కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం | పిల్లల్ని పెంచడం

తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?

తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?

 మీరేం తెలుసుకోవాలి?

 నేడు కొన్ని సంస్కృతుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో మంచి సంబంధం కలిగివున్నారు, దానివల్ల వాళ్లు సలహాల కోసం తల్లిదండ్రుల్ని అడుగుతారు. మరోవైపు వేరే సంస్కృతుల్లో పిల్లలు ఎక్కువగా తమ వయసువాళ్లను సలహాలు అడుగుతుంటారు.

 అలా తమ వయసువాళ్లను సలహాలు అడగడం వల్ల, పిల్లలకు తమ తల్లిదండ్రుల సలహాల మీద గౌరవం తగ్గిపోతుంది. నిజానికి అలాంటి పిల్లలు టీనేజీకి వచ్చేసరికి, తమ చేయిదాటిపోయారని తల్లిదండ్రులకు అనిపిస్తుంది. దాంట్లో ఆశ్చర్యం లేదు! ఎందుకంటే, పిల్లలు తోటివాళ్లతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, వాళ్లు తల్లిదండ్రుల పెంపకంలో కాదుగానీ తోటి పిల్లల పెంపకంలో ఉన్నట్లు ఉంటుంది.

 పిల్లలు, తల్లిదండ్రుల కన్నా తమ వయసువాళ్లకు ఎందుకు అంత సులభంగా దగ్గరౌతారు? ఈ విషయాల్ని పరిశీలించండి:

  •   స్కూలు. పిల్లలు తోటి పిల్లలతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, వాళ్లకు బాగా దగ్గరౌతారు. దానివల్ల తమ గురించి, తల్లిదండ్రులు ఏం అనుకుంటున్నారనే దానికన్నా, తమ వయసువాళ్లు ఏం అనుకుంటున్నారనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెడతారు. పిల్లలు టీనేజీకి చేరుకునే సరికి అలాంటి ఆలోచన ఇంకా ఎక్కువౌతుంది.

    పిల్లలు, తమ వయసువాళ్లు ఏమనుకుంటారనే దానిగురించి ఆలోచించే బదులు, తమ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అనే దానిగురించే ఎక్కువ ఆలోచించాలి

  •   కలిసి తక్కువ సమయం గడపడం. చాలా కుటుంబాల్లో, పిల్లలు స్కూల్‌ నుండి ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు, బహుశా వాళ్ల తల్లిగానీ, తండ్రిగానీ లేదా ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లి ఉంటారు.

  •   టీనేజ్‌ లైఫ్‌స్టైల్‌. టీనేజ్‌కి వచ్చేసరికి యౌవనుల మనసంతా తమ వయసువాళ్లు వేసుకునే బట్టలు, మాట్లాడే తీరు, ప్రవర్తించే విధానం చుట్టు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల అభిప్రాయాలకన్నా, తమ వయసువాళ్ల అభిప్రాయాలకే వాళ్లు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.

  •   వ్యాపారం. వ్యాపారస్థులు ఎక్కువశాతం వస్తువుల్ని, వినోదాన్ని పెద్దవాళ్ల కోసం కాకుండా కేవలం యౌవనుల కోసమే తయారు చేస్తున్నారు. దానివల్ల తల్లిదండ్రులు, టీనేజర్లు ఒకరినొకరు అర్థంచేసుకోవడం ఇంకా కష్టమౌతోంది. డాక్టర్‌ రాబర్ట్‌ ఎప్‌స్టీన్‌ ఇలా రాస్తున్నాడు, “ఒకవేళ టీనేజర్ల లైఫ్‌స్టైలే కనుమరుగైపోతే, పెద్దపెద్ద వ్యాపార సంస్థలు వెంటనే కుప్పకూలిపోతాయి.” a

 మీరేం చేయవచ్చు?

  •   మీ పిల్లలతో ఉన్న సంబంధాన్ని బలంగా ఉంచుకోండి.

     బైబిలు ఇలా చెప్తుంది: ‘నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి; నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.’—ద్వితీయోపదేశకాండము 6:6, 7, NW.

     తమ వయసువాళ్లు పిల్లలకు స్నేహితులుగా ఉండవచ్చేమో గానీ, ఆ స్నేహితులు తల్లిదండ్రులుగా మీకున్న స్థానాన్ని ఎప్పటికీ తీసుకోకూడదు. ఒక మంచి వార్త ఏంటంటే: చాలామంది పిల్లలకు అలాగే టీనేజర్లకు తమ తల్లిదండ్రుల మీద గౌరవం ఉందని, వాళ్లు తమ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలని కోరుకుంటారని నిపుణులు చెప్తున్నారు. మీరు మీ పిల్లలతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంటే, వాళ్లమీద తమ వయసువాళ్ల ప్రభావం కన్నా మీ ప్రభావమే ఎక్కువ ఉంటుంది.

     “ప్రతీరోజూ మీరు పిల్లలతో సమయం గడపాలి. వాళ్లతో కలిసి వంట చేయడం, క్లీనింగ్‌ చేయడం, ఆఖరికి హోమ్‌వర్క్‌ లాంటివి కూడా చేయండి. సరదా కోసం చేసేవి అంటే ఆటలు ఆడడం, సినిమాలు లేదా టీవీ చూడడం లాంటివి కూడా కలిసి చేయండి. అప్పుడప్పుడు కొన్ని గంటలు చక్కగా గడిపితే సరిపోతుందని అనుకోకండి. మీరు పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడపాలి అప్పుడే మీ మధ్య దగ్గరి సంబంధం ఏర్పడుతుంది.”—లారేన్‌.

  •   మీ పిల్లలు కేవలం తమ వయసువాళ్లతోనే కాకుండా వేరేవాళ్లతో కూడా స్నేహం చేసేలా చూసుకోండి.

     బైబిలు ఇలా చెప్తుంది: ‘పిల్లవాడి హృదయంలో సహజంగానే మూర్ఖత్వం ఉంటుంది.’—సామెతలు 22:15, NW.

     కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎక్కువమంది స్నేహితులు ఉండడం చూసి సంతోషపడతారు. ఒక పిల్లవాడు తోటి స్నేహితులతో సహవసించడం వల్ల అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చేమో గానీ, మంచిచెడులు తెలుసుకునేంత పరిణతి సాధించాలంటే వేర్వేరు వయసువాళ్లతో అతను స్నేహం చేయాలి. పిల్లలకు కావాల్సిన నిర్దేశాన్ని ప్రేమగల తల్లిదండ్రులు ఇచ్చినట్టు తమ వయసువాళ్లు ఇవ్వలేరు.

     “యౌవనులకు కొన్ని విషయాలు తెలిసివుండవచ్చు, కానీ జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనేంత సామర్థ్యం వాళ్లకు ఉండదు. మంచి నిర్ణయాలు తీసుకునేలా తోటి యౌవనులకు సహాయం చేసేంత తెలివి, అనుభవం కూడా వాళ్లకు ఉండవు. అయితే యౌవనులు తమ తల్లిదండ్రుల సలహాల్ని పాటించినప్పుడు, తమ వయసుకు తగ్గ పరిణతి సాధిస్తారు.”—నాడ్య.

  •   తెలివైన సలహాలు ఇవ్వండి.

     బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.”—సామెతలు 13:20.

     మీ పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పుడు కూడా, మీతో సమయం గడపడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. కాబట్టి వాళ్లకు మంచి ఆదర్శం ఉంచండి.

     “తల్లిదండ్రులే పిల్లలకు మంచి ఆదర్శం. తల్లిదండ్రులను విలువైనవాళ్లుగా చూడడం, గౌరవించడం పిల్లలు నేర్చుకున్నప్పుడు, వాళ్లు కూడా పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల్లాగే ఉండాలని కోరుకుంటారు.”—క్యాథరిన్‌.

a టీన్‌ 2.0—సేవింగ్‌ అవర్‌ చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌ ఫ్రమ్‌ థ టోర్మెంట్‌ ఆఫ్‌ అడోలసెన్స్‌ పుస్తకం నుండి తీసుకున్నది.