రోమీయులు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a దేవుని రాజ్యం అనేది ఒక పరలోక ప్రభుత్వం. భూమ్మీద తన ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు దాన్ని స్థాపించాడు. మరిన్ని వివరాల కోసం, “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

b బైబిల్లో, “లోకం” అనే మాట దేవునికి దూరమైన మానవ సమాజాన్ని సూచించవచ్చు.