కంటెంట్‌కు వెళ్లు

బంగారు సూత్రం అంటే ఏంటి?

బంగారు సూత్రం అంటే ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

 “బంగారు సూత్రం” అనే మాట మనకు బైబిల్లో ఎక్కడా కనిపించదు. కానీ మనం ఇతరులతో వ్యవహరించే విషయంలో యేసు ఇచ్చిన సలహాను చాలామంది బంగారు సూత్రం అని అంటారు. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.” (మత్తయి 7:12; లూకా 6:31) బంగారు సూత్రాన్ని ఇలా కూడా వివరించవచ్చు: “ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో, మీరూ వాళ్లకు అదే చేయండి.”—ఎన్‌సైక్లోపిడియా ఫిలాసఫీ.

 బంగారు సూత్రం ఏం చెప్తుంది?

 ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో మనం వాళ్లతో అలాగే ఉండాలని బంగారు సూత్రం చెప్తుంది. ఉదాహరణకు ఇతరులు మనతో గౌరవంగా, దయగా, ప్రేమగా ఉంటే మనకు నచ్చుతుంది. మరి అలాంటప్పుడు మనం ఇతరులతో “అలాగే” ఉండాలి కదా!—లూకా 6:31.

 బంగారు సూత్రం ఎలా ఉపయోగపడుతుంది?

 బంగారు సూత్రం దాదాపు మన జీవితంలో అన్నీ రంగాల్లో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు అది . . .

 పాత నిబంధనలో చాలావరకు ఈ బంగారు సూత్రం కనిపిస్తుంది. “నిజానికి ధర్మశాస్త్రం [బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు], ప్రవక్తల పుస్తకాలు బోధించేది” యేసు చెప్పిన ఆ సూత్రం గురించే. (మత్తయి 7:12) మరో మాటలో చెప్పాలంటే, పాత నిబంధన సారాంశమే సాటిమనిషిని ప్రేమించాలి అని చెప్పే బంగారు సూత్రం.—రోమీయులు 13:8-10.

 బంగారు సూత్రం అంటే ఇచ్చిపుచ్చుకోవడమేనా?

 కాదు. బంగారు సూత్రం ముఖ్యంగా ఇవ్వడం గురించే చెప్తుంది. యేసు బంగారు సూత్రాన్ని ఇచ్చినప్పుడు అందరితోనే కాదు శత్రువులతో కూడా ఎలా ఉండాలో చెప్పాడు. (లూకా 6:27-31, 35) అలా బంగారు సూత్రం ప్రతీ ఒక్కరితో మంచిగా ఉండాలని నేర్పిస్తుంది.

 మీరు బంగారు సూత్రాన్ని ఎలా పాటించవచ్చు?

  1.  1. ఇతరుల్ని గమనించండి. మీ చుట్టూ ఉన్నవాళ్ల పరిస్థితిని గమనిస్తూ ఉండండి. ఉదాహరణకు, ఎవరైనా సరుకులు మోయడానికి ఇబ్బంది పడుతుండవచ్చు. మీ పక్కింటివాళ్లు హాస్పిటల్‌లో ఉండివుండవచ్చు. లేదా మీ తోటి ఉద్యోగి నిరాశలో ఉండవచ్చు. అలాంటివాళ్లు కనిపించినప్పుడు మాటల్లో గానీ, చేతల్లో గానీ వాళ్లకు సహాయం చేసే అవకాశం మీకు దొరుకుతుంది. అలా “ఇతరుల మీద . . . శ్రద్ధ చూపిస్తూ ఉండవచ్చు.”—ఫిలిప్పీయులు 2:4.

  2.  2. సహానుభూతి చూపించండి. వేరేవాళ్ల స్థానంలోకి వెళ్లి ఆలోచించండి. ఆ పరిస్థితి మీకే వస్తే మీకెలా అనిపిస్తుంది? (రోమీయులు 12:15) ఎప్పుడైతే వేరేవాళ్ల ఫీలింగ్స్‌ని మీరు అర్థం చేసుకుంటారో వాళ్లకు సహాయం చేయాలనే కోరిక మీలో కలగవచ్చు.

  3.  3. ఇతరులకు అవసరమైంది ఇవ్వండి. అందరి అవసరాలు ఒకేలా ఉండవని గుర్తుంచుకోండి. మనం ఇతరులకు ఇవ్వాలి అనుకుంటున్నది, వాళ్లకు అవసరమైనది ఒకటే కాకపోవచ్చు. కాబట్టి మీరు ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు, బాగా ఆలోచించి వాళ్లకు ఏం అవసరమో అది చేయడానికి ప్రయత్నించండి.—1 కొరింథీయులు 10:24.