కంటెంట్‌కు వెళ్లు

యేసుకు పెళ్లయిందా? ఆయనకు తోబుట్టువులు ఉన్నారా?

యేసుకు పెళ్లయిందా? ఆయనకు తోబుట్టువులు ఉన్నారా?

బైబిలు ఇచ్చే జవాబు

 యేసు పెళ్లి గురించి బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఆయనకు పెళ్లి కాలేదని బైబిలు స్పష్టం చేస్తుంది. a ఈ కింది విషయాల్ని పరిశీలించండి.

  1.   యేసు కుటుంబసభ్యుల గురించి, తాను పరిచర్య చేసేటప్పుడు తనతో ఉన్న స్త్రీల గురించి, చనిపోయేటప్పుడు తన దగ్గర ఉన్న స్త్రీల గురించి బైబిల్లో చాలా చోట్ల ఉన్నప్పటికీ, ఆయనకు భార్య ఉందని మాత్రం ఎక్కడా లేదు. (మత్తయి 12:46, 47; మార్కు 3:31, 32; 15:40; లూకా 8:2, 3, 19, 20; యోహాను 19:25) ఆయన నిజంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టే బైబిల్లో ఈ విషయం గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు.

  2.   దేవుని సేవ ఎక్కువగా చేయడం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేవాళ్ల గురించి మాట్లాడుతూ, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, ‘ఈ మాటను [పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం] అంగీకరింపగలవాడు అంగీకరించును గాక.’ (మత్తయి 19:10-12) దేవుని సేవ ఎక్కువగా చేయడం కోసం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకునేవాళ్లకు యేసు మంచి ఆదర్శం ఉంచాడు.—యోహాను 13:15; 1 కొరింథీయులు 7:32-38.

  3.   తాను చనిపోయేముందు, యేసు తన తల్లిని చూసుకునే బాధ్యతను వేరేవాళ్లకు అప్పగించాడు. (యోహాను 19:25-27) ఒకవేళ యేసుకు పెళ్లై ఉంటే లేదా ఆయనకు పిల్లలుంటే, తన తల్లిని చూసుకునే బాధ్యతను వాళ్లకే అప్పగించి ఉండేవాడు.

  4.   భర్తలు యేసును మాదిరిగా తీసుకోవాలని బైబిలు చెప్తున్నప్పుడు, ఆయన తన భార్యతో ప్రవర్తించిన తీరు గురించి అది చెప్పట్లేదు. బదులుగా, అది ఇలా చెప్తుంది: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, ... దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫెసీయులు 5:25-27) యేసుకు నిజంగా పెళ్లయివుంటే, ఓ భర్తగా ఆయన ఉంచిన పరిపూర్ణ మాదిరి గురించి బైబిలు ఈ వచనాల్లో ప్రస్తావించివుండేది.

యేసుకు తోబుట్టువులు ఉన్నారా?

 అవును, యేసుకు కనీసం ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. వాళ్లలో యాకోబు, యోసేపు, సీమోను, యూదా అలాగే కనీసం ఇద్దరు సహోదరీలు ఉన్నారు. (మత్తయి 13:54-56; మార్కు 6:3) వీళ్లు మరియ యోసేపులకు పుట్టిన పిల్లలు. (మత్తయి 1:25) మరియకు యేసు “తొలిచూలు” కుమారుడని బైబిలు చెప్తుంది, కాబట్టి ఆమెకు ఇంకా పిల్లలున్నారని అర్థమౌతుంది.—లూకా 2:7.

యేసు సహోదరుల గురించిన అపోహలు

 మరియ జీవితాంతం కన్యగానే ఉండిపోయిందని చెప్పడానికి, కొంతమంది “సహోదరులు” అనే పదాన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, మరియకు ముందు యోసేపుకు ఇంకొక భార్య ఉండేదని, ఆమెకు పుట్టిన పిల్లలే ఈ సహోదరులని కొంతమంది అనుకుంటున్నారు. కానీ, వాగ్దానం చేయబడిన దావీదు సింహాసనాన్ని చేజిక్కించుకునే హక్కు యేసుకు ఉందని బైబిలు చెప్తుంది. (2 సమూయేలు 7:12, 13; లూకా 1:32) ఒకవేళ యోసేపు మొదటి కొడుకు యేసు కాకుండా వేరొకరైతే, అతనే యోసేపుకు చట్టబద్ధమైన వారసుడయ్యేవాడు.

 “సహోదరులు” అనే పదం యేసు శిష్యులకు లేదా ఆధ్యాత్మిక సహోదరులకు వర్తిస్తుందా? అలా వర్తిస్తుందనుకుంటే అది లేఖనాలకు వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే బైబిలు ఒక చోట ఇలా చెప్తుంది, “ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.” (యోహాను 7:5) అవును, యేసు సహోదరులూ ఆయన శిష్యులూ ఒకటి కాదని బైబిలు చెప్తుంది.—యోహాను 2:12.

 యేసు సహోదరులు ఆయన బంధువులని ఇంకొంతమంది వాదిస్తారు. కానీ గ్రీకు లేఖనాలు “సహోదరులు,” “బంధువులు,” “సమీపజ్ఞాతి” అనే వాటికి వేర్వేరు పదాల్ని ఉపయోగిస్తున్నాయి. (లూకా 21:16; కొలొస్సయులు 4:10) చాలామంది బైబిలు విద్వాంసులు యేసు సహోదరులు, సహోదరీలు ఆయన సొంత తోబుట్టువులని గుర్తించారు. ఉదాహరణకు, ది ఎక్స్‌పోజిటర్స్‌ బైబిల్‌ కామెంట్రీ  ఇలా చెప్తుంది: “ ‘సహోదరులు’ అనే పదం, . . . మరియ యోసేపులకు పుట్టిన కొడుకులను, అంటే యేసు తల్లికి పుట్టిన, ఆయన సహోదరుల్ని సూచిస్తుంది.” b

a బైబిలు యేసును పెండ్లి కుమారుడని ప్రస్తావిస్తుంది. కానీ అక్కడున్న సందర్భాన్ని చూస్తే అది సూచనార్థక అర్థాన్ని ఇస్తుందని తెలుస్తుంది.—యోహాను 3:28, 29; 2 కొరింథీయులు 11:2.

b విన్సెంట్‌ టేలర్‌ రాసిన ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు సెయింట్‌ మార్క్‌, రెండవ ఎడిషన్‌, 249వ పేజీ, అలాగే జాన్‌ పి. మిఐ రాసిన ఎ మార్జినల్‌ జ్యూ—రీథింకింగ్‌ ది హిస్టారికల్‌ జీసస్‌, 1వ సంపుటి, 331-332 పేజీలు కూడా చూడండి.